సొంత పార్టీ నేతలతో జగన్‌కు మొదలైన తలనొప్పి.. ఏపీ వైసీపీలో ఆగమాగం..

YS Jagan Faces Heat With Own Party Leaders
x

సొంత పార్టీ నేతలతో జగన్‌కు మొదలైన తలనొప్పి.. ఏపీ వైసీపీలో ఆగమాగం..

Highlights

వైసీపీ ఇప్పుడు అధికారానికి పూర్తిగా దూరమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. టీడీపీ నేతృత్వంలో కూటమి ఘనవిజయం సాధించింది.

YSRCP: ఏపీలో వైఎస్‌ఆర్ సీపీకి రోజుకో ఎదురుదెబ్బ తగులుతోంది. పార్టీ ఓడిపోయి మూడు నెలలు కూడా కాకముందే పలువురు నేతలు పార్టీని వీడిపోతున్నారు. కార్పొరేషన్లు చేజారిపోతున్నాయి. నమ్మకస్తులైన నేతలే పార్టీని వీడిపోతుండడంతో ఆ పార్టీ అధినేత జగన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది..? ఇంకా ఎంతమంది నేతలు పార్టీని వీడే అవకాశం ఉంది..? వారు అందరు ఏపార్టీలోకి వెళతారు... ఏపీ వైసీపీలో ఏం జరుగుతోంది.

ఏపీలో ఐదేళ్లపాటు అధికారంలో ఉంది వైఎస్‌ఆర్‌ సీపీ... 2019 నుంచి 2024 వరకూ ఆ పార్టీదే ఏకఛత్రాధిపత్యం. మిగిలిన పార్టీలన్నా ఆ సమయంలో నామమాత్రంగా ఉండిపోయాయి. ఆ పార్టీ చెప్పినట్లే అధికారులు నడుచుకున్నారు. వ్యవస్థలన్నీ వాళ్లకు అనుకూలంగా పనిచేశాయి. దీంతో మిగిలిన పార్టీలన్నీ కనుమరుగైపోవడం ఖాయమనుకున్నారు. అయితే సీన్ కట్ చేస్తే తాజా ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సీపీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.

ఓటమిని ఎవరైనా జీర్ణించుకుంటారు.. కానీ ఇంతటి పరాభవాన్ని మాత్రం వైఎస్‌ఆర్‌ సీపీ అస్సలు ఊహించలేదు. ఇంతగా ఓడిపోవడానికి కారణాలను అన్వేషించుకోకుండా.. మేం మంచే చేశాం.. అయినా ప్రజలు మమ్మల్ని ఓడించారు.. అన్నట్టు మాట్లాడడం మొదలు పెట్టారు వైసీపీ నేతలు. వాస్తవానికి వైఎస్‌ఆర్‌ సీపీ అధికారంలో ఉన్నప్పుడు కక్షసాధింపు రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చిందని చెప్పుకోవాలి.. చంద్రబాబు సహా పలువురు నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపించింది. ఇలాంటి వాటిని ప్రజలు అస్సలు సహించలేదు.

ప్రజల విషయాన్ని పక్కన పెడితే... కనీసం సొంత పార్టీ నేతలు కూడా ఇలాంటి రాజకీయాలు కోరుకోలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయాలను అధినేత జగన్‌కు చెప్పే అవకాశం లేకపోయింది. ఆయన కూడా సీఎంఓలో కొంతమందికి పెత్తనం అప్పగించారు. ఏదైనా వాళ్లతోనే మాట్లాడాలని చెప్పే వారు. దీంతో పార్టీ నేతలు కూడా అధినేతకు దూరమయ్యారు. వాస్తవాలు ఆయన వరకూ చేరలేదు దాని ఫలితమే ఇప్పుడు ఎన్నికల్లో ఘోర పరాజయం.

వైసీపీ ఇప్పుడు అధికారానికి పూర్తిగా దూరమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. టీడీపీ నేతృత్వంలో కూటమి ఘనవిజయం సాధించింది. ఒకవేళ కూటమి కూడా రివెంజ్ పాలిటిక్స్‌కు తెరలేపితే.. వైసీపీలో మెజారిటీ నేతలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఒకవేళ అలా జరగకపోయినా వైసీపీలో ఉంటే నేతలకు పనులు జరగవు. అధికార పార్టీలో ఉంటే కేసుల నుంచి తప్పించుకోవచ్చు. నియోజకవర్గానికి కాస్తో కూస్తో మేలు చేయొచ్చు. ఈ ఉద్దేశంతోనే పలువురు నేతలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.

రాజ్యసభలో వైసీపీకి 11 మంది సభ్యుల బలముంది. అయితే ఇప్పటికే ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా లేఖలు సమర్పించారు. మరో ఆరుగురు కూడా త్వరలోనే రాజీనామా చేస్తారని సమాచారం. అదే సమయంలో 10 మంది దాకా ఎమ్మెల్సీలు కూడా వైసీపీని వీడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పోతుల సునీత ఇప్పటికే రాజీనామా ప్రకటించారు. అదే బాటలో మరికొందరు కూడా పయనించబోతున్నారు. వీళ్లంతా కూటమి పార్టీలో చేరబోతున్నారు.

ఇన్నాళ్లూ రాజ్యసభ, శాసనమండలిలో తమకే బలం ఉందని.. అధికార పార్టీకి అక్కడ చెక్ పెట్టొచ్చని జగన్ భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ రెండు చోట్ల కూడా వైసీపీని నామమాత్రం చేసేందుకు కూటమి సిద్ధమైంది. అక్కడ కూడా వైసీపీని వీక్ చేయడం ద్వారా ఆ పార్టీకి పూర్తిగా చెక్ పెట్టాలనేది కూటమి వ్యూహంగా కనిపిస్తోంది. అంతేకాక రాష్ట్రంలోని కార్పొరేషన్లు, జడ్పీ పీఠాలను కూడా కూటమి కైవసం చేసుకునేందుకు తెరవెనుక స్కెచ్ వేసింది. వీలైనంత త్వరగా వీటిని కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. అయితే వైసీపీలో మొదటి నుంచి ఉన్న నేతలు కూడా ఇప్పుడు పార్టీ మారుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే పార్టీని ప్రజాస్వామ్య పద్ధతిలో నడపకపోవడం, నేతలకు విలువ ఇవ్వకపోవడం లాంటి అంశాలు వాళ్లను పార్టీకి దూరం చేస్తున్నట్టు అర్థమవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories