Vizag steel Plant issue: లోకేష్ విమర్శలపై మండిపడ్డ వైసీపీ నేతలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏపీని ఒక్కసారిగా కుదిపేసింది. కేంద్రం నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన సెగలు రగులుతున్నాయి. కార్మి్క సంఘాల నుంచి...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏపీని ఒక్కసారిగా కుదిపేసింది. కేంద్రం నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన సెగలు రగులుతున్నాయి. కార్మి్క సంఘాల నుంచి రాజకీయ వర్గాల వరకు ఇప్పుడు అందరి నోటా ప్లాంటును ప్రైవేట్ పరం చేయొద్దన్న డిమాండే వినిపిస్తోంది. రోజురోజుకూ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. మరి స్టీల్ ప్లాంట్ పోరు లక్ష్యం వైపు సరైన అడుగులు వేస్తోందా..? ఉద్యమం పక్కదారి పడుతోందా? సంఘటితంగా నడపాల్సిన పోరాటంలో అసలు ఈ సందిగ్ధ పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఉక్కు పోరాటం ఉధృతమవుతోంది. కేంద్రం నిర్ణయంపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. పెల్లుబికిన ఆగ్రహంతో కార్మికలోకం భగ్గుమంటే.. త్యాగాల ఫలితాన్ని వృథా చేయొద్దంటూ గళం కలిపాయి రాజకీయ పార్టీలు. అయితే ఇప్పుడు ఆ రాజకీయ పార్టీలే ఉద్యమాన్ని నీరు గార్చే పరిస్థితులొచ్చాయనే ఆందోళన నెలకొంది.
ఉద్యమం ఏదైనా నడిపించే నాయకుడెవరైనా.. పట్టుదలతో పాటు ఏకతాటిపై నిలుస్తేనే లక్ష్యాలు నెరవేరతాయి. లక్ష్యం.. ప్రణాళిక ఎంత ముఖ్యమో.. అందరినీ సంఘటితం చేయటం అంతకంటే ముఖ్యం. అయితే విశాఖ ఉక్కు పోరాటం ఆ దిశగా సాగే పరిస్థితులు కనిపించడం లేదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ఉక్కు శాఖ కింద పని చేస్తూ, నవరత్నాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. దీర్ఘకాల పోరాటం 32 మంది త్యాగాలతో ఈ సంస్థ ఏర్పాటైంది. అలాంటి స్టీల్ ప్లాంట్ కోసం మళ్లీ పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ప్రైవేటీకరణ కాకుండా సంస్థకు చేయూత అందించాలని కోరారు. ప్రత్యేక గనులు కేటాయిస్తే విశాఖ ప్లాంటు లాభాలు గడించడం సులభమవుతుందనే కీలక సూచనలు చేస్తూ లేఖ రాశారు. అయితే పరిస్థితి చేయి దాటాక జగన్ లేఖలు రాస్తూ కూర్చుంటే ఫలితం ఏమీ ఉండదని స్వయంగా రంగంలోకి దిగి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలతో పాటు ప్రజా సంఘాలు, విపక్షాలు సైతం వ్యతిరేకంగా నిలిచాయి. స్టీల్ ప్లాంట్ కేంద్రంగా మొదలైన నిరసనలు కాస్తా ఉద్యమరూపం దాల్చాయి. ఓ వైపు కార్మిక సంఘాలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాయి. వామపక్షాలు వారికి మద్దతునిస్తున్నాయి. ఇక ఇప్పటికే సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాయగా.. వైసీపీ నేతలు కార్మిక సంఘాలకు మద్దతు ప్రకటించారు.
అందరు ఒకే వేదిక మీదకు రావాలని అన్ని రాజకీయ పార్టీలు పిలుపునిస్తున్నారు తప్ప ఆచారణలో ఎవ్వరు ముందుకు రావటం లేదు. టీడీపీ ఒంటరిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగిస్తోంది. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఆమరణ దీక్షతో ఉక్కు ఉద్యమాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేసింది. ఈ దీక్షకు మద్దతు తెలిపిన లోకేష్.. కార్మికుల వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో కేవలం తమ పార్టీ మైలేజి కోసం టీడీపీ పని చేస్తుందనే విమర్శలు వస్తు్న్నాయి.
ఇక వైసీపీ ఇప్పటికే కార్మికుల ఆందోళనలకు మద్దతు ప్రకటించింది. వామపక్షాలు తమ కార్మిక సంఘాల శాఖలతో కలిపి ఆందోళన లు కొనసాగిస్తున్నారు. బిజెపి, జనసేన అడపా దడపా మేమున్నామని హడావుడి చేస్తున్నాయే తప్ప పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఇలా ఎవరికి వారు నిరసనలు తెలిపి.. ఐక్యంగా ఉద్యమం చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇలా సొంత ఎజెండాలతో పార్టీలు ముందుకు వెళ్లడమే తప్ప కలిసి పోరాడదామనే ఆలోచన ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. పైగా ఉద్యమాన్ని రాజకీయ దారి పట్టించే దిశగా నాయకులు చేస్తున్న ప్రసంగాలు అసలు ఐక్యత సాధిస్తారా? లేదా అనే ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
రాజకీయాలకు అతీతంగా పోరాటం చేద్దామంటూనే వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడే ప్రైవేటీకరణ ఆలోచన చేస్తే అడ్డుకోలేదని వైసీపీ విమర్శిస్తుంటే.. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి తెలిసే జరుగుతోందని కౌంటర్లు వేస్తోంది టీడీపీ. మరోవైపు వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఏ పార్టీకి ఆ పార్టీ పొలిటికల్ మైలేజ్ కోసం ప్రాకులాడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదని లోకేష్ చేసిన విమర్శలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే ప్రైవేటీకరణ ప్రస్తావన వచ్చిందని.. అప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ఎమ్మెల్యే అమర్‌నాథ్ విమర్శించారు. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు పోస్కో ప్రతినిధులను కలవలేదా అని ప్రశ్నించారు.
టీడీపీ నేతలు మాత్రం రెండేళ్లుగా స్టీల్ ప్లాంట్ పై కుట్ర జరుగుతుంది అని విమర్శిస్తున్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రలో ఆస్తులను దోచుకుంటున్నారని.. వారి కన్ను స్టీల్ ప్లాంట్ పై కూడా పడిందన్నారు. ప్లాంట్ విషయంలో పోస్కోతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. 25 ఎంపీ స్థానాలిస్తే కేంద్ర మెడలు వంచుతామన్న జగన్ ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నిస్తున్నారు.
ఒకవైపు ఆరోపణలు, ప్రత్యారోపణలతో పొలిటికల్ కామెంట్స్ పెరుగుతుండటంతో పార్టీలకతీతంగా పోరాటం చేస్తేనే ఫలితం వస్తుందని కొందరు భావిస్తున్నారు. 32 మంది ప్రాణత్యాగం ఫలితంగా వచ్చిన స్టీల్ ప్లాంట్ ను ప్రెవేటు పరం చేసేందుకు తీసుకున్న నిర్ణయం కలచివేసిందన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. త్వరలో విశాఖ పరిరక్షణకు నాన్ పొలిటికల్ జెఏసిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే ఇప్పటివరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు.
అటు వామపక్ష పార్టీలు కూడా పార్టీలకతీతంగా నాయకులు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు. అసెంబ్లీలో స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలా అన్యాయం చేసి చివరకు స్టీల్ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టిందని మండిపడ్డారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శిబిరానికి వచ్చి కార్మికులకు మద్దతు తెలపాలని కోరారు. కార్మికుల ఉద్యమానికి మంచి స్పందన వస్తుందన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. గతంలో స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్న స్ఫూర్తి తో ముందుకు వెళ్ళాలని సూచిస్తున్నారు. మరి భవిష్యత్ లో అయినా అన్ని పార్టీల నేతలు కలిసి పోరాటం చేస్తారా..? లేదా..? చూడాలి మరి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire