తారక్‌పై ఇప్పుడే చర్చ ఎందుకొస్తోంది.. సంక్షోభ సమయంలో జూనియర్‌ను బాబు ఆహ్వానిస్తారా?
జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. దాదాపు పదేళ్ల తర్వాత యంగ్ తారక్‌పై మరోసారి రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. వంశీ, నాని మొదలు, రామ్ గోపాల్ వర్మ...
జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. దాదాపు పదేళ్ల తర్వాత యంగ్ తారక్‌పై మరోసారి రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. వంశీ, నాని మొదలు, రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ KRKR ట్రైలర్ వరకూ, తారక్‌ను ప్రస్తావిస్తూ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. ఇంతకీ టీడీపీలో ఎన్టీఆర్ ప్రస్థానమేంటి కష్టకాలంలో ఉన్న టీడీపీ కోసం చంద్రబాబు, లోకేష్‌లు తారక్‌కు వెల్‌కమ్ చెబుతారా వెల్‌కమ్ చెప్పినా రామయ్య వస్తాడా?
జూనియర్ ఎన్టీఆర్. ఈమధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా చర్చకు వస్తున్న పేరు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ అధినాయకులు చంద్రబాబు, లోకేష్‌లపై ధాటిగా విమర్శలు చేస్తూ, పనిలో పనిగా తనకు ఎంతో క్లోజయిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చారు. లోకేష్ కోసమే, జూనియర్‌ను పక్కనపెట్టారని వ్యాఖ్యానించడంతో, టీడీపీలో జూనియర్ ఎందుకు సైలెంటయ్యాడని కొన్నేళ్లుగా వినిపిస్తున్న ప్రశ్నలు మరోసారి గింగిరాలు కొడుతున్నాయి.
2009 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్‌ను పదేళ్లుగా ఎందుకు పక్కనపెట్టారన్న వంశీ కామెంట్లపై లోకేష్ బాబు వెంటనే రియాక్ట్ అయ్యారు. 2009 విషయం ఇప్పుడెందుకన్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మంత్రి కొడాలి నాని సైతం రియాక్టయ్యారు. టీడీపీని జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగిస్తేనే బతికి బట్టకడుతుందన్నారు నాని. అయితే తమ నాయకుడు చంద్రబాబు స్ట్రాంగ్‌గా ఉన్నారని తమకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు.
ఇదే సమయంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సెకండ్ ట్రైలర్‌లోని కొన్ని డైలాగ్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించినవేనా అనే ప్రచారం జరుగుతోంది. ఇలా రకరకాలుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు, రాజకీయవర్గాల్లో చర్చకు వస్తోంది. రాజమౌళి సినిమాతో బిజీబిజీగా వున్న జూనియర్, తన ప్రమేయం లేకుండా పొలిటికల్ డిస్కషన్‌లోకి వస్తున్నారు. దీంతో తెలుగుదేశంలో జూనియర్ పాత్రేంటి అన్న మాటలు మళ్లీ మొదలయ్యాయి.
ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోనే వున్నారా?
లోకేష్ కోసమే జూనియర్‌ను పక్కనపెట్టారన్న ప్రచారంలో నిజమెంత?
సంక్షోభ సమయంలో జూనియర్‌ను బాబు ఆహ్వానిస్తారా?
చంద్రబాబు రమ్మంటే ఎన్టీఆర్ వస్తారా?
లేదంటే మరో వేదికను సిద్దం చేసుకుంటారా?
జూనియర్ ఎన్టీఆర్ అవసరం టీడీపీకి వుందా జూనియర్‌కు టీడీపీ అవసరం వుందా చంద్రబాబు, లోకేష్‌లకు తారక్ పట్ల ఎలాంటి ఆలోచన వుంది ఈ ఇద్దరి పట్లా ఎన్టీఆర్‌కు వున్న అభిప్రాయమేంటి అసలు తారక్ టీడీపీలోకి వస్తారా లేదంటే మరో వేదికను సిద్దం చేసుకుంటారా.
జూనియర్ ఎన్టీఆర్. తాతయ్య పోలికలు. తాతయ్యలా అనర్గళ ప్రసంగాలు. అదిరిపోయే పంచ్‌లు. మాస్‌ను ఆకట్టుకునే హావభావాలు. ఎన్టీఆర్ నిజంగా ఒక ఛరిష్మాటిక్ యాక్టర్. క్రౌడ్ పుల్లర్ కూడా. 2009లో జూనియర్ ర్యాలీలకు వేలాది జనం తరలివచ్చారు. వైఎస్ హవాలో టీడీపీకి సీట్లు తేలేకపోయినప్పటికీ, రాబోయే కాలంలో కాబోయే టీడీపీ నాయకుడని మాత్రం అనిపించుకున్నారు ఎన్టీఆర్.
కానీ ఆ తర్వాత టీడీపీలో లోకేష్‌కు ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. జూనియర్‌ను పక్కనపెట్టడమో, జూనియరే పక్కకుపోవడమో జరిగిపోయాయి. కొన్నాళ్లు సినిమాలు పక్కనపెట్టి, క్యాంపెయిన్‌కు వెళ్లి వస్తూ యాక్సిడెంట్‌కు గురై, పార్టీకి ఏదో చెయ్యాలని తపించిన తన కొడుకు జూనియర్‌ను, సైడ్ ట్రాక్ చెయ్యడాన్ని మహానాడు సాక్షిగా జీర్ణించుకోలేకపోయారు హరికృష్ణ. దీంతో తర్వాతి కాలంలో అటు హరికృష్ణతో పాటు జూనియర్ కూడా టీడీపీకి దూరం జరుగుతూ వచ్చారు. హరికృష్ణ చనిపోయారు. ఆ తర్వాత హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబు రంగంలోకి దింపినా, జూనియర్ మాత్రం ప్రచారానికి రాలేదు. దీంతో టీడీపీకి, జూనియర్‌కు మధ్య మరింత అగాధం పెరిగిందన్న అభిప్రాయం బలపడింది. 2014, 2019 ఎన్నికల్లోనూ పార్టీకి దూరంగా వున్న జూనియర్ పేరు, మళ్లీ ఇప్పుడు చర్చకు వచ్చింది.
ఇప్పుడే జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎందుకు చర్చకు వస్తోంది?
దీనికి అనేక కారణాలు చర్చకు వస్తున్నాయి. అందులో ఒకటి చంద్రబాబుకు వయసు మీదపడటం ఒకటైతే, లోకేష్‌కు నాయకత్వ లక్షణాల్లేవన్న ప్రచారం. అందుకే టీడీపీకి భవిష్యత్తు నాయకుడెవరు జగన్‌కు దీటుగా పార్టీని నడిపించి, కార్యకర్తల్లో విశ్వాసం నింపగల లీడర్ ఎవరన్న చర్చ సహజంగానే తెరపైకి వస్తోంది. ఈ పరిణామాలను అధికార వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా టీడీపీని గందరగోళ పరిచేందుకు ప్రయోగిస్తున్నారు. జూనియర్‌కు అత్యంత సన్నిహితులైన వంశీ, నాని వంటి నేతలతోనే మాట్లాడిస్తున్నారు. ఇక టీడీపీకి భవిష్యత్తులేదని టీడీపీ నుంచి బయటకు వచ్చిన నేతలతోనే మాట్లాడిస్తున్నారు.
ప్రత్యర్థి పార్టీల నాయకుల మాటలు అటుంచితే, జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని టీడీపీలో ఒకవర్గం నేతలే బలంగా కాంక్షిస్తున్నారు. ఇలాంటి క్రైసిస్ టైంలో, ఛరిష్మాటిక్ లీడరైన ఎన్టీఆర్ వస్తే, పార్టీ ఫ్యూచర్ పట్ల, అందరిలోనూ నమ్మకం సడలకుండా పటిష్టంగా వుంటుందంటున్నారు. జూనియర్ వంటి యంగ్ బ్లడ్ పార్టీకి అవసరమని చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ ఎన్టీఆర్ వస్తే, తన కుమారుడు లోకేష్ ఉనికికే ప్రమాదమని బాబు ఆలోచిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అందుకే జూనియర్ ప్రస్తావన లేకుండా, లోకేషే తమ భవిష్యత్తు నాయకుడని, అనేక వేదికల మీద, అనేకమంది నేతలతో అనిపించగలిగారు చంద్రబాబు. అంటే చంద్రబాబు మాత్రం జూనియర్‌ను ఆహ్వానించే అవకాశం లేదనుకోవాలి.
పోనీ కష్టకాలంలో వున్న పార్టీకి అండగా రావాలని ఒకవేళ చంద్రబాబు వెల్‌కమ్ చెప్పినా, జూనియర్ వస్తాడా అంటే, అది మిలియన్ డాలర్ల ప్రశ్న. పార్టీలో తాతకు జరిగిన అవమానం, తర్వాత తన తండ్రికి జరిగిన అవమానం, ఆ తర్వాత తనకు జరిగిన అవమానంతో జూనియర్ రగిలిపోతున్నాడని, ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. కానీ ఒక సందర్భంలో జూనియర్ మాత్రం చాలా తెలివిగా, తన తాత స్థాపించిన పార్టీకి తాను విధేయుడినని, ఆయన ఆశయాల కోసం ఆయన స్థాపించిన పార్టీకి సేవ చేయడం తన బాధ్యతన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని పార్టీకి సేవ చేస్తానని మాత్రం అనలేదు.
మొత్తానికి తన కొడుకు లోకేష్ ఉనికి కోసం చంద్రబాబు తనకు తానుగా జూనియర్‌ను ఆహ్వానించే అవకాశం లేదు. బాబు, లోకేష్ నేతృత్వంలో పార్టీలోకి ఎన్టీఆర్ వచ్చే ఛాన్సే లేదు. అంటే జూనియర్ మాత్రం రాబోయే కాలంలో సొంతగా పార్టీ స్థాపించడమో లేదంటే పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడమో, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగడం మాత్రం ఖాయమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. భవిష్యత్తులో ఏమైనా సంభవమే. లెటస్ సీ.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire