New Police Commissioner: బెజవాడ పోలీస్‌ కమిషనర్‌ కొత్త బాస్‌ ఎవరు?

Who in New Police Commissioner To Vijayawada
x

New Police Commissioner: బెజవాడ పోలీస్‌ కమిషనర్‌ కొత్త బాస్‌ ఎవరు?

Highlights

New Police Commissioner: బెజవాడ పోలీస్‌ కమిషనరేట్‌కు కొత్త కమిషనర్‌ రాబోతున్నారా?

New Police Commissioner: బెజవాడ పోలీస్‌ కమిషనరేట్‌కు కొత్త కమిషనర్‌ రాబోతున్నారా? రేసులో నలుగురిలో ఎవరికి చాన్స్‌ దక్కబోతోంది? గతంలో విజయవాడ కమిషనర్‌గా పనిచేసిన డీజీపీగా ఎదిగిన హాట్‌సీట్‌లో కూర్చునేది ఎవరు? నేరాల అడ్డాగా మారిన బెజవాడలో రౌడీషీటర్లకు సింహస్వప్నంలా పనిచేసేది ఎవరు? వ్యాస్‌లాంటి సీనియర్లు పనిచేసిన ఆ కమిషనరేట్‌కు నెక్స్ట్‌ బాస్‌ ఎవరు?

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌కు వచ్చే కొత్త బాస్‌ ఎవరనే చర్చ పోలీసు వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ప్రస్తుత పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాసులు ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేయనున్నారు. తర్వాత ఆ స్థానంలో ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందనే చర్చ సాగుతోంది. కీలకమైన బెజవాడ పోలీస్‌ కమిషనర్‌ నియామకానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా తీవ్రంగానే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో వినీత్‌బ్రిజ్‌లాల్‌, జి.పాలరాజు, కాంతిరాణాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఏ స్థాయి అధికారులు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా రాబోతున్నారన్న దానిపై స్పష్టత లేదు. మొదట్లో ఈ పోస్టులో డీఐజీ స్థాయి అధికారులను, ఆ తర్వాత అదనపు డీజీ స్థాయి అధికారులను నియమించారు. గతంలో ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించిన గౌతమ్‌సవాంగ్‌, సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు డీజీ హోదా అధికారులు. తర్వాత ఐజీ హోదాలో సంయుక్త కమిషనర్‌గా ఉన్న బత్తిన శ్రీనివాసులును పోలీస్‌ కమిషనర్‌గా నియమించారు. శ్రీనివాసులు ఉద్యోగ విరమణ తర్వాత ఆ స్థానంలో ఏ హోదా అధికారులను నియమిస్తారనేది చర్చనీయాంశంగా ఉంది.

ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో కాంతిరాణా, పాలరాజు గతంలో విజయవాడ పశ్చిమ మండల ఉపకమిషనర్లుగా పనిచేశారు. కాంతిరాణా డీఐజీ హోదాలో కొన్నాళ్ల పాటు సంయుక్త కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత అనంతపురం రేంజ్‌కు బదిలీ అయ్యారు. పాలరాజు మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సాంకేతిక విభాగానికి డీఐజీగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో వినీత్‌బ్రిజ్‌లాల్‌ ఐజీ హోదాలో, కాంతిరాణా, పాలరాజు డీఐజీ హోదాలో ఉన్నారు. ఒకవేళ ఐజీ హోదా అధికారినే ఇక్కడ నియమించాలని ప్రభుత్వం భావిస్తే, వినీత్‌బ్రిజ్‌లాల్‌కే అవకాశం దక్కొచ్చు. హోదాతో సంబంధం లేకుండా డీఐజీ స్థాయి వారిని నియమించాలని భావిస్తే పాలరాజు, కాంతిరాణాల్లో ఎవరో ఒకరికి అవకాశం రావచ్చని తెలుస్తోంది. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోలోనే కొనసాగించాలని భావిస్తే గనుక, ఐజీ పదోన్నతికి దగ్గరలో ఉన్న కాంతిరాణా, పాలరాజుల్లో ఎవరో ఒకరిని పోలీస్‌ కమిషనర్‌ పోస్టు వరించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎస్ఈబీలో ఇన్‌ఛార్జ్‌గా ఉన్న శ్రీకాంత్‌ కూడా కమిషనర్‌ రేసులో ముందున్నారని సమాచారం.

బెజవాడలో పోలీసు కమిషనర్‌గా పనిచేయాలంటే అది కత్తిమీద సామే. అన్ని విభాగాల అధినేతలు, వీఐపీలు, వీవీఐపీలు తిరుగుతారు. అలా అన్ని విభాగాలపై పట్టున్న వారికి ఛాన్స్ ఇస్తేనే ఇక్కడ పనిచేయడం తేలిక అన్న భావన ఉంది. ప్రస్తుతం డీజీపీకి, ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉంటూ, ప్రతీ విషయంలో ఎలా మాట్లాడాలో అనే విషయాలపై సూచనలిస్తున్న పాలరాజుకే కమిషనర్‌ పోస్టు దక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. ఏదేమైనా డీఐజీ స్ధాయిని కుదించి, బెజవాడకు కమిషనర్‌గా పంపితే చాన్సెస్‌ పాలరాజుకే ఉన్నాయన్నది పోలీసు శాఖలో ఇంటర్నల్‌గా జరుగుతున్న చర్చ‌. మరి ఎవరు వస్తారో ఎలా వస్తారో తెలియాలంటే లెటజ్ వెయిట్ అండ్‌ సీ.


Show Full Article
Print Article
Next Story
More Stories