కొత్త గెటప్‌లో కనిపిస్తున్న బాలయ్యలో, ఈ సరికొత్త సైలెన్స్ ఏంటి?
ఆయన కత్తితో కాదు కంటిచూపుతో శాసిస్తారు. ఒక్క డైలాగ్‌తో వెండితెర మీద మెరుపులు మెరిపిస్తారు. ఇక ఆయన తొడగొడితే, బాక్సాఫీసు రికార్డుల బద్దలవుతాయి. సినిమా...
ఆయన కత్తితో కాదు కంటిచూపుతో శాసిస్తారు. ఒక్క డైలాగ్‌తో వెండితెర మీద మెరుపులు మెరిపిస్తారు. ఇక ఆయన తొడగొడితే, బాక్సాఫీసు రికార్డుల బద్దలవుతాయి. సినిమా తెర మీద, రాజకీయ తెరమీదా ఆయనొక సంచలనం. కానీ ఇప్పుడాయన మౌనం, అభిమానులను, కార్యకర్తలను పిచ్చెక్కిస్తోంది. రాష్ట్రంలో మూడు రాజధానుల రచ్చ, మండలి చర్చపై, ఇంతవరకూ నోరు మెదపలేదు ఆ నందమూరి నటసింహం. డైలాగులతో తెరమీద చెలరేగిపోయే నందమూరి బాలకృష్ణ మౌనానికి కారణముందా? అసెంబ్లీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఓ రేంజ్‌లో చెలరేగిపోతున్నా, ఎందుకంత మౌనంగా వున్నారు? కొత్త గెటప్‌లో కనిపిస్తున్న బాలయ్యలో, ఈ సరికొత్త సైలెన్స్ ఏంటి?
టీడీపీ కీలక నేతల్లో ఒకరు, హిందూపురం ఎమ్మెల్యే, స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, కొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. గుండు చేయించుకుని, మీసాలు పెద్దవిగా చేసుకుని, న్యూలుక్‌లో దర్శనమిస్తున్నారు. బోయపాటి సినిమా కోసం కొత్త గెటప్ సెట్ చేసుకుంటున్నారట బాలయ్య. ఇదే గెటప్‌తో అసెంబ్లీలో ఎంటరైన బాలయ్య, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అందరూ కొత్త లుక్ ఏంటని అడిగారట. కొందరు యువ ఎమ్మెల్యేలు సహా రోజాలాంటి నాయకులు సైతం, బాలయ్యతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారట.
అంతా బాగానే వుంది. న్యూలుక్‌తో బాలయ్య అసెంబ్లీలో ప్రవేశించారు. మూడు రాజధానులపై మాట్లాడతారు, పంచ్‌లతో ఇరగదీస్తారని సగటు బాలయ్య అభిమానే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎదురుచూశారు. కానీ ఒక్క మాటా మాట్లాడలేదు బాలయ్య. మౌనంగా అలా కూర్చుండిపోయారు. కొడాలి నాని ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు. విశాఖలో తన చిన్నల్లుడి గురించి, వారి విశ్వవిద్యాలయం గురించి నాని ఓ రేంజ్‌లో మాట్లాడుతుంటే, అలా చెవులప్పగించి విన్నారు బాలకృష్ణ.
మూడు రాజధానులపై ఒకవైపు టీడీపీ ఒక రేంజ్‌లో ఆందోళనలు చేస్తోంది. మాటల తూటాలు పేలుస్తోంది. తెలుగు జాతి మధ్య చిచ్చుపెడుతున్నారంటూ విమర్శలు చేస్తోంది. అమరావతి అట్టుడికిపోతోంది. ఇంతటి ఉద్విగ్న పరిస్థితుల్లో బాలకృష్ణ మరింత ఉద్వేగంగా, ఉద్యమానికి ఊపునిచ్చేలా మాట్లాడతారని అందరూ ఊహించారు. అసెంబ్లీకి వచ్చారు, ఇక చర్చలో ఇరగదీస్తారని ఊహించారు. కానీ బాలయ్య నుంచి ఒక్క పలుకూలేదు. సైలెంట్‌గా వుండిపోయారు. అదే తెలుగుదేశం కార్యకర్తలను ఆవేదనకు గురి చేస్తోందట. అంతటి కీలక నాయకుడు, వెండితెర మీద దుమ్ముదులిపే కథానాయకుడు ఇలా మౌనంగా వుండిపోవడమేంటని లోలోపల బాధపడుతున్నారట.
అసెంబ్లీలోనే కాదు, కనీసం అమరావతి ఆందోళనల్లోనూ పాల్గొనలేదు బాలయ్య. అమరావతి రైతుల నిరసనలకు మద్దతుగా ఆయన వస్తారని, సపోర్ట్‌గా మాట్లాడతారని అమరావతి రైతులు ఎదురుచూశారు. ఒకరోజు షెడ్యూల్ కూడా ఫిక్సయ్యింది. కానీ రాలేదు. ఎన్టీఆర్ వర్థంతి రోజైనా వస్తారని భావించారు. కానీ నిరాశే మిగిలింది. అసెంబ్లీలో మాట్లాడలేదు, అమరావతిలో అడుగుపెట్టలేదు సరికదా, కనీసం మీడియా ముఖంగానైనా బాలయ్య మూడు రాజధానులపై ప్రకటన చేయలేదు. ప్రతి సమస్యపైనా పెదవి విప్పే బాలయ్య, ఇంతటి ముఖ్మమైన అంశం మీద ఎందుకు పెదవి విప్పడంలేదు, నందమూరి కుటుంబం నుంచి చాలామంది పాల్గొంటున్నా, ఎందుకు మద్దతివ్వడంలేదన్న అంశాలపై చాలా చర్చ జరుగుతోంది. అయితే, మూడు రాజధానుల ముచ్చటపై బాలయ్యను వెనక్కిలాగుతున్న అంశాలు కొన్ని వున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మూడు రాజధానులను వ్యతిరేకించినా, అదే వాదనతో అమరావతిలో పర్యటించినా, మిగతా రెండు ప్రాంతాల్లో తన పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యే ప్రమాదముందని బాలయ్య ఆలోచిస్తున్నారట. ఉత్తరాంధ్రలో నందమూరి అభిమానులు అత్యధికం. టీడీపీకి సైతం క్షేత్రస్థాయిలో బలముంది. విశాఖకు రాజధాని వద్దంటే ఉత్తరాంధ్ర టీడీపీ శ్రేణులే కాదు, అభిమానులు సైతం హర్ట్ అవుతారని భావిస్తున్నారట బాలయ్య. అలాగే, రాయలసీమతో బాలయ్యకు ఎనలేని బంధముంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ అక్కడ బంపర్‌హిట్. అందులోనూ హిందూపురంకు ఎమ్మెల్యే. ఇప్పుడు గనుక కర్నూలుకు జ్యూడిషియరీ క్యాపిటల్ వద్దంటే, సీమ జనం కోప్పడతారని వెనకాముందు ఆలోచిస్తున్నారట బాలకృష్ణ. సినిమా హీరోగా, హిందూపురం ఎమ్మెల్యేగా తనకు సీమలో మంచి ఫాలయింగ్, పట్టు వుందని ఆలోచిస్తున్న బాలకృష్ణ, క్యాపిటల్ వ్యవహారంలో తలదూర్చకపోవడమే మంచిదని మిన్నకుండిపోవాలని అనుకుంటున్నారట. ఇలా అటు ఉత్తరాంధ్ర, ఇటు సీమలో ఇబ్బంది తప్పదనే, అసెంబ్లీలో మౌనం. అమరావతి ఆందోళనలకూ దూరమయ్యారట బాలయ్య. మరి ఇంకెన్నాళ్లు ఇలాంటి సైలెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతారో చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire