ఆత్మకూరు ఉపఎన్నిక ఏకగ్రీవం కావడం వైసీపీకి ఇష్టం లేదా?

YSR Congress Party Confident of Easy Win in Atmakur Bypoll
x

ఆత్మకూరు ఉపఎన్నిక ఏకగ్రీవం కావడం వైసీపీకి ఇష్టం లేదా?

Highlights

Atmakur Bypoll: ఆత్మకూరు ఉపఎన్నిక ఏకగ్రీవం కావడం వైసీపీకి ఇష్టం లేదా? ఏకపక్షంగా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉందా?

Atmakur Bypoll: ఆత్మకూరు ఉపఎన్నిక ఏకగ్రీవం కావడం వైసీపీకి ఇష్టం లేదా? ఏకపక్షంగా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉందా? వచ్చే ఎన్నికలకు ముందస్తు సంకేతాలు పంపాలన్న వ్యూహం దాగుందా? ఇందుకోసం అధికార పార్టీ రచిస్తున్న ప్రణాళికలు ఏంటి? ఆత్మకూరులో పోటీకి సిద్ధమా అంటూ విపక్షాలను రెచ్చగొట్టే ఉద్దేశం అదేనా? భారీ మెజారిటీ కోసం వేస్తున్న ఎత్తులు ఏంటి? జనసేనతో కలిసి బీజేపీ, ఇతర స్వతంత్ర పార్టీలు పోటీలో ఉన్నా వైసీపీ నేతలు మెజార్టీ గురించే పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు?

అవును. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని నిశితంగా పరిశీలిస్తే ఈ ప్రశ్నలు సమాధానాలు కనిపిస్తాయి. దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో అనివార్యమైన ఆత్మకూరు ఉపఎన్నిక పోటాపోటీగానే మారబోతున్నట్టేగానే ఉంది చూస్తుంటే! సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఏకగ్రీవానికే అవకాశముంటుంది. వాస్తవానికి ఇదొక సాంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈ సంప్రదాయాన్ని ఈ ఉపఎన్నికలోనూ కొనసాగిస్తోంది. అయితే, మిగిలిన పార్టీలు ఈ సంప్రదాయానికి భిన్నంగా అభ్యర్థులను పోటీలో దించుతున్నాయి.

మొన్నటి తిరుపతి, బద్వేలు ఉపఎన్నికలో బీజేపీ తన అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. ఆత్మకూరులో గౌతమ్‌రెడ్డి మరణానంతరం వెల్లువెత్తిన రాజకీయ పార్టీల సానుభూతితో ఇక్కడ ఉప ఎన్నికలు ఏకగ్రీవమవుతాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, వైసీపీ అభ్యర్థి, గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డిపై బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ సహా స్వతంత్రులు నామినేషన్లు వేయడంతో పోటీ అనివార్యంగా మారింది. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు వైసీపీ కూడా ప్రయత్నాలు చేయలేదు. వాస్తవానికి, పోలింగ్‌ జరిగితేనే బెటరని, ఆ పార్టీ పెద్దలు కూడా అనుకున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. అదేంటంటే ఆత్మకూరులో భారీ మెజారిటీ సాధించి తమకు ప్రజాధరణ తగ్గలేదని ప్రతిపక్షాలకు గట్టి సంకేతాలివ్వాలనేది వైసీపీ వ్యుహంగా తెలుస్తోంది. ఆత్మకూరులో వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డికి రానున్న మెజారిటీయే రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రిఫైనల్‌గా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇందుకు అనుసరించనున్న వ్యూహం ఏంటి?

అధికార పార్టీ లక్ష్యం లక్ష.! ఊహించని విధంగా, కనీవినీ ఎరుగని మెజారిటీ రావాలి! పోటీ అంటేనే ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుట్టాలి! అందుకే ఆత్మకూరు ఉపఎన్నిక జరగాలి! ఇదీ వైసీపీ వ్యూహకర్తల ప్లాన్‌. ఈ ఉపఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తన పట్టును నిరూపించుకునేందుకు సిద్ధమవుతుందన్న భావన వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్‌యాదవ్ రంగంలో దిగారు. ఉన్నంతలో కొంత హంగు ఆర్భాటంతో కమలం పార్టీ నామినేషన్ దాఖలు చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం బీజేపీ ఐదుగురితో ఓ ఎన్నికల కమిటీని నియమించింది. కానీ ఇక్కడే వైసీపీపై విపక్షాలు రుసురుసలాడుతున్నారు. అదేంటంటే.

బద్వేలు ఉపఎన్నికలో మిగిలిన పార్టీలు పోటీకి దిగినప్పుడు సర్రున కాలిన వైసీపీ ఆత్మకూరులో మాత్రం పోటీని ఎందుకు కోరుకుంటుందన్న చర్చ జరుగుతోంది. ఇక్కడ విక్రమ్‌రెడ్డి గెలుపు నల్లేరుపై నడకే అని ప్రచారం జరుగుతన్నా వైసీపీ నాయకులు మాత్రం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఆరు మండలాల్లో కలిగిన ఆత్మకూరు నియోజకవర్గంలో మండలానికో మంత్రి మేజర్ పంచాయతీలకు కొందరు ఎమ్మెల్యేలను బాధ్యతగా అప్పగించారు. మరోవైపు మేకపాటి గౌతమ్‌రెడ్డిపై ఉన్న సానుభూతి ప్రభుత్వ సంక్షేమ పథకాలును ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతోంది. ఎలాగైనా ఆత్మకూరులో భారీ మెజారిటీ సాధించాలన్న లక్ష్యం దిశగా ప్రచారం చేస్తూ దూసుకుపోతోంది.

ఇదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వైసీపీ సవాల్ విసురుతోంది. దమ్ముంటే పోటీకి రావాలంటూ కొందరు నేతలు రెచ్చగొడుతున్నారు. ఇందుకు కూడా కారణం లేకపోలేదు. ఇటీవల టీడీపీ మహానాడు సక్సెస్ కావడంతో తమ్ముళ్లలో ఉత్సాహం పెరిగింది. ఆత్మకూరు ఉపఎన్నికలో భారీ మెజారిటీ సాధించి ప్రతిపక్షాన్ని మైనస్ చేసే మైండ్ గేమ్ స్టార్ట్ చేయాలన్న వ్యూహానికి పదునుపెడుతోంది. ఏమైనా, రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఫ్రీ ఫైనల్‌గా భావిస్తున్న ఆత్మకూరు ఉపఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ లక్ష్యం లక్ష మెజారిటీ వ్యూహం ఫలిస్తుందా..? లేక బద్వేలును మించి ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంకును కొల్లగొడుతుందా? భారీ మెజారిటీతో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ వ్యూహాత్మక ఎత్తులకు చెక్ పెట్టేందుకు పరోక్షంగా ప్రతిపక్ష టీడీపీ ఎలాంటి ప్రతివ్యూహం పన్నుతోందో వేచి చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories