చిత్తూరు జిల్లా టీడీపీలో ఆపరేషన్ ఆకర్ష్‌.. బాబుకు మరో బెంగ మొదలైనట్టేనా?

చిత్తూరు జిల్లా టీడీపీలో ఆపరేషన్ ఆకర్ష్‌.. బాబుకు మరో బెంగ మొదలైనట్టేనా?
x
Highlights

చిత్తూరు జిల్లా టీడీపీలో ఓ బలమైన కుటుంబం, అధికార పార్టీ చెంతకు చేరేందుకు ఉవ్విళ్లూరుతోందా? మొన్నటి తిరుమల పర్యటనలో సీఎం జగన్‌ను, ఆ ఫ్యామిలీ వారసుడు...

చిత్తూరు జిల్లా టీడీపీలో ఓ బలమైన కుటుంబం, అధికార పార్టీ చెంతకు చేరేందుకు ఉవ్విళ్లూరుతోందా? మొన్నటి తిరుమల పర్యటనలో సీఎం జగన్‌ను, ఆ ఫ్యామిలీ వారసుడు అందుకే కలిశాడా? టీడీపీలో ఎన్నో పదవులు పొంది, ఓడినా ఇప్పటికీ కీలకమైన పోస్టులో వున్న ఆ కుటుంబ సభ్యులు, ఫ్యాన్‌‌ మాత్రమే కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? నాటి తండ్రి బాటనే, నేడు కుమారుడు ఎంచుకున్నారా? ఈ బలమైన కుటుంబంపై వైసీపీ పెద్దలు ఎందుకు దృష్టిపెట్టారు?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ ఆపరేషన్ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు, కడప జిల్లా ‌నుంచి వైసీపీ ఎమ్మెల్యేకు ఎరవేసి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు సీన్ రిపీట్ అవుతోంది. చిత్తూరు జిల్లా నుంచి ఏకంగా చంద్రబాబు ఖజానాకే గురి పెట్టారు జగన్. తెలుగుదేశం కోశాధికారి కుటుంబానికి రెడ్‌ కార్పెట్ వేస్తున్నారట. కొన్ని రోజుల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు కుమారుడు డిఎ శ్రీనివాస్, జగన్మోహన్ రెడ్డిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలుగుదేశం పార్టీ కోశాధికారిగా కొనసాగుతున్న ఆదికేశవులు నాయుడు భార్య, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కుమారుడు, జగన్మోహన్ రెడ్డిని కలవడంతో చంద్రబాబులో కలవరం మొదలైందట. గత నెల 24వ తేదిన తిరుమలకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, డిఎ శ్రీనివాస్ కలిశారు. దాదాపు అరగంట సేపు చర్చించుకున్నారట. శ్రీనివాస్‌ను రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వెంటతీసుకొచ్చారు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అని ఆశగా ఎదురు చూస్తున్న ఎమ్మెల్యేలు, బడా నేతలతో మీటింగ్ కు అవకాశం ఇవ్వని ముఖ్యమంత్రి, డిఎ శ్రీనివాస్ కు మాత్రం తనను కలిసే అవకాశం ఇవ్వడంతో ఏదో జరుగుతోందన్న ప్రచారం జోరందుకుంది.

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మంచి పేరున్న కుటుంబాల్లో ఆదికేశవులు నాయుడు కుటుంబం ఒకటి. ఆర్థికంగా అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. రాజకీయంగా కూడా ఆదికేశవులు నాయుడు ఎంపీగా పని చేశారు. ఆయన మరణం తరువాత ఆయన భార్య సత్యప్రభ చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె, మొన్న జరిగిన ఎలక్షన్ లోనూ అదే పార్టీ నుంచి రాజంపేట పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయారు. ఓటమి తరువాత కూడా చంద్రబాబు సత్యప్రభకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చారు. కోశాధికారి హోదాను కట్టబెట్టారు. అయితే కొంత కాలంగా రాజకీయంగా ఆమె స్తబ్దుగా ఉంటున్నారు.

ఇదే సమయంలో ఆమె కుమారుడు శ్రీనివాస్, జగన్‌ను కలవడంతో డికె ఆదికేశవులు ఫ్యామిలీ మళ్ళీ ఆ గూటికే చేరుతుందా అనే చర్చ సాగుతోంది. రాజకీయాల్లో రాణించాలని గతంలో చాలా ప్రయత్నాలే చేసారు శ్రీనివాస్. తండ్రి ఆదికేశవులు ఉన్నప్పటి నుంచి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒక పర్యాయం ప్రజారాజ్యం నుంచి రాజంపేట పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత వారి కుటుంబం చంద్రబాబు పార్టీలో చేరినా, ఆయన సత్యప్రభకే ప్రాధాన్యతనిచ్చారు. అదే సమయంలో కొడుకు రాజకీయ భవిష్యత్తుపై సత్యప్రభలోనూ కొంత ఆందోళన ఉండేది. ఈ క్రమంలో డిఎ శ్రీనివాస్, జగన్‌ను కలవడంతో ఈ ఈక్వేషన్లన్నింటికీ బలం చేకూరుతోంది. డిఎ శ్రీనివాస్ వైసిపిలో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పుడు జగన్‌కు, ఆయనతో ఆ అవసరం లేకున్నా జిల్లాలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ధీటుగా నిలబడే ఆర్థిక బలం ఉన్న కుటుంబం అడ్డు తొలగాలంటే, ఇదో మార్గం. అందుకే శ్రీనివాస్‌ను లాగేసే ప్రయత్నం జరుగుతోందన్న మాటలు వినపడ్తున్నాయి.

2004లో టిడిపి నుంచి ఎంపీగా ఉన్న ఆదికేశవులు నాయుడు, అకస్మాత్తుగా పార్లమెంటులో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేసి అప్పట్లో రాజశేఖర్ రెడ్డి పంచన చేరారు. స్వతహగా రాజశేఖర్ రెడ్డికి మిత్రుడైన ఆదికేశవులు నాయుడు, ఈ షాక్ ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ఓటేసిన మరునాడే టిటిడి ఛైర్మన్ పదవి ఆయనను వరించింది. ఇప్పుడు కుమారుడు డిఎ శ్రీనివాస్ తండ్రిబాటలోనే పయనిస్తున్నారట. తల్లి తెలుగుదేశంలో ఉన్నా, కొడుకు వైసీపీ గడపెక్కడానికి కుతూహలంగా ఉన్నారట. డికె ఆదికేశవులు ఫ్యామిలీ టిడిపి పార్టీకి దూరమైతే, ఆ పార్టీకి నష్టం వాటిల్లక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి బాబు ఈ నష్టాన్ని ఎలా పూడ్చే ప్లాన్ చేస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories