చంద్రబాబును కలిసిన వైఎస్ సునీత: వివేకా హత్యకేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?

YS Sunitha Meets Chandrababu What has Happened so far in Vivekas Murder Case
x

చంద్రబాబును కలిసిన వైఎస్ సునీత: వివేకా హత్యకేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?

Highlights

వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలు చంద్రబాబును సచివాలయంలో కలిశారు. 10 నిమిషాలు చంద్రబాబుతో మాట్లాడారు.

YS Viveka Murder Case: వైఎస్ సునీత దంపతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సెప్టెంబర్ 17న సచివాలయంలో కలిశారు. తన తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి చంద్రబాబుతో ఆమె చర్చించారు. చంద్రబాబుతో సునీత భేటీ రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. గత నెలలోనే ఆమె హోంమంత్రి అనితను కలిసి వివేకా హత్య గురించి మాట్లాడారు.

చంద్రబాబుతో సునీత దంపతుల బేటి

వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలు చంద్రబాబును సచివాలయంలో కలిశారు. 10 నిమిషాలు చంద్రబాబుతో మాట్లాడారు. వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2023 డిసెంబర్ 18న కేసు నమోదు చేశారు. సీబీఐకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని తనను సునీత ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదని ఆయన కోర్టును ఆశ్రయించారు.

కొందరు నాయకుల పేర్లు చెప్పాలని సీబీఐ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని కూడా ఆ పిటిషన్ లో చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు సునీత దంపతులు, ఈ కేసును విచారిస్తున్న అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసు గురించి చంద్రబాబుతో సునీత దంపతులు చర్చించారని సమాచారం. ఈ కేసును విచారించి వాస్తవాలు బయటకు తీసుకురావాలని ఆమె కోరారని సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు వ్యతిరేకంగా సునీత ప్రచారం

ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడు వైఎస్ జగన్ కు ఓటు వేయవద్దని ఆమె ప్రచారం చేశారు. కడప పార్లమెంట్ నియోజకవర్గంలో తన సోదరి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి వైఎస్ షర్మిల కు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి జగన్ అండగా నిలిచారని ఆమె ఆరోపించారు. తన తండ్రి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై ఆమె ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై ఎన్నికల ప్రచారంలోనే జగన్ కౌంటరిచ్చారు. తన ఇద్దరు చెల్లెళ్లు వైఎస్ షర్మిల, సునీతలతో నన్ను ఓడించగలడా అని ఆయన ప్రశ్నించారు. ఆ దేవుడు, ప్రజల్ని నమ్ముకున్నా... ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నానని ఆయన చెప్పారు.

ఐదేళ్లు దాటినా కొలిక్కి రాని వైఎస్ వివేక హత్య కేసు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15 రాత్రి హత్యకు గురయ్యారు. ఇందుకు సంబంధించి కొందరు నిందితులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరును కూడా సీబీఐ అధికారులు ఎ-8 గా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ,సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి తదితరులను సీబీఐ అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో దస్తగిరి సీబీఐకి అప్రూవర్ గా మారారు. అప్రూవర్ గా మారిన తనకు బెదిరింపులు వచ్చాయని కూడా దస్తగిరి ఫిర్యాదు చేశారు.

కేసు విచారణలో అనేక మలుపులు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జగన్ ప్రభుత్వం చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ ను రద్దు చేసి ఈ కేసు విచారణకు మరో సిట్ ను ఏర్పాటు చేసింది. అప్పట్లో ఈ హత్య కేసు విషయమై టీడీపీ నాయకులపై వైఎస్ఆర్ సీపీ నాయకులు విమర్శలు చేశారు.

మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీతలు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించారు. అన్ని వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ 2020లో ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో 2021 అక్టోబర్ 26న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ , దస్తగిరిలపై సీబీఐ చార్జీషీట్ దాఖలు చేసింది.

ఇదే కేసులో మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిపై 2022 ఫిబ్రవరి 3న అనుబంధ చార్జీషీట్ ను సీబీఐ దాఖలు చేసింది. మరో వైపు ఇదే కేసులో ఉదయ్ కుమార్ రెడ్డిని ఏ 6, వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఏ 7గా సీబీఐ చేర్చింది. అయితే ఈ కేసులో ఇంకా అనేక చిక్కుముడులు వీడాల్సి ఉంది.

వివేకా రెండో పెళ్లిపై వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు

వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత చంద్రబాబుతో చేతులు కలిపారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. తాను వాస్తవాలు చెప్పినా కూడా సీబీఐ విచారించే పరిస్థితిలో లేదని ఆయన 2023 ఏప్రిల్ లో ఆరోపించారు. వివేకానందరెడ్డికి ముస్లిం మహిళతో రెండో పెళ్లి జరిగిందన్నారు. 2010లో ఆయన తన పేరును షేక్ మహ్మద్ అక్బర్ గా మార్చుకున్నారని చెప్పారు. వారికి ఓ కొడుకు కూడా పుట్టారని ఆయన చెప్పారు. రెండో భార్యకు కూడా వివేకానందరెడ్డి ఆస్తి ఇవ్వాలనుకున్నారన్నారు. అయితే ఈ కోణంలో కూడా విచారణ చేయాలని ఆయన సీబీఐని కోరారు. ఈ ఆరోపణలపై వైఎస్ సునీత తీవ్రంగా మండిపడ్డారు.

ఈ హత్య కేసు దర్యాప్తు ఎప్పుడు ముగుస్తుందో ఇంకా స్పష్టత రాలేదు. ఈ దర్యాప్తును త్వరగా పూర్తి చేసి దోషులకు శిక్షపడేలా చూడాలని సునీత కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories