మోహన్‌ బాబు, అలీకి నామినేటెడ్ పోస్ట్ దక్కకపోవడానికి కారణం అదేనా?

మోహన్‌ బాబు, అలీకి నామినేటెడ్ పోస్ట్ దక్కకపోవడానికి కారణం అదేనా?
x
Highlights

సినిమా ఇండస్ట్రీలో వాళ్లు లెజెండరీ నటులు. ఎన్నికల్లో వైసీపీ తరపున గట్టిగానే మాట్లాడారు. ఊరూరా ప్రచారం కూడా చేశారు. అధికారంలోకి వచ్చాక, ఏదో ఒక...

సినిమా ఇండస్ట్రీలో వాళ్లు లెజెండరీ నటులు. ఎన్నికల్లో వైసీపీ తరపున గట్టిగానే మాట్లాడారు. ఊరూరా ప్రచారం కూడా చేశారు. అధికారంలోకి వచ్చాక, ఏదో ఒక నామినేటెడ్ పోస్టు రాకపోదా అని ఆశించారు. కానీ రోజులు గడుస్తున్నాయి. నామినేటెడ్ పదవి పిలుపు మాత్రం రావడం లేదు. అంతేకాదు, తమకంటే జూనియర్లకూ జగన్‌ పిలిచి మరీ పదవులిస్తున్నారు కానీ, వీరిని మాత్రం పిలవడం లేదట. దీంతో లోలోపల రగిలిపోతున్నారట ఆ సీనియర్ నటులు. ఇంతకీ వీరికెందుకు పోస్టుల క్లాప్ కొట్టలేదు వైసీపీ అధిష్టానం ఎందుకు వీరికి పదవులు ఇంకా ఇవ్వలేదు? కారణమేంటి?

తెలుగు సినిమా ఇండస్ట్రీ. తెలుగుదేశం పార్టీతో విడదీయరాని ఇండస్ట్రీ. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు, పరిశ్రమలో అత్యధికులు టీడీపీ వైపే నిలిచారు. కానీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ స్థాపన తర్వాత, ట్రెండ్‌ కాస్త మారింది. అధికారంలోకి వచ్చాక మరింత మారుతోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో వైసీపీని అభిమానించే నటులు, దర్శకులు, నిర్మాతల సంఖ్య పెరుగుతోంది. గత ఎన్నికల ప్రచారంలోనూ చాలామంది వైసీపీకి ప్రచారం చేశారు. అయితే అధికారంలోకి వచ్చాక, తమకు ఏవో ఒక నామినేటెడ్ పదవులు వస్తాయని, చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు ఆశించారు. కానీ కొందరికే దక్కడంతో, మిగిలినవారంతా అలకపాన్పు ఎక్కారన్న చర్చ జరుగుతోంది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారికి పలు పదవులు కట్టబెడుతోంది. 30 ఇయర్స్ పృధ్వీకి ఎస్వీబీసీ చైర్మన్‌ను చేసింది. తాజాగా విజయ్ చందర్‌కు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అపాయింట్ చేసింది. అంతకు ముందే ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ చైర్మన్‌గా నియామకం చేసింది. సీఎం జగన్ నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నార ప్రతిసారీ తెలుగు సినిమాకు సంబంధించి పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈసారైనా దక్కకపోదా అని ఆశిస్తుంటారు. అందులో మంచు మోహన్ బాబు ఒకరైతే, అలీ మరొకరు. పోసాని మురళి కూడా వున్నారు. కానీ ఈసారి కూడా వారికి నిరాశే ఎదురైంది.

మంచు మోహన్‌ బాబు, సీఎం జగన్‌కు స్వయానా బంధువు కూడా. ఎమ్మెల్యేగానో, ఎంపీగానో వైసీపీ తరపున మోహన్ బాబు పోటీ చేసే అవకాశముందని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. దీంతో అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవి పక్కాగా ఇస్తారన్న చర్చ సాగింది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ను చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ప్రస్తుతం ఆ పదవి విజయచందర్ ఎగరేసుకుపోయారు.

ఇక హాస్యనటుడు అలీ కూడా, ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు. విజయవాడ, లేదా గుంటూరులో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని, చేరిక సమంయలో జగన్‌ను అడిగారట అలీ. అయితే, ఎక్కడికక్కడ అభ్యర్థులను ఆల్రెడీ ఖరారు చేశామని, గెలిచిన తర్వాత తప్పకుండా న్యాయం చేస్తామని తనకు హామినిచ్చారని చెప్పుకున్నారు అలీ. పార్టీలో చేరిన వెంటనే, ఎన్నికల ప్రచార సభల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు అలీ. కానీ నామినేటెడ్ పోస్టు ఇఫ్పటి వరకు తనకు ఇవ్వకపోవడం పట్ల అలీ నిరాశగా ఉన్నారని, ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు.

ఇక చంద్రబాబుపై ధాటిగా విమర్శలు కురిపించిన ఇండస్ట్రీ పర్సన్స్‌లో పోసాని మురళి ఒకరు. మొదటి నుంచి ఏపీలో జగన్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఘంటాపథంగా చెప్పిన వ్యక్తి పోసాని. అయితే, పోసాని ఇంటి తలుపును సైతం, ఇప్పటి వరకు ఎలాంటి పోస్టు తట్టలేదు. దీంతో ఈయన కూడా కాస్త నిరాశకు లోనైనట్టు తెలుస్తోంది. అయితే, చిత్ర సీమలో ఇఫ్పటి వరకు, వైసీపీ సర్కారులో పదవులు పొందిన వారు, పొందని వారిని పరిశీలిస్తే, చాలా విషయాలు అర్థమవుతాయని కొందరంటున్నారు. కొందరికి నామినేటెడ్ పోస్టులు దక్కకపోవడానికి కూడా అదే కారణమంటున్నారు విశ్లేషకులు.

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదవులుపొందిన వారిని పరిశీలిస్తే వారంతా జగన్‌కు మొదటి నుంచి అండగా ఉన్నవారే. 30 ఇయర్స్ పృథ్వీ వైసీపీ ఆరంభం నుంచే జగన్ వెంట ఉన్నారు. అలాగే, విజయ్ చందర్ కూడా.

ఇక మిగతావారి విషయం, వీరికి కాస్త భిన్నంగా వుందంటున్నారు విశ్లేషకులు. వారంతా ఎన్నికలకు కొన్ని నెలలు లేదా కొన్ని రోజుల ముందు మాత్రమే వైసీపీకి టచ్‌లోకి వచ్చారు. కొందరైతే, జనసేనలోకి వెళ్దామా, టీడీపీ సైకిల్ ఎక్కుదామా లేదంటే వైసీపీ ఫ్యాన్ చెంతకు చేరుదామా అని, అన్ని పార్టీల గడపలూ తొక్కి, ఏది అనువైనదిగా వుందో ఎంచుకుని, పార్టీలో చేరారు. పదవులు ఊరికే రావు, పోస్టులిచ్చే పార్టీనే నమ్మాలన్న సిద్దాంతంతో కండువా కప్పుకున్నారు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వంలో పదవులు పొందినవారి జాబితా పరిశీలిస్తే, మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికే జగన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారని అర్థం చేసుకోవాలి. ఆ ప్రాధాన్యత క్రమంలో కొందరు ప్రముఖ నటులు వెనకబడిపోయారు. ఆ లిస్టు ప్రకారం చూసుకుంటే, వారికీ ఏవో ఒక పదవులు వస్తాయని కొందరంటున్నారు. చూడాలి, ఆశించినవారికి ఆశించిన పదవులు దక్కుతాయో, నిరాశే మిగులుతుందో.

Keywords: YSR Congress Party, mohan babu, Ali, nominated post


Show Full Article
Print Article
More On
Next Story
More Stories