మైసూరా మళ్లీ రఫ్ఫాడిస్తారా.. సీఎం జగన్‌కు ఉద్యమ సెగ తగిలేలా చేస్తారా?
Mysoora Reddy: రాయలసీమ ఉద్యమమే లక్ష్యంగా ఎంవీ మైసూరారెడ్డి వాయిస్ పెంచేస్తున్నారా?
Mysoora Reddy: రాయలసీమ ఉద్యమమే లక్ష్యంగా ఎంవీ మైసూరారెడ్డి వాయిస్ పెంచేస్తున్నారా? ఈసారి కడప కేంద్రంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? త్వరలోనే తన మకాంను కడపకి మార్చబోతున్నారా? కేంద్రం ఇచ్చిన గెజిట్‌ను సీమ అభివృద్ధికి గొడ్డలిపెట్టంటూ రాజకీయ రగడ రాజేస్తున్నారా? ఇప్పటికే పలుమార్లు సీమ ఉద్యమగళాన్ని వినిపించిన మైసూరా ఈసారి ఉద్యమాన్ని ఏ స్థాయిలో నడిపించబోతున్నారు?
డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి. ఉద్యమ నేత, విలక్షణ నేత, మాజీ మంత్రి, సీనియర్ నేత. ఇలాంటి అనేక లక్షణాలతో తనకంటూ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్న నేతగా అందరికి సుపరిచితులే. వైద్యుడిగా ప్రజలకు పరిచయమై కమలాపురం సమితి అధ్యక్షుడిగా, అనంతరం కమలాపురం నియోజకవర్గాల నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రులు నేదురుమల్లి జనార్దనరెడ్డి మంత్రివర్గంలో హోంమంత్రిగా, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్‌లో జిల్లాకు చెందిన దివంగత నేత వైఎస్‌ఆర్‌తో విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో 2004లో టీడీపీలో చేరారు. అదే ఏడాది టీడీపీ తరపున కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2006లో ఆయనకు టీడీపీ రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చింది. జగన్‌ను సీబీఐ అరెస్టు చేసే రెండు రోజుల ముందు ఆయన వైసీపీలో చేరారు. జగన్ జైలులో ఉన్న సమయంలో పార్టీని వెన్నుంటి ఉండి నడిపించారు. తొలుత మైసూరాకు పార్టీలో మంచి గుర్తింపు ఇవ్వగా తర్వాత ప్రాధాన్యం తగ్గడంతో పార్టీకి దూరమయ్యారు. వైసీపీకి దూరమైన నాటి నుంచి కొంత కాలం స్ధబ్దుగా ఉండిపోయారు. కానీ అప్పుడప్పుడు రాయలసీమ గురించి వాయిస్ వినిపిస్తునే ఉన్నారు. సీమ సమస్యలు, ప్రాజెక్టులపై అస్ధిత్వం అంటూ పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. కానీ గత కొంతకాలంగా మౌనంగా ఉన్న మైసూరా మళ్లీ వాయిస్ పెంచేస్తున్నారు.
మైసూరారెడ్డికి ఉద్యమాలు కొత్త కాదు. గతంలో రాజకీయాల్లోకి వచ్చిన అరభంలోనే ఈ డాక్టర్ సాబ్ ఉద్యమంతోనే ప్రజల్లోకి వెళ్లారు. ఒక్కడిగా కాకపోయినా, సీమ ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల విషయంలో మాత్రం మైసూరా పాత్ర ఉందని చెప్పక తప్పదన్న వాదన లేకపోలేదు. సీమ సాగునీటి జలాల కోసం రాయలసీమ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేసిన పాదయాత్రలో సీమలోని ముఖ్య నేతల్లో మైసూరారెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఇదే సీమలో పలు ప్రాజెక్టులను తెరపైకి తెచ్చేలా చేయగా, అప్పటికే ఉన్న ప్రాజెక్టులకు సాగునీటి కేటాయింపులు వచ్చేలా చేశాయి. అలా సీమ ఉద్యమాల్లో మైసూరారెడ్డిది కీలక పాత్రేనన్న అభిప్రాయం నేటికి ఉంది.
అలాంటి అభిప్రాయమే మరోసారి తెరపైకి వస్తోందిప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో సాగునీటిపై సాగుతున్న వివాదాలపై మైసూరారెడ్డి మరోసారి వాయిస్ పెంచారు. రాజకీయ లబ్ధి కోసం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఘర్షణ పడి నదులపై అధికారాన్ని కేంద్రం చేతుల్లో పెట్టేశాయని, కృష్ణా, గోదావరి నదుల యాజమాన్యం బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ గ్రేటర్ రాయలసీమ అభివృద్ధికి గొడ్డలిపెట్టంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర గెజిట్ వల్ల హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, వెలుగొండ, సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు నీరు రావడం కష్టమేనన్న వాదనను లేవనెత్తారు. ఇదే గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని తెరపైకి తీసుకురానుందా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఉంటున్న మైసూరా దీని కోసమే త్వరలోనే మకాం కడపకు మార్చబోతున్నట్లు తెలుస్తొంది.
ఈ ఉద్యమంపై ఇదివరకే సీమకు చెందిన సీనియర్ నేతలతోనూ మైసూరా చర్చించినట్లు వినికిడి. వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్, నేతలతో మాట్లాడినట్లు సమాచారం. గతంలో తనతో కలిసివచ్చిన నేతలతో పాటు జిల్లాకు చెందిన అందరినీ కలుపుకుని సీఎం వైఎస్ జగన్‌కు సొంత జిల్లా నుంచే ఉద్యమ సెగ తగిలేలా చేయాలన్నది ఆయన ఉద్దేశంగా చెప్పుకుంటున్నారు. వయస్సును లెక్కలోకి తీసుకుంటే పాదయాత్ర అంటూ సహసం చేయలేకున్నా ఇతరత్రా రూపంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. రాయలసీమ ప్రయోజనాలు, సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న వ్యతిరేకత వెరసి కొత్త ఉద్యమానికి ఉపిరి పోస్తారన్న చర్చ నడుస్తోంది. మరి రానున్న రోజుల్లో మైసూరారెడ్డి వ్యూహం ఎలా ఉండబొతుందో వేచిచూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire