కోడెల మీద వైసీపీ ఎక్కుపెడుతున్న మరో అస్త్రమేంటి?

కోడెల మీద వైసీపీ ఎక్కుపెడుతున్న మరో అస్త్రమేంటి?
x
Highlights

మాజీ శాసన సభాపతిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ రోజుకో అస్త్రాన్ని సంధిస్తోంది. రకరకాల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు మరో ఆయుధం వెలికి...

మాజీ శాసన సభాపతిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ రోజుకో అస్త్రాన్ని సంధిస్తోంది. రకరకాల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పుడు మరో ఆయుధం వెలికి తీశామంటోంది. అదీ కూడా హైదరాబాద్‌ కేంద్రంగా సాగిన కుంభకోణమని ఆరోపిస్తోంది. ఇంతకీ వైసీపీ సంధిస్తున్న ఆయుధమేంటి?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌‌ చుట్టూ రోజుకో ఆరోపణ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు మరో సంచలన అస్త్రం సంధిస్తోంది వైసీపీ. హైదరాబాద్‌లోని పాత, కొత్త శాసన సభ్యుల నివాస ప్రాంగణం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్. ఈ భవనాలను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శాసనసభ్యులకు కూడా నివాసం ఉండేందుకు విభజన చట్టం ప్రకారం వెసులుబాటు కల్పించింది కేంద్రప్రభుత్వం. అదే ఇప్పుడు మాజీ స్పీకర్‌‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

హైదరాబాద్‌లోని న్యూ,ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గత స్పీకర్ కోడెల ఆధ్వర్యంలో భారీ అవినీతి జరిగిందన్నది వైసీపీ ఆరోపణ. హైదరాబాద్‌లోని పాత,కొత్త శాసన సభ్యుల నివాస ప్రాంగణం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శాసనసభ్యులకు కూడా నివాసం ఉండేందుకు అవకాశం కల్పించింది విభజన చట్టం. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు శాసన సభ్యులు, అలాగే కొందరు శాసన మండలి సభ్యులు కూడా వీటిలో నివాసం ఉన్నారు. క్వార్టర్స్‌ను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయించే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉంటుంది.

అదే అధికారాన్ని ఉపయోగించుకుని అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్, అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తోంది వైసీపీ. ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ మొత్తం అమరావతి నుంచి కార్యకలాపాలు సాగించడం మొదలైన నాటి నుంచి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలామంది విజయవాడకే పరిమితమయ్యారు. దీంతో ఖాళీగా ఉన్న భవనాలను ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిచ్చి సొమ్ము చేసుకున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

తన వ్యక్తిగత కార్యదర్శి, అదే కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పని చేసిన మరో ఎంప్లాయి, అప్పటి అసెంబ్లీ కార్యాలయంలో కీలకమైన అధికారి సహకారంతో దాదాపు 20కిపైగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ప్రైవేట్ వ్యక్తులకు అద్దెకు ఇచ్చారని ఆరోపిస్తోంది వైసీపీ. ఒక్కో ఎమ్మెల్యే క్వార్టర్‌ను అద్దెకు ఇచ్చి, దాని ద్వారా నెలకు ఒక్కో ఇంటికి 20 వేల రూపాయల చొప్పున వసూలు చేశారని అంటోంది వైసీపీ. ఐదేళ్లపాటు ఈ తతంగం జరిగిందని అంటోంది.

నాడు స్పీకర్ కార్యాలయం వేదికగా భారీ అవినీతి జరిగిందని వైసీపీ ఆరోపణలు సంధిస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ నేతలు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన భవనాలను, తెలంగాణ సర్కార్‌కు అప్పగిచడంతో ఒక్కో అవినీతి గుట్టు వీడుతోందని అంటోంది వైసీపీ.

ఇప్పటికే గుంటూరులోని కోడెల అపార్ట్‌మెంట్‌‌లో పలు ఫ్లాట్లను, ప్రభుత్వ శాఖలకు అధిక మొత్తానికి అద్దెకిచ్చి, భారీగా అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపించారు. కొడుకు, కుమార్తెలు సైతం అవినీతికి ఒడిగట్టారని పలు కేసులు కూడా నమోదు చేశారు. వాటి లెక్కలు కూడా బయటపెట్టారు. తాజాగా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌‌ను ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా అద్దెకిచ్చారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.

మొత్తానికి రకరకాల ఆరోపణలతో కోడెల వర్గం ఉక్కిరిబిక్కిరవుతోందని, టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. అయితే తనపై వైసీపీ నేతల ఆరోపణలు అవాస్తవాలని కొట్టిపారేస్తున్నారు కోడెల. చూడాలి, అసెంబ్లీ భవనాల అద్దె వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories