ఏపీలో మళ్లీ కాపుల కేక..వైసీపీ కాపు నేతల్లో కాక

ఏపీలో మళ్లీ కాపుల కేక..వైసీపీ కాపు నేతల్లో కాక
x
Highlights

తెలుగుదేశం హయాంలో కాపు ఉద్యమం ఉవ్వెత్తిన ఎగసి, చప్పున చల్లారింది. అయితే చల్లారలేదు, జగన్‌ హయాంలోనూ నివురుగప్పిన నిప్పులా ఉందంటున్నారు కాపు ఉద్యమ...

తెలుగుదేశం హయాంలో కాపు ఉద్యమం ఉవ్వెత్తిన ఎగసి, చప్పున చల్లారింది. అయితే చల్లారలేదు, జగన్‌ హయాంలోనూ నివురుగప్పిన నిప్పులా ఉందంటున్నారు కాపు ఉద్యమ నేతలు. అతిత్వరలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు. కాపు నేతల హెచ్చరికలు, వైసీపీ కాపు ప్రజాప్రతినిధుల్లో కాక రేపుతున్నాయా?

గత కొద్ది నెలలుగా స్తబ్దతగా ఉన్న కాపు రిజర్వేషన్ అంశం మరోసారి తెరపైకి వచ్చి కాక రేపుతోంది. కాపులను కరివేపాకులా వాడుకొని ఏరిపారేసేలా ఆయా పార్టీలు తయారయ్యాయంటూ కాపు ఉద్యమ నేతలు కత్తులు నూరుతుండటం, మరోసారి ఉద్యమానికి బీజం వేస్తోందన్న సంకేతాలు అందిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఆది నుంచి కాపుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తుంటే అసలు కాపులను మభ్యపెట్టి మోసం చేస్తున్నది తెలుగుదేశమేనని వైసీపీ నేతలు కౌంటర్ విసురుతున్నారు.

ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్లు తమను వాడుకుంటున్నారని ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, టిడిపి సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రు తాజాగా గళం విప్పారు. మాట తప్పను మడమ తిప్పను అని పదేపదే చెప్పే జగన్, కాపులను అణగదొక్కే రీతిలోనే వ్యవహరిస్తున్నారని సీరియస్ అవుతున్నారు. కాపులకు న్యాయం చేసే చర్యలు వైసిపిలో కనిపించడం లేదంటూ ముద్రగడ వాదిస్తుంటే తమ హక్కుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయవలసిన అవసరం ఉందని జ్యోతుల నెహ్రూ స్వరం పెంచుతున్నారు. ఈ పరిణామాలు వైసీపీలో ఉన్న కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తలనొప్పిలా మారాయన్న చర్చ జరుగుతోంది.

ఒకరోజు అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్లకుండా కాపు నేతలంతా సమావేశం నిర్వహించి ఇదే అంశంపై సమీక్షించి ముఖ్యమంత్రి ముందు పంచాయితీ వరకు వెళ్లారంటే, కాపు రిజర్వేషన్ల రగడ ఏమేర మళ్లిందో చెప్పకనే చెబుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాపు రిజర్వేషన్ల సమస్య రావణ కాష్టం కాకుండా సర్దుబాటు చేసుకునే దిశలో వైసిపి వ్యూహం వేస్తోంది.

అసలు కాపులకు న్యాయం చేయాలనే అంశంపైనే అప్పటి సీఎం చంద్రబాబు, ఈ సమస్యను తన భుజంపై వేసుకుని కాపులను బీసీల్లో చేర్చడం, మంజునాథ కమిషన్, కాపు కార్పొరేషన్‌కు నిధుల మంజూరు వంటి పనులన్నీ చేశారని, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్నారు. మొత్తంమీద కాపు రగడ మరోసారి తర్జనభర్జనలకు తావిస్తోంది.

తెలుగుదేశం పార్టీలో ముగ్గురే కాపు ఎమ్మెల్యేలు ఉంటే, వైసీపీలో సుమారు 30 మంది కాపు ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఏదో విధంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేర ఏడాదికి రెండు వేలకోట్ల సహాయంతో పాటు వారిని అన్ని విధాలా ఆదుకునే ప్రయత్నం చేస్తానని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి కావడంలో కాపు సామాజిక వర్గం కీలకపాత్ర పోషించిందనేది జగన్ గుర్తించాలని కాపు నేతలు చెబుతున్నారు.

కాపు ఉద్యమం ఉచ్ఛదశలో ఉన్నప్పుడు, ఇప్పుడు వైసీపీలో కీలకంగా ఉన్న నేతలంతా అప్పట్లో కాపు ఉద్యమనేత ముద్రగడతో ఎంతో సన్నిహితంగా ఉన్నవారే. ఏ సమస్యపై పోరాటం జరిగిందో, ఆ సమస్యను పూర్తిగా అవగాహన చేసుకున్న నేతలే వారంతా. ఉద్యమ స్వరూపాన్ని వారు చవిచూశారు కనుకే, క్షేత్రస్థాయిలో కాపు ఉద్యమం తిరిగి బలీయం కాకుండా వారు వ్యూహాలు రూపొందించనున్నట్లు తెలుస్తోంది. చూడాలి, ఉద్యమాలతో చంద్రబాబుకు చుక్కలు చూపిన కాపు నేతలు, జగన్‌ ప్రభుత్వంపై ఎలాంటి నిరసనాస్త్రాలు సంధిస్తారో కాపు ఉద్యమాగ్నిని జగన్‌ ఎలా చల్లారుస్తారో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories