Free Sand in AP: ఏపీలో బాగా కాస్ట్‌లీగా మారిన ఉచిత ఇసుక

Free Sand in AP:  ఏపీలో బాగా కాస్ట్‌లీగా మారిన ఉచిత ఇసుక
x
Highlights

Free Sand in AP: ఏపీలో మద్యం తరువాత మరో హాట్ టాపిక్ ఇసుక. కొత్త మద్యం పాలసీ ప్రకటించి, వైన్ షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించిన తరువాత ఏపీలో రాజకీయాలకు...

Free Sand in AP: ఏపీలో మద్యం తరువాత మరో హాట్ టాపిక్ ఇసుక. కొత్త మద్యం పాలసీ ప్రకటించి, వైన్ షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించిన తరువాత ఏపీలో రాజకీయాలకు ఎంత కిక్కొచ్చిందో మనం చూశాం. మద్యం షాపులు అలాటైన వారి నుంచి అధికార, ప్రతిపక్ష నాయకులు కమిషన్ల కోసం చేసిన బెదరింపులతో సిచ్యువేషన్ బాగా హీటెక్కి పోయింది.

మద్యం అంశంతో పాటు ఏపీలో ఇప్పుడు మరో అంశం కూడా హాట్ టాపిక్‌గా మారింది. అదే ఇసుక దందా. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గత ప్రభుత్వం ఇసుక దందా చేసిందని, వైసీపీ నాయకుల అక్రమాలతో ఇసుక దందా దారుణంగా మారిందని చంద్రబాబు ఆరోపించారు. మరి ఇప్పుడు ఉచిత ఇసుక పథకం కూడా ఎందుకు వివాదాస్పదం అవుతోంది? అసలు ఉచిత ఇసుకలో ఇసుకే లేదా? పేరు పెట్టినంతమాత్రాన ఉచిత ఇసుకలో ఇసుక ఉండాలని రూలేమైనా ఉందా? బందరు లడ్డులో బందరుందా? మైసూర్ పాక్‌లో మైసూర్ ఉందా? అంటూ రాష్ట్రంలో జోకులు టపాసుల్లా పేలుతున్నాయి.

రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అవలంబిస్తున్న ఉచిత ఇసుక విధానంపై రాష్ట్రంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేరుకే ఉచిత ఇసుక - ఇంటికి చేరే సరికి అంతకుముందు కంటే ఎక్కువ ఖర్చవుతోందని, స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా ఒక్క ఇసుక రేణువు కూడా కదలటం లేదని వైసీపీ ఆరోపిస్తోంది.

ఉచిత ఇసుకలో ఇసుకెంత?

ఉచిత ఇసుక విధానంపై ప్రజలు కూడా సంతోషంగా లేరు. ఎందుకు సంతోషంగా లేరంటే ఉచితంగా ఎక్కడా ఇసుక అందటం లేదు. దీనిపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఉచిత ఇసుక విధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో వివిరిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఉచిత ఇసుకపై జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో వినండి.

పక్క వీధిలో దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట. ఇసుక దోపిడీ వ్యవహారంలో చంద్రబాబుగారి మోడస్‌ ఆపరెండీ కూడా అలాగే ఉంది. గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు గారు చేస్తున్నదేంటి? అందుకే చంద్రబాబు గారినే అడుగుతున్నా రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదు. అసలు ఇసుక‌ కొందామంటేనే మా ప్రభుత్వంలోకన్నా రేటు రెండింతలు ఉంది. ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా? ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా?

ఇదీ ప్రతిపక్ష వైసీపీ నేత వైఎస్ జగన్ వాదన. ఎన్నికల ఫలితాలు వచ్చీ రాగానే టీడీపీ, కూటమి పార్టీల నాయకుల కళ్ళు ఇసుక మీద పడ్డాయన్నది నిజం కాదా అని కూడా జగన్ ప్రశ్నించారు.

స్టాక్ యార్డుల్లో 80 లక్షల టన్నుల ఇసుక ఏమైంది?

స్టాక్‌యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల ఇసుక టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ఎటు పోయింది? ఆ ఇసుకను దోచిన దొంగలెవరు... అనే ప్రశ్నలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్‌లో 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు విధానాల పుణ్యమా అని ప్రభుత్వ ఖజానాకు ఒక్క రుపాయి కూడా రాలేదని ఆరోపిస్తున్న ప్రతిపక్ష నాయకులు, అదే పొలిటికల్ ఇసుక దందాను బాబు మళ్ళీ ప్రారంభించారని దుమ్మెత్తి పోస్తున్నారు.

గతంలో చంద్రబాబు ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు. ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టుగా బిల్డప్‌ ఇచ్చారు. 2 నెలలు కాకుండానే దాన్నీ రద్దుచేసి టెండర్లు పిలుస్తామన్నారు. చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక అంటూ మెమో జారీ చేశారు. మొదటి విడత అధికారంలో ఉన్న రోజుల్లో 19 జీవోలు తెచ్చారు. అలా ఈ నది, ఆ నది అని లేకుండా ప్రతిచోటా ఇసుకను కొల్లగొట్టి వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది.

సెకండ్ రౌండులో సేమ్ టు సేమ్

ఇప్పుడు కూడా జరుగుతున్నది సేమ్‌ టు సేమ్‌. అధికారంలోకి వచ్చి 4 నెలలు అయినా ఇప్పటికీ స్పష్టమైన ఇసుక విధానం లేదు. పేరుకు ఉచితం అంటున్నారంతే. కానీ, ఇసుక రవాణాలో రాజకీయాల టోల్ గేట్ల దందా కొనసాగుతోంది.

వైసీపీ టైమ్‌లో ఏం జరిగింది?

గతంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్‌ఫాం మీద ఇ-టెండర్లు నిర్వహించింది. రీచ్‌ల వద్ద ఆపరేషన్‌ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను 475 రూపాయలకు సరఫరా చేసింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేలా చేసింది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుకరేట్లను కూడా ప్రకటించింది. తమ ప్రభుత్వం ఇసుకను తక్కువ ధరకు అందించడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చేలా చేసిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు, సెబ్ ద్వారా ఇసుక రేట్లపై నిరంతర పర్యవేక్షణ చేయించామన్న సంగతి మరిచారా అని ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏమైతేనేం, గత ప్రభుత్వ హయాంలో ఇసుక విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి దాదాపు 750 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.

వైసీపీ హయాంలో ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఆదాయం లభించిందనన్నది కాదనలేని వాస్తవం. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఇటు ప్రభుత్వానికి డబ్బు రాకుండా ఉచిత ఇసుక విధానం తెచ్చి ఏం సాధించారు. కనీసం ప్రజలకైనా తక్కువ ధరకు ఇసుక అందుతోందా అంటే అదీ లేదని విమర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఇసుక ఉచితమే అయినా అందుకు వినియోగదారులు గతంలో కన్నా రెండు – మూడు రెట్లు ఎక్కువ ఎందుకు ఖర్చు చేయాల్సి వస్తోంది? ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రశ్నలకు ఏమని బదులిస్తుంది?

Show Full Article
Print Article
Next Story
More Stories