సీఎం జగన్‌కు తలనొప్పిగా మారిన ఆ లీడర్లు ఎవరు?

సీఎం జగన్‌కు తలనొప్పిగా మారిన ఆ లీడర్లు ఎవరు?
x
సీఎం జగన్‌కు తలనొప్పిగా మారిన ఆ లీడర్లు ఎవరు?
Highlights

సీఎం జగనేమో మేనిఫెస్టో, నవరత్నాలూ అంటూ ఒక్కోటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. కానీ...

సీఎం జగనేమో మేనిఫెస్టో, నవరత్నాలూ అంటూ ఒక్కోటి అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యేలకు చెబుతున్నారు. కానీ జగన్‌కు కొత్త తలనొప్పి మొదలైందట. తానొకటి తలిస్తే, నియోజకవర్గాల్లో మరోటి తలుస్తున్నారట?

వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తోంది. మేనిఫెస్టో హామీలను, నవరత్నాలనూ దగ్గర పెట్టుకుని, ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, ముందుకు పోతున్నారు సీఎం జగన్. అలాగే ఎమ్మెల్యేలను సైతం అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ, రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు అడుగులు వేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల కోల్డ్‌వార్‌, జగన్‌కు కొత్త తలనొప్పులు తెస్తున్నాయట. అధినేత పాలనలో బిజీగా ఉండటంతో అనేక ప్రాంతాలలో వైసీపీ నేతల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. ఒకరితో ఒకరు సఖ్యతగా ముందుకెళ్లాలని అధినేత చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి, ఒకరిపై ఒకరు ఆధిపత్య ప్రదర్శన చేస్తున్నారట.

ప్రస్తుత రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో అనేక మంది ప్రజాప్రతినిధుల మధ్య నిప్పులేకుండానే తగలపడేంతగా విభేదాలు రాజుకుంటున్నాయట. గతంలో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎంపీ నందిగం సురేష్‌ మధ్య విభేదాలు సీఎం వరకూ వెళ్లాయి. తాజాగా నరసరావుపేట ఎంపీ, ఆ పరిధిలోని మహిళ ఎమ్మెల్యే మధ్య విభేదాలు రచ్చరచ్చయ్యాయి. పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో అప్పటికప్పుడు సైలెంటయినా, లోలోపల వారిద్దరూ ఇంకా రగిలిపోతూనే వున్నారన్న చర్చ జరుగుతోంది.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో తోట త్రిమూర్తులు వర్గం వైసీపీలో చేరేందుకు ఒక సభ ఏర్పాటు చేస్తే, అదే సెగ్మెంట్‌ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇక ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి, ఒంగోలు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలకీ మధ్య ప్రతీ చిన్న చిన్న విషయాల్లోనూ పోటీలు, పంతాలు పెరిగిపోతున్నాయని వైసిపి నేతలు మాట్లాడుకుంటున్నారట.

ఇక కర్నూలు నియోజకవర్గంలోనైతే, కోల్డ్‌వార్‌ ఓ రేంజ్‌లో వుంది. ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి మధ్య నువ్వానేనా అన్నట్టుగా యుద్ధం సాగుతోంది. సెగ్మెంట్‌లో వుంటేగింటే నువ్వన్నా వుండాలి, లేదంటే తానైనా వుండాలన్నట్టుగా ఉనికి కోసం యుద్ధం చేస్తున్నారట నేతలు. ఎమ్మెల్యే హఫీజ్‌కు తెలీకుండా, నియోజకవర్గంలో వలసలను ప్రోత్సహిస్తున్నారట ఎస్వీ మోహన్‌ రెడ్డి. అధికారులను సైతం ప్రభావితం చేస్తున్నారని ఫైరవుతున్నారట హఫీజ్. దీంతో వీరి పంచాయతీ ఏకంగా సీఎం జగన్‌ దగ్గరకు వెళ్లింది.

ఇలా రోజుకొక ప్రాంతంలో ప్రజాప్రతినిధుల మధ్యనే కాకుండా, జిల్లా ఇంఛార్జీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. వీటికి కారణం నియోజవర్గంలో పైచేయి సాధించడానికేనని కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. నేతల విబేధాలతో కార్యకర్తలు వర్గాలుగా విడిపోతునట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. జిల్లా ఇంచార్జిలు సైతం నేతల మధ్య సఖ్యత తీసుకురావడంలో పూర్తిగా విఫలం అవుతున్నట్లు గట్టి చర్చ నడుస్తుంది.

ఒకవైపు వైసీపీ అధినేత సిఎం జగనేమో, స్థానిక ఎన్నికల కోసం నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశాలిస్తున్నారు. కానీ నేతలేమో బాహాటంగానే తమ విభేదాలను ప్రదర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారు ముఖ్యనేతలకు అసలు ప్రాధాన్యత ఇవ్వడం లేదట. అంతేకాదు, తమ ప్రత్యర్థులు పార్టీలోకి రావడాన్ని సహించలేకపోతున్నారట. దీనికితోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఒకరైతే, పార్టీ ఇన్‌చార్జీగా మరొకరు వుండటం కూడా, నేతల మధ్య వైరానికి కారణమవుతోందట. ఈ విభేదాలు మొత్తం పార్టీకే ఇబ్బందికరంగా మారుతున్నాయని, వచ్చే లోకల్‌ ఎలక్షన్స్‌నూ ప్రభావితం చేస్తాయని కార్యకర్తలు, పార్టీ అగ్రనేతలు టెన్షన్‌ పడుతున్నారట. విభేదాలు మరిచి కలిసి పని చేయకపోతే, ఇక తీవ్ర చర్యలు తప్పవని సీఎం జగన్‌ సైతం, ముఖ్య నేతలతో సంకేతాలిప్పించారట.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories