Nara Rammurthy Naidu: చంద్రబాబుకు, రామ్మూర్తి నాయుడుకు మధ్య ఎందుకు దూరం పెరిగింది?
Nara Chandrababu Naidu and Nara Rammurthy Naidu: నారా రామ్మూర్తి నాయుడు ఇక లేరు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వయానా తమ్ముడైన రామ్మూర్తి నాయుడు గత...
Nara Chandrababu Naidu and Nara Rammurthy Naidu: నారా రామ్మూర్తి నాయుడు ఇక లేరు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్వయానా తమ్ముడైన రామ్మూర్తి నాయుడు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు నారా రోహిత్ అందరికీ తెలిసిన సినీనటుడే. మరో అబ్బాయి నారా గిరీష్ వ్యాపారంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నారా గిరీష్ కు కంప్లీట్ ఫ్యామిలీ మేన్ అనే పేరుంది. ఆయనెప్పుడూ లైమ్ లైట్‌లో ఉండరు.
అన్నతో తమ్ముడు రామ్మూర్తి నాయుడుకు ఎక్కడ చెడింది?
నారా చంద్రబాబు నాయుడు, నారా రామ్మూర్తి నాయుడు.. ఇద్దరూ ఒకే ఇంటి నుండి రాజకీయాల్లోకి వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు తమ సొంత నియోజకవర్గమైన కుప్పం కేంద్రంగా రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. వారి సోదరుడు రామ్మూర్తి నాయుడు 1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.1999 వరకు ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పటివరకు అన్నాదమ్ముళ్ల మధ్య మంచి సఖ్యతే ఉందంటుంటారు ఆ ఇద్దరిని దగ్గరిగా చూసిన రాజకీయ విశ్లేషకులు.
1999 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు చంద్రగిరి నుండి టికేట్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గల్లా అరుణ కుమారి చంద్రగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆమెకు 57,915 ఓట్లు పోల్ అవగా, రామ్మూర్తి నాయుడుకు 55,644 ఓట్లు వచ్చాయి. 2,271 ఓట్ల తేడాతో రామ్మూర్తి నాయుడు ఓడిపోయారు. ఆ తరువాత నుండే అన్నాదమ్ముళ్ల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. 2001-2002 నుండి రామ్మూర్తి నాయుడు తన సోదరుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా మారుతూ వచ్చారు. ఒకానొక దశలో అన్న చంద్రబాబు నాయుడు పాలనపై ఆయనే సంచలన ఆరోపణలు చేశారు.
చంద్రబాబు ఏడేళ్ల పాలనలో ఏపీ ఎంతో వెనక్కు వెళ్లిందని, రాష్ట్రచరిత్రలో అదొక చీకటి అధ్యాయం అని రామ్మూర్తి నాయుడు అన్నారు. హైటెక్ పాలన పేరుతో రైతుల నోట్లో మట్టికొట్టారన్నారు. ధరలు ఆకాశన్నంటుతున్నాయని, ఉపాధి లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని రామ్మూర్తి నాయుడు వ్యాఖ్యానించారు. రైతు కుటుంబం నుండే వచ్చిన ముఖ్యమంత్రి రైతులను రోడ్డుకీడ్చుతున్నారని చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు గుప్పించారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు సీఎం జయలలితను చూసి పాలన ఏంటో నేర్చుకోవాలని సూచించారు.
ఓవైపు అన్న చంద్రబాబు నాయుడు పాలనపై విమర్శలు గుప్పిస్తూనే మరోవైపు అదే సమయంలో పాద యాత్ర చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ప్రశంసలు గుప్పించారు. ప్రజా సమస్యలు, కరువులో ఉన్న రైతన్నల బాధలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ నడి ఎండా కాలంలో పాదయాత్ర చేపట్టడం గొప్ప విషయంగా చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్‌లో చేరిన రామ్మూర్తి నాయుడు
చంద్రబాబు నాయుడుపై విమర్శలతో రామ్మూర్తి నాయుడు టీడీపీకి దూరమయ్యారు. ఆ తరువాత సొంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని రామ్మూర్తి నాయుడు చెప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. సొంత పార్టీ ఏమైందో ఏమో తెలియదు కానీ 2003 డిసెంబర్ 8న రామ్మూర్తి నాయుడు వెళ్లి సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇవన్నీ చంద్రబాబు నాయుడుకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయని చెబుతుంటారు అప్పటి పరిణామాలను దగ్గరిగా చూసిన రాజకీయ పరిశీలకులు. అంతేకాదు.. ఆ తరువాత వచ్చిన 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. అన్న చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయారు. చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షం ఎక్కడో లేదు.. సొంతింట్లోనే ఉందంటూ ప్రతిపక్షాలు రామ్మూర్తి నాయుడు చేసిన వ్యాఖ్యలను వాడుకున్నాయంటారు. అలా ఆ ఇద్దరు అన్నాదమ్ముళ్ల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.
రామ్మూర్తి నాయుడు రాజకీయాలకు ఎలా దూరమయ్యారు
2004 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నుండి కాంగ్రెస్ టికెట్ ఇస్తారనే హామీతోనే రామ్మూర్తి నాయుడు ఆ పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగింది. కానీ అప్పటికే ఆ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గల్లా అరుణ కుమారికి ఇస్తానని వైఎస్ఆర్ మాటిచ్చినట్లు వార్తలొచ్చాయి. ఆ వార్తలనే నిజం చేస్తూ 1999, 2004, 2009 వరకు వరుసగా మూడు పర్యాయాలు ఆమె కాంగ్రెస్ నుండి గెలిచి చంద్రగిరి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్న మహిళా ఎమ్మెల్యేల్లో ఆమె కూడా ఒకరు.
నారావారిపల్లెలో అయోమయం
ఆ తరువాత రామ్మూర్తి నాయుడు అదే చంద్రగిరి నుండే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడానికి సిద్ధపడ్డారు. చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారి పల్లె కూడా అదే చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దాంతో టీడీపీకి ఓటు వేయాలో లేక రామ్మూర్తి నాయుడుకు ఓటు వేయాలో అర్థం కాని పరిస్థితి నారావారిపల్లెలో నెలకొంది. ఆ ఊరిలో అందరూ వారికి చుట్టాలే. కానీ ఎవరికి ఓటేయాలో తెలియని పరిస్థితి. ఇదే విషయమై తాము డైలమాలో ఉన్నామని వారి సమీప బంధువు చంగల్వరాయ నాయుడు అప్పట్లో కామెంట్ చేశారు. ఆ ఎన్నికల్లో రామ్మూర్తి నాయుడు ఓడిపోయారు. ఆ తరువాత రాజకీయాల్లో అంత చురుగ్గా వ్యవహరించలేదు. ఆరోగ్యరీత్యా చురుగ్గా లేకపోవడమే అందుకు కారణంగా వార్తలొచ్చాయి.
చంద్రబాబు నాయుడుపై అలిపిరి ఎటాక్
2003, అక్టోబర్ 1న అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడుపై పీపుల్స్ వార్ నక్సలైట్లు బాంబు దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో చంద్రబాబు నాయుడు తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఆ దాడి జరిగిన మరుసటి రోజే అన్న చంద్రబాబు సైడ్ వచ్చేయమని చిన్న కొడుకు రామ్మూర్తి నాయుడుకు వారి తల్లి చెప్పినట్లు వార్తలొచ్చాయి. కానీ అప్పటికే ఆ ఇద్దరి మధ్య భారీగా దూరం పెరిగిపోయింది. రామ్మూర్తి నాయుడు చేసిన ఆరోపణలతో చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే అభిప్రాయం బలంగా ఉంది. అందుకే ఆయన మళ్లీ వెనక్కి వెళ్లడానికి ఇష్టపడలేదనే టాక్ వినిపించింది.
ఆ తరువాతి కాలంలో వారి మధ్య విబేధాలు దూరమవడం, రామ్మూర్తి నాయుడు తిరిగి టీడీపీలో చేరడం జరిగింది. కానీ రామ్మూర్తి నాయుడు టీడీపీకి దూరమైనప్పుడు రాజకీయంగా జరిగిన ప్రచారం ఆయన అన్నకు దగ్గరైనప్పుడు కనిపించలేదు. దాంతో ఆ తరువాత రెండు కుటుంబాలు కలిసిపోయినప్పటికీ, ఆ వార్తలకు అంతగా ప్రాధాన్యం లభించలేదనే టాక్ ఉంది. ఆ తరువాత కాలంలో నారా రోహిత్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తండ్రి రామ్మూర్తి నాయుడు రాజకీయాల నుండి పూర్తిగా పక్కకు తప్పుకుని లైమ్ లైట్‌కు దూరమయ్యారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire