YSR Vardhanthi: తండ్రిని మరిపించే తనయునిగా వై ఎస్ జగన్! నేడు దివంగత నేత వైఎస్ వర్థంతి సందర్భంగా..

YSR Vardhanthi: తండ్రిని మరిపించే తనయునిగా వై ఎస్ జగన్! నేడు దివంగత నేత వైఎస్ వర్థంతి సందర్భంగా..
x
Highlights

YSR Vardhanthi: తను పాదయాత్ర మొదలు పెట్టిన రోజే ప్రజలకు చెప్పారు... తండ్రి ఫొటో పక్కన తన ఫొటో పెట్టుకునేలా చేస్తానని...

Andhra Pradesh | తను పాదయాత్ర మొదలు పెట్టిన రోజే ప్రజలకు చెప్పారు... తండ్రి ఫొటో పక్కన తన ఫొటో పెట్టుకునేలా చేస్తానని... దానికి తగ్గట్టే వేల కిలోమీటర్ల పాదయాత్రను ఎన్ని ఇబ్బందులొచ్చినా అధిక మించారు... ఎన్ని సమస్యలు వచ్చినా లెక్కచేయలేదు. అన్ని వర్గాలకు చెందిన సమస్యలు విన్నారు. తను ఒక గ్రంధంలా సిద్ధం చేసుకున్న నవరత్నాలతో పాటు మరిన్ని అవసరాలను గుర్తించి, తాను అధికారంలోకి వచ్చినప్పట్నుంచి వాటిని నెరవేర్చేందుకు తాను పడుతున్న కష్టం ఎవరికీ తెలియంది కాదు.. ఒక పథకం తర్వాత మరో పథకం.. ఇలా తను ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి మాదిరిగానే ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తున్నారు.

నేడు తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలో సమాధి వద్ద జరిపే పూజల్లో పాల్గొనేందుకు సీఎం వెళ్లారు.

ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రతిపక్ష నేత హోదాలో చెప్పిన మాటలను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నిజం చేస్తూ ప్రజాభ్యుదయమే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వడివడిగా అడుగులు వేస్తున్నారు. 'పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మా నాన్న గారు ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను' అని చెప్పిన మాటలను నిలుపుకుంటున్నారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఐదున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. సంక్షేమానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు. కోటి ఎకరాలకు నీళ్లందించి.. రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి జలయజ్ఞం కింద 84 ప్రాజెక్టులను చేపట్టి, సింహభాగం పూర్తి చేశారు. రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు సాధించడం ద్వారా అన్నపూర్ణ నామధేయాన్ని రాష్ట్రానికి సార్థకం చేశారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులను పూర్తి చేసి.. ఐటీ రంగం, పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయడం ద్వారా ప్రగతి రథాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సంక్షేమాభివృద్ధి పథకాల అమలులో టార్చ్‌ బేరర్‌(మార్గ నిర్దేశకుడు)గా నిలిచిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమరుడై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత దిశానిర్దేశం చేసిన మార్గంలోనే గత 15 నెలలుగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక రీతిలో సంక్షేమాభివృద్ధి పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు.

మహానేత అడుగుజాడల్లో మచ్చుకు కొన్ని...

► పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలుపుకునే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు చేపట్టారు. నవరత్నాలతోపాటు 90 శాతం హామీలను ఇప్పటికే అమలు చేస్తున్నారు.

► మహానేత చేపట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను మరింత బలోపేతం చేశారు. ఫీజు ఎంతైనా సరే రీయింబర్స్‌ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రెండు వేల చికిత్సలను చేర్చి.. చికిత్స బిల్లు రూ.1,000 దాటితే.. ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. త్వరలో రాష్ట్రమంతటా ఈ విధానం అమలు కానుంది.

► అవ్వాతాతల పెన్షన్‌ను రూ.వెయ్యి నుంచి రూ.2,250కు పెంచి.. ఏటా రూ.250 చొప్పున రూ.మూడు వేలకు పెంచే ఫైలుపై సంతకం చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఉదయాన్నే అర్హులైన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతవులకు వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే పెన్షన్‌ అందిస్తున్నారు.

► మహానేత తరహాలోనే ఉచిత విద్యుత్‌.. తక్కువ వడ్డీకే పంట రుణాలు.. తదితర విషయాల్లో సీఎం వైఎస్‌ జగన్‌.. అన్నదాతలకు దన్నుగా నిలుస్తున్నారు. రైతు భరోసా కింద రూ.13,500ను పెట్టుబడిగా ఇస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో వ్యవసాయాన్ని పండగగా మార్చారు.

► మహానేత పొదుపు సంఘాలకు భారీ ఎత్తున రుణాలను పావలా వడ్డీకే అందిస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. 2019 ఏప్రిల్‌ 11 నాటికి బ్యాంకుల్లో పొదుపు సంఘాల మహిళలకు ఉన్న రుణాలను నాలుగు విడతల్లో చెల్లించేలా వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని చేపట్టారు. 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత పథకం కింద ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలను అందించే పథకానికి శ్రీకారం చుట్టారు.

ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్‌

సాక్షి ప్రతినిధి కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి ఇడుపులపాయకు చేరుకున్నారు. కడప విమానాశ్రయం, ఇడుపులపాయ హెలిప్యాడ్‌లో ఆయనకు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఇడుపులపాయ హెలిప్యాడ్‌ వద్ద సీఎం ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అక్కడి నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలతో కలిసి నడుస్తూ అతిథి గృహానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం 9.45 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories