వైసీపీలో ఎమ్మెల్సీ పోరు కొత్త చిచ్చు రగిలిస్తోందా?

వైసీపీలో ఎమ్మెల్సీ పోరు కొత్త చిచ్చు రగిలిస్తోందా?
x
Highlights

మొన్ననే మంత్రి పదవులతో వైసీపీలో అసంతృప్తి జ్వాల రగిలింది. ఇప్పుడు మరో పదవుల పందేరం, మరోసారి ఆశానిరాశల సమరానికి సిద్దమవుతున్న సంకేతం అందుతోంది....

మొన్ననే మంత్రి పదవులతో వైసీపీలో అసంతృప్తి జ్వాల రగిలింది. ఇప్పుడు మరో పదవుల పందేరం, మరోసారి ఆశానిరాశల సమరానికి సిద్దమవుతున్న సంకేతం అందుతోంది. ప్రాంతాలవారీగా, సామాజికవర్గాల వారీగా సమతూకం పాటించాలని సీఎం జగన్‌ తపిస్తుండగా, ఆవావహుల సంఖ్య చాంతాండంత ఉండటంతో, అసంతృప్తి రేగే అవకాశముందని ఆలోచిస్తున్నారు వైసీపీ అధినేత.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల వేడి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా, పెద్దల సభ ఎన్నికలతో మరోసారి గరంగరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మూడు స్థానాల్లో రెండు వైసీపీవి కాగా, ఒకటి టీడీపీది.

గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఉన్న ఆళ్ల నాని ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. విజయనగరం నుంచి వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించిన కోలగట్ల వీరభద్ర స్వామి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించారు. మరోవైపు టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న కరణం బలరాం, చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ పదవికి రాజీనామా చేశారు. దీనితో ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

అయితే ఈ మూడు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. అధికార పార్టీ కావడం, రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గ విస్తరణ ఉండటంతో చాలా మంది నేతలు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ సీటు దక్కించుకోవలని ఆరాటపడుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ కోసం నేతల తీవ్రంగా పోటీపడుతున్నారు.

గత ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయిన మోపిదేవి వెంకట రమణకు, తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు జగన్. ఆరు నెలల్లోపు చట్ట సభకు ఎన్నిక కావలిసి ఉంది. వచ్చే మూడు ఎమ్మెల్సీ స్థానాలలో మోపిదేవికి సీటు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మొన్నటి ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇక్బాల్‌కు మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ చేస్తా అని జగన్ హామీ ఇచ్చారు. అయితే మెదటి విడతలో ఎమ్మెల్సీ సిటు ఆయనకు కేటాయిస్తారా లేదంటే వచ్చేసారి అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఇక్బాల్‌కి అవకాశమిస్తే, రెండు స్థానాలు భర్తీ అవుతాయి. ఇక మిగిలిన ఒక్క సీటు కోసం పార్టీలో పోటీ నెలకొంది. ప్రాంతీయ, సామాజిక సమీకరణలు దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్సీ సీటుని ఎంపిక చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు.

గుంటూరు జిల్లా నుంచి పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌ని ఎమ్మెల్సీ చేసి, మంత్రి చేస్తా అని గతంలో హామీ ఇచ్చారు జగన్. కడప జిల్లా నుంచి ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి గత ఎన్నికల్లో తన సీటు త్యాగం చేశారు. ఆయనకి ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఒక్కో జిల్లా నుంచి ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీలో వున్నారు.

వైసీపీలో ఎమ్మెల్సీ సీటుకి తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో సీఎం జగన్ ఎవరికి అవకాశం ఇస్తారోనన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఎవరికిచ్చినా పార్టీలో అసంతృప్తి రేగడం ఖాయమని నేతలంటున్నారు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పార్టీ అధినేతకు కత్తి మీద సాములా మారిందంటున్నారు పార్టీ నాయకులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories