ఏపీలో 'వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం' ప్రారంభం

ఏపీలో వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం ప్రారంభం
x
Highlights

* ఏపీలో సమగ్ర భూముల సర్వేకు శ్రీకారం * 100 ఏళ్ల తర్వాత రాష్ట్ర చరిత్రలో ఒక బృహత్తర కార్యక్రమం * కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు వద్ద ప్రారంభించనున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ * ‘మీ భూమి–మా హామీ’ నినాదంతో ప్రభుత్వం మరో పథకం * రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఆస్తుల రక్షణకై ప్రభుత్వం చేపడుతున్న మహాయజ్ఞం

అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజా సేవలో నిరంతరం వినూత్న కార్యక్రమాలు, పథకాలతో ముందుకెళ్తున్న సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం, రాష్ట్ర చరిత్రలో మరో అధ్యాయానికి తెర లేపింది. ఒక శతాబ్ధ కాలం తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూముల సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకోసం 'వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం' అమలు చేస్తోంది. సర్వే ఆఫ్‌ ఇండియా సంయుక్త భాగస్వామ్యంతో ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వం ఆ సంస్థతో అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, తక్కెళ్లపాడు వద్ద సోమవారం నాడు సీఎం శ్రీ వైయస్‌ జగన్, ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

ఎన్ని దశలు? ఎంత వ్యయం?

సర్వే ఆఫ్‌ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో మూడు దశల్లో దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో సమగ్ర భూముల సర్వే, 'వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం' అమలు చేస్తున్నారు. ఇందు కోసం 4500 బృందాలు పని చేయనున్నాయి.

తొలి దశ సర్వే ఈనెల నుంచి వచ్చే ఏడాది (2021) జూలై వరకు, రెండో దశ సర్వే 2021 అక్టోబరు నుంచి 2022 ఏప్రిల్‌ వరకు, చివరిదైన మూడో దశ సర్వే జూలై 2022 నుంచి 2023 జనవరి వరకు కొనసాగనుంది.

ఎన్ని గ్రామాలు? ఎంత భూమి?

రాష్ట్రవ్యాప్తంగా 17 వేల గ్రామాల్లోని 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు, 13,371 గ్రామ కంఠాల్లోని 85 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, 110 పట్టణ ప్రాంతాల్లోని 40 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, 10 లక్షల ప్లాట్లలో ఈ సర్వే నిర్వహిస్తారు.

సర్వే జరిగేది ఇలా..

తొలుత గ్రామ సభల ద్వారా సర్వే విధానం, షెడ్యూలు, ప్రయోజనాలు వివరిస్తారు. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శి, సర్వేయర్లతో కూడిన బృందాలు సర్వే నిర్వహిస్తాయి. డ్రోన్, కార్స్, రోవర్‌ వంటి పరికరాల ద్వారా ప్రతి స్థిరాస్తిని కచ్చితమైన భూ అక్షాంశ – రేఖాంశాలతో గుర్తించి కొత్తగా సర్వే, రెవెన్యూ రికార్డులు రూపొందిస్తారు. ప్రతి యజమానికి నోటీసు ద్వారా ఆ సమాచారం అందజేస్తారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే, గ్రామ సచివాలయంలోని గ్రామ సర్వే బృందాల ద్వారా అప్పీలు చేసుకుంటే, అవి సత్వరం పరిష్కారం అయ్యేలా ప్రతి మండలంలో మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు.

సర్వే పూర్తైన తర్వాత ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం ఇస్తారు. రెవెన్యూ రికార్డులు, ఇతర వివరాలు గ్రామాల్లో డిజిటల్‌ రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి.

సర్వే ముఖ్యాంశాలు:

– ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూఆస్తి హక్కు పత్రం

– ల్యాండ్‌ పార్సెల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం)

– రెవెన్యూ విలేజ్‌ మ్యాప్‌

– భూమికి విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు

– అభ్యంతరాల సత్వర పరిష్కారానికి మండల స్థాయిలో మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాలు

– ఉచిత వైయస్సార్‌ జగనన్న భూరక్ష హద్దు రాళ్లు

– గ్రామ సచివాలయాల్లోనే సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు

సర్వే ప్రయోజనాలు:

దళారీ వ్యవస్థకు స్వస్తి పలుకుతూ పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అవినీతికి తావు లేకుండా భూలావాదేవీలు, ప్రతి భూభాగానికి విశిష్ట గుర్తింపు సంఖ్య.

భూయజమానులకు తమ భూములపై వేరెవరూ సవాల్‌ చేయడానికి వీలు కాని శాశ్వత హక్కులు. తద్వారా భూవివాదాలకు స్వస్తి.

అస్తవ్యస్తంగా ఉన్న రికార్డుల స్వచ్ఛీకరణ. వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం రికార్డులు

ఉచితంగా సర్వే. ఆ తర్వాత ఉచితంగా వైయస్సార్‌ జగనన్న భూరక్ష హద్దురాళ్లు ఏర్పాటు. దీని వల్ల సరిహద్దు వివాదాలకు స్వస్తి.

కొన్ని చోట్ల కొందరికి సంబంధించిన రికార్డుల్లో భూమి ఒక చోట ఉంటే, వారు అనుభవిస్తున్న భూమి మరో చోట ఉండడం. ఇలాంటివన్నీ సరి చేయబడతాయి. దీంతో భూమి సబ్‌ డివిజన్‌ సమస్యలు కూడా తొలగిపోతాయి.

ఇకపై ఆస్తి, క్రయ, విక్రయ, తనఖా, దాన, వారసత్వ, ఇతర లావాదేవీలు వివాదరహితం అవుతాయి. అంతే కాకుండా ఆయా ప్రక్రియలు సులభతరం అవుతాయి. రిజిస్ట్రేషన్‌ కూడా గ్రామంలోనే చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories