ఆ నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. చంద్రబాబు పక్కాగా లెక్కవేసి, విజయం తమదేనని ఘంటాపథంగా చెప్పిన సెగ్మెంట్. తరతరాలుగా ఆ నియోజకవర్గంపై ఆ కుటుంబానిదే...
ఆ నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. చంద్రబాబు పక్కాగా లెక్కవేసి, విజయం తమదేనని ఘంటాపథంగా చెప్పిన సెగ్మెంట్. తరతరాలుగా ఆ నియోజకవర్గంపై ఆ కుటుంబానిదే ఆధిపత్యం. కానీ వన్ ఫైన్ రిజల్డ్ డే, చంద్రబాబు షాకయ్యే ఫలితం. ఎదురులేదు తిరుగులేదు అని గట్టిగా భావించిన ఆ కుటుంబంలో విస్మయం. కంచుకోటలో తెలుగుదేశం ఎందుకు విఫలమైందో తెలుసా ఒక్క ప్రయోగం ఒకే ఒక్క ప్రయోగం. మొత్తం సెగ్మెంట్ మూడ్‌నే మార్చేసింది గెలవాల్సిన స్థానం చేజారేలా చేసింది. ఇంతకీ ఆ సెగ్మెంట్‌లో జరిగి ప్రయోగమేంటి? ఎందుకు వికటించింది?
శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం. ఇప్పుడు తెలుగుదేశం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారిన సెగ్మెంట్ ఇది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ ఎటువంటి ఫలితాలు వచ్చినా ఇక్కడ మాత్రం కచ్చితంగా టిడిపి అభ్యర్ధి గెలుస్తారు అని అందరూ భావించడమే ఇందుకు ప్రధాన కారణం అయితే ఇలాంటి చోటే ఫలితాలు తారుమారయ్యాయి. అనుకున్నది ఒకటి అయితే జరిగింది ఒకటి.. ఊహించని పరాజయం, అంచనాలకు అందని ఫలితాలు చవిచూసింది తెలుగుదేశం. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయనేది ఆ పార్టీ శ్రేణుల్లో ఇప్పటికీ జరుగుతున్న చర్చ.
ప్రధానంగా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో ఒక్కసారి మినహా ఆ పార్టీ ఓటమి పాలైన సందర్భం లేదు. 2009కి ముందు సోంపేట నియోజకవర్గంగా, ఉన్న ఈ ప్రాంతం నియోజకవర్గాల పునర్విభజనతో పలాస నియోజకవర్గంగా ఏర్పడింది. అయితే ఆది నుంచి ఇక్కడ గౌతు కుటుంబానిదే ఆధిపత్యం. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న తొలిసారి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం సోంపేట. అక్కడి ప్రజలు ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా మారారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో గౌతు లచ్చన్న ఐదుసార్లు ఇక్కడి నుంచే వరుసగా పోటీ చేసి ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఆయన వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన గౌతు శ్యాం సుందర శివాజీ, సోంపేట నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు గెలవగా, పలాస నుంచి ఒకసారి విజయం సాధించారు.
కాగా 2014 ఎన్నికల్లో పలాస నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో దిగి ఐదోసారి విజయం సాధించిన గౌతు శివాజీ, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన రెండో మంత్రివర్గ విస్తరణలో స్థానం లభిస్తుందని ఆశించారు. అయితే ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకోకపోవడంపై కొంత అసంతృప్తిగా ఉన్న ఆయన, విస్తరణ జరిగిన కొద్ది రోజుల తరువాత చేసిన ప్రకటన అప్పట్లో సంచలనమే సృష్టించింది. మంత్రి పదవి లభిస్తుందని ఆశించినప్పటికీ రాకపోవడంతో కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ పార్టీకి విధేయుడిగా ఎల్లకాలం ఉంటానని, అయితే 2019 ఎన్నికల్లో పోటీ చేయబోనంటూనే రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయంశంగా మారాయి.
కాగా వయసు మీద పడుతుండటంతో తాను రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు శివాజీ చేసిన ప్రకటనతో తెలుగుదేశం పార్టీ ఆలోచనలో పడిందట అందుకే ఆయన స్థానంలో శివాజీ వారసురాలిగా ఆయన కుమార్తె గౌతు శిరీషను పలాస నుంచి ఎన్నికల బరిలో దించింది అయితే శిరీష ఎన్నికపై పార్టీ నిర్ణయాన్ని ఇప్పుడు పలాస తెలుగు తమ్ముళ్ళు తప్పుపడుతున్నారట. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శివాజీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం అక్కడ ఓటమికి కారణాలు అయ్యాయనే చర్చ నియోజకవర్గంలో జోరందుకుంది. అయితే తన వారసురాలిగా శిరీషను తెరపైకి తెచ్చి కొత్త తరం రాజకీయాలను తేవాలని శివాజీ భావించారట. అయితే రాజకీయంగా శిరీషకు పెద్దగా అనుభవం లేనప్పటికీ జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా రెండు పర్యాయాలు పని చేసిన అనుభవం జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి కలగానే ఉంటున్న సొంత కార్యాలయం శిరీష ఆధ్వర్యంలోనే నిర్మించడటం అధినేత దృష్టిని ఆకర్షించే అంశాలుగా మారాయట. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పలాస టిడిపి అభ్యర్ధిగా శిరీష పేరు అధిష్టానం ఖరారు చేసింది. అయితే ఆ ప్రయోగం ఇప్పుడు వికటించిందని తెలుగు తమ్ముళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. రాజకీయ చాణక్యుడిగా పేరొందిన శివాజీ లెక్కలు తప్పి టిడిపి ఓటమిపాలవ్వడమే ఇందుకు నిదర్శనమని చర్చించుకుంటున్నారట. అయితే ఈసారి శిరీష కాకుండా శివాజీ పోటీ చేసి ఉంటె కచ్చితంగా గెలిచి ఉండేవాళ్లమని చర్చ జరుగుతోందట.
అయితే ఇదొక్కటే ఓటమికి కారణం కాదనే చర్చ కూడా జరుగుతోంది. ముఖ్యంగా ప్రత్యర్ధిని అంచనా వేయడంలో శిరీష లెక్క తప్పారని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారట. అనూహ్యంగా తెరపైకి వచ్చిన సీదిరి అప్పలరాజును వైసిపి అధిష్టానం, పలాస అభ్యర్థిగా బరిలో దించింది. అయితే అప్పలరాజు తమకు అసలు పోటీయే కాదని ఎన్నికల్లో అలవోకగా నెగ్గేస్తామనే ధీమా అక్కడ టిడిపి పుట్టి ముంచిందట. వాస్తవానికి అప్పలరజుకి పెద్దగా రాజకీయ అనుభవం లేనప్పటికీ, పార్టీ ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన, అనూహ్యంగా అందరి దృష్టినీ ఆకర్షించారట. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశానికి ఆది నుంచి వెన్నుదన్నుగా ఉంటున్న పలు మండలాల్లో సైతం, అప్పలరాజు బలం పెరిగిందట. అయితే టిడిపి తమకు అసలు ప్రత్యర్థే కాదనుకున్న అప్పలరాజు, సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు.
అనుకూలించే అనేక అంశాలు టిడిపి ముంగిట ఉన్నా గెలుపు కైవసం చేసుకోలేకపోవడంపై పార్టీ పెద్దలు అంతర్మధనంలో పడ్డారట. ముఖ్యంగా తిత్లీ తుఫాను సమయంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సుమారు నెలరోజుల పాటు పలాసలోనే మకాం వేసి అధికార యంత్రాగాన్ని, మంత్రులను జిల్లాకు రప్పించి ఉద్దానం పునఃనిర్మాణం కోసం చేసిన కృషి, బాదితులకు పరిహారం విషయంలో నాటి ప్రభుత్వం చూపిన చొరవ ఇలా అనేక అంశాల నేపధ్యంలో ఈ నియోజకవర్గంలో కచ్చితంగా గెలుపు తమకే సొంతమని భావించారట. అయితే తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన శిరీష, ఎన్నికల్లో గెలుపును అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యారనే చర్చ కొనసాగుతోందట. అదే శివాజీ అయితే తన చాణక్యంతో గెలిచి ఉండేవారని అనుకుంటున్నారట. కాగా మొదటిసారి పోటీలోనే ఓటమిపాలవ్వడంపై శిరీష కూడా ఆవేదన చెందుతున్నారట. ఎన్నికల్లో గెలిచి ఉంటె, ప్రతిపక్షంలో ఉన్నా అనుభవం సాధించేందుకు ఇదే సరైన సమయమని అలాంటి అవకాశం పోగొట్టుకున్నానని భావిస్తున్నారట. అయితే ఇది ఒక పాఠంగా రానున్న రోజుల్లో ఈ అనుభవంతో బలంగా పోరాడేందుకు ఇప్పటి నుంచే శిరీష సిద్ధమవుతున్నారని పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.
మొత్తం మీద తెలుగుదేశం నాయకుల తీరు చూస్తుంటే చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ సంక్షోభం నుంచి బయట పడేందుకు పార్టీ అధిష్టానం, గౌతు కుటుంబం ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళతారో వేచి చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire