మౌనం లేదంటే మాటల మంటలు ట్రబుల్‌లో వైసీపీ ట్రబుల్ షూటర్స్
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మాటల వాగ్భాణాలు వదిలారు. ఇప్పుడు వైసీపీ నేతలు అధికార పక్షంలోకి వచ్చారు. ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలకు దీటైన బాణం వదలడంలో...
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మాటల వాగ్భాణాలు వదిలారు. ఇప్పుడు వైసీపీ నేతలు అధికార పక్షంలోకి వచ్చారు. ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలకు దీటైన బాణం వదలడంలో విఫలం అవుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. పార్టీలో ఎలాంటి సంక్షోభం తలెత్తినా, రంగంలోకి దిగే ట్రబుల్ షూటర్లు, ఇప్పుడు మాత్రం వ్యూహరచనలో వెనకబడ్డారన్న వ్యాఖ్యానాలూ వినపడుతున్నాయి. మౌనం లేదంటే మాటల మంటలే అన్నట్టుగా, వైసీపీలో కొందరు సీనియర్లు వ్యవహరిస్తున్నారన్న కామెంట్లు బాగా వినిపిస్తున్నాయి. పీఎంపై సీనియర్ నేత చేసిన కామెంట్ల కలకలమే ఇందుకు నిదర్శనమంటున్నారు. పార్టీ అధినేత రాష్ట్రంలో లేని టైంలో, ఇలాగేనా సీనియర్ల వ్యవహారమంటూ, వైసీపీలోని కొందరు నేతలు బాహాటంగా నోటికి పని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అమెరికా పర్యటనలో ఉండగా, ఇక్కడ జరగాల్సిన రాజకీయాలన్నీ జరిగిపోతున్నాయి. వరదలు, పోలవరంపై హైకోర్టు నిర్ణయాలు, అమరావతిపై బొత్స సంచలన వ్యాఖ్యలు, పీఎంవో సీరియస్‌గా స్పందించడం, ఇలా అధికారంలోకి వచ్చి వందరోజులైనా పూర్తికాకముందే, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కాయి. ప్రభుత్వ రథసారథి, తమ పార్టీ అధినేత దేశంలో లేని సమయంలో, పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి పరువు నష్టం రాకుండా, చూసుకోవాల్సిన సీనియర్లే, మాటల తూటాలు పేల్చడంతో, ఏపీలో ప్రకంపనలు రేగుతున్నాయి.
అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌లో ప్రస్తుతం సీనియర్ నేతల తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధికారంలో వున్నప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, సీనియర్ నేతలు ముందుండేవారు. పార్టీలో ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మిగిలిన సీనియర్ నేతలు వ్యూహ రచనలో నిమగ్నమయ్యేవారు. ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకం అవుతుంటే, తెర వెనుక మంత్రాంగం నడిపించేవారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సీనియర్ నేతలకు ప్రభుత్వ పదవులు వచ్చాయి. విజయసాయిరెడ్డి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా వున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఇక మిగిలిన సీనియర్ నేతలు కొందరు, మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటే, ఇంకొందరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్యేలు నియోజక వర్గాలకు, మంత్రులు ఆయా శాఖలకే పరిమితం అయ్యారు. పార్టీని పట్టించుకునే వారే కరువయ్యారు.
ఇక వైసీపీ అధికారం చేపట్టిన తరువాత పార్టీ వ్యవహారాలపై సీనియర్లు దృష్టిపెట్టడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలపై విపక్షాలు పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఓవైపు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నా, వాటిని ప్రజలకు వివరించడంలో విఫలం అవుతున్నారన్న విమర్శలు సొంత పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతున్నాయి. పార్టీ సీనియర్లు ఇతర బాధ్యతల్లో బిజీగా ఉంటే మిగిలిన నేతలు పార్టీ గురించి పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
సీనియర్ నేతలు కొందరు తాము పార్టీ కోసం ఎంత కష్టపడ్డా క్యాబినెట్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పదవులు అనుభవించే వారే, పార్టీ బాధ్యతలు కూడా చూసుకోవాలని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారని పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి.
అయితే మౌనం, లేదంటే మాటల మంటలు అన్నట్టుగా తయారైంది వైసీపీలో ట్రబుల్ షూటర్ల పరిస్థితి. అమరావతిపై సంచలన ప్రకటనలు, పోలవరం రీటెండర్లు, గత ప్రభుత్వ నిర్ణయాల పున:సమీక్ష లు ప్రకంపనలు సృష్టిస్తుంటే, ఈ నిర్ణయాలన్నీ ప్రధానమంత్రి ఆశీస్సులతోనే తీసుకుంటున్నామని, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం కలకలం రేగుతోంది. విజయసాయి మాటలను, పీఎంవో సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. వెంటనే విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు విజయకల్లాంను పిలిపించుకుని వివరణ అడిగినట్టు సమాచారం. మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ‌్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా, విజయసాయి వ్యాఖ్యలను ఖండించారు. ఇలా అధినేత రాష్ట్రంలో లేని సమయంలో, ప్రకంపనలు సృష్టించేలా నేతలు వ్యాఖ్యానాలు చేయడంపై, సొంత పార్టీలోనే ఆగ్రహం వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. జాగ్రత్తగా మాట్లాడాల్సిన నేతలు, వివాదాస్పదంగా మాట్లాడంపై అసహనం పెరుగుతోంది.
మొత్తానికి వైసీపీ ట్రబుల్ షూటర్స్ ట్రబుల్‌లో పడుతున్నారు. అయితే మౌనం లేదంటే కాంట్రావర్సియల్ కామెంట్లతో పార్టీ, ప్రభుత్వ పరువు తీస్తున్నారని, కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షాల చేతికి ఆయుధాలివ్వకుండా, జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిపోయి, చిక్కుల్లో పడుతున్నారని, సొంత పార్టీ నాయకుల నుంచి విమర్శలు వస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే ఇవన్నీ అధినేత జగన్‌కు తెలిసే జరుగుతున్నాయో, తెలియక జరుగుతున్నాయో, వీటన్నింటిపై నేతలకు జగన్ ఎలాంటి క్లాస్ తీసుకుంటారో చూడాలని, నేతలు అంటున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire