Why TDP MLCs looking at YSRCP: ఆ టీడీపీ ఎమ్మెల్సీ మనసు వైసీపీ వైపు ఎందుకు లాగుతోంది?

Why TDP MLCs looking at YSRCP: ఆ టీడీపీ ఎమ్మెల్సీ మనసు వైసీపీ వైపు ఎందుకు లాగుతోంది?
x
Highlights

Why TDP MLCs looking at YSRCP: శరీరం ఒకచోట మనసు మరో చోట. అదేపనిగా ఆయన కన్ను, పక్కపార్టీపై పడుతోంది. ఎంత వద్దనుకున్నా కాలు ఆగడం లేదు....

Why TDP MLCs looking at YSRCP: శరీరం ఒకచోట మనసు మరో చోట. అదేపనిగా ఆయన కన్ను, పక్కపార్టీపై పడుతోంది. ఎంత వద్దనుకున్నా కాలు ఆగడం లేదు. వెంటనే అవతలిపార్టీలోకి గృహప్రవేశం చెయ్యాలని ఉబలాటపడుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశంలో చాలామంది సైకిలెక్కారు. ఇప్పుడు మరో టీడీపీ ఎమ్మెల్సీ ఫ్యాన్‌ చెంతకు చేరాలని డిసైడయ్యారట. ఎవరాయన ఎందుకు సైకిల్‌ దిగాలనుకుంటున్నారు?

ఆంధ్రప్రదేశ్‌లో నిన్నటి వరకు టీడీపీకి కంచుకోటగా ఉన్న జిల్లా విజయనగరం. 2014 ఎన్నికల్లో ఆరు అసెంబ్లీ స్థానాలతో పాటు విజయనగరం పార్లమెంట్ స్థానం గెలుచుకుంది టీడీపీ. బొబ్బిలి సెగ్మెంట్‌‌లో వైసీపీ నుంచి గెలిచిన సుజయ క్రిష్ణ రంగారావు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీతో బలంగా ఉండేది టిడిపి. 2019 ఎన్నికల్లో వైసిపి క్లీన్ స్పీప్ చేసింది. దీంతో ఒక్కసారిగా కంగుతింది టీడీపీ. తెలుగు తమ్ముళ్లందరూ డీలాపడ్డారు. అడపదడపా రాష్ట్ర ప్రభుత్వంపై ఫైరయ్యే అశోక గజపతి రాజు సైతం మాన్సాస్, వారసత్వ వివాదాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జిల్లాలో టిడిపిని నడిపించే నాథుడే కరువయ్యాడు. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు సైకిల్‌ దిగి, ఫ్యాన్‌ చెంతకు చేరిపోవాలని ముహూర్తాలు చూసుకుంటున్నారు. ఆ జాబితాలో తాజాగా వినిపిస్తున్న పేరు, ద్వారపురెడ్డి జగదీష్.

విజయనగరం జిల్లాలో టిడిపికి కీలక నేతగా ఉంటూ మూడుసార్లు జిల్లా టిడిపి అద్యక్షునిగా పనిచేసి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు ద్వారపురెడ్డి జగదీష్. విజయనగరం టీడీపీకి పెద్ద దిక్కయిన అశోక గజపతి రాజుకు వీర విధేయుడు. ఆయన చొరవతో జగదీష్‌కు ఎమ్మెల్సీ దక్కిందట. ఇప్పుడాయన మనసు మాత్రం వైసీపీ వైపు లాగుతోందట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా, ఎమ్మెల్సీగా వుండగానే అధికారపక్షంలో దూరిపోతే, వర్తమానంతో పాటు భవిష్యత్తు కూడా బాగుంటుందని భావిస్తున్నారట. అయితే, ఇప్పుడే ఫ్యాన్‌ గాలి ఎందుకు కోరుకుంటున్నారన్నదానిపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి.

జగదీష్ ఎమ్మెల్సీ పదవి వచ్చే సంవత్సరం వరకు ఉంది. ఇంతలో జిల్లా విభజన జరిగితే ఎలా అన్నది జగదీష్‌ను కుదురుగా ఉండనివ్వడం లేదట. జగదీష్ పార్వతీపురంకు చెందిన నేత. దీంతో రాజకీయంగా విజయనగరం జిల్లాతో సంబంధాలు తెగిపోతాయి. దీంతో తను తన కుటుంబ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారేందుకు సిద్దమౌతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలోనే వైసీపీ గూటికి చేరాలని ప్రయత్నించినా, స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అడ్డు చెప్పడంతో వెనక్కి తగ్గారట. తాజాగా జిల్లా వైసీపీకి చేందిన కీలక నేతల అండతో, అధికారపక్షంలోకి ప్రవేశానికి లైన్‌ క్లియర్‌ అయ్యిందట. అంతేకాక జగదీష్ భార్య ద్వారపు రెడ్డి శ్రీదేవి, మొన్నటి వరకు పార్వతీపురం మున్సిపల్ చైర్మన్‌గానూ పని చేయడంతో, ఇప్పుడు భార్యాభర్తలలో ఎవరికో ఒకరికి పార్వతీపురం జిల్లా అధ్యక్ష పదవిని సైతం ఇస్తామని జిల్లా పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని సమాచారం. మరోవైపు పార్వతీపురంకి చెందిన వైసీపీ నేతలు సైతం ద్వారపు రెడ్డి పార్టీ మారడం ఖాయమంటూ సంకేతాలివ్వడం, పార్టీ మార్పు రూమర్లకు ఊతమిస్తున్నాయి.

మొత్తానికి విజయనగరం టీడీపీలో ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. అయితే, తనకు వీరవిధేయుడనుకున్న జగదీష్‌, పార్టీ మారతారన్న వార్తలు అశోక్‌ గజపతి రాజుకు మింగుడుపడటం లేదట. పదవులు అనుభవించి, కష్టకాలంలో పార్టీని వీడటం నైతికంగా సరైంది కాదని కూడా ఆయన తన అనుచరులతో అన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సైకిల్‌ దిగాలని ఉబలాటపడుతున్న జగదీష్, తనకు రాజకీయ గురువులాంటి అశోక్‌ గజపతి నమ్మకాన్ని నిలబెట్టుకుని పార్టీలోనే వుంటారా లేదంటే తన భవిష్యత్తు తనదేనని ఫ్యాన్‌ చెంతకు చేరతారా అన్నది కొద్దిరోజుల్లోనే తేలిపోతుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories