Andhra Pradesh: డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు చంద్రబాబు?

Where does Chandrababu get the money from?
x

Andhra Pradesh: డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు చంద్రబాబు?

Highlights

ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మరో శ్రీలంకగా మారిపోతుంది. వేల కోట్ల అప్పులు, పప్పు బెల్లాల్లా నగదు పంపిణీలతో రాష్ట్ర ఖజానా మైనస్ లో కూరుకుపోయింది.

చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాడిన ప్రభుత్వానికి... జూలై 1 నాటికి రూ. 10,500 కోట్లు కావాలి.

పెన్షన్లకు 4,500 కోట్లు. జీతాలకు 6,000 కోట్లు.

ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు మమూలుగా లేవు.

రైతులకు ఏటా రూ 20 వేలు.

స్కూలుకు వెళ్ళే ప్రతి బిడ్డకు 15 వేలు.

18 నుంచి 59 ఏళ్ళ దాకా ప్రతి మహిళకు 15 వేలు.

నిరుద్యోగ భృతి 3 వేలు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం

ఇవి సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీలు

ఇవే ఇప్పుడు చంద్రబాబు ముందున్న పెను సవాళ్ళు.

ఊబిలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మరో శ్రీలంకగా మారిపోతుంది. వేల కోట్ల అప్పులు, పప్పు బెల్లాల్లా నగదు పంపిణీలతో రాష్ట్ర ఖజానా మైనస్ లో కూరుకుపోయింది. ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీ జీతాలివ్వలేని దుస్థితి నెలకొంది. జగన్ రెడ్డి బటన్ నొక్కి రాష్ట్రాన్ని రుణగ్రస్తం చేశారని నిన్న మొన్నటి దాకా అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ఆరోపించింది.

ఇపుడు సీన్ రివర్స్ అయింది. జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించారు. చంద్రబాబుకు మళ్ళీ అధికారం అప్పగించారు. కాకపోతే జగన్ అందించిన పథకాల కన్నా ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకిచ్చిన పథకాల విలువ చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే దాదాపు రెట్టింపు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనూ, పార్టీ తరపున ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో కూడిన మ్యానిఫెస్టోను అమలు చేయాల్సిన బాధ్యత ఇపుడు చంద్రబాబుపై ఉంది. దీనిని బాధ్యత అనే కంటే చంద్రబాబుకు సీఎం కాగానే ఎదురవుతున్న భారీ సవాల్ అనే చెప్పాలి. ఈ సవాల్ ను అధిగమించటానికి ఆయన భారీ కసరత్తే చేయాలి.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన రకరకాల పథకాల విలువ ఏడాదికి 70 వేల కోట్ల రూపాయలు. 2019 నుంచి 2024 దాకా అధికారంలోకి ఉన్న జగన్ సుమారు రెండు లక్షలా 75 వేల కోట్ల రూపాయలను వివిధ పథకాల కింద ప్రజలకు డైరెక్ట్ బెన్ ఫిట్ ట్రాన్స్ ఫర్ .. డీబీటీ రూపంలో అందించారు. దేశవ్యాప్తంగా మారిపోయిన ఆర్ధిక సాంకేతిక వ్యవస్థను అనుసరించి చంద్రబాబు కూడా దళారులు, ఇతర మధ్యవర్తుల ప్రమేయానికి ఏ మాత్రం ఆస్కారం లేని డీబీటీ రూపాన్ని అనుసరించాల్సిందే. డీబీటీ రూపంలో చంద్రబాబు ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాల విలువ జగన్ సర్కారు ఇచ్చిన దాని కంటే చాలా ఎక్కువ. జగన్ ఏడాదికి 70 వేల కోట్ల విలువైన పథకాలందిస్తే చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిన పథకాల విలువ మాత్రం రూ 1.65 లక్షల కోట్లుగా అంచనా.

అంత లేదు, జగన్ పథకాల్లో కొన్ని మార్పులు చేసి అమలు చేసే అవకాశం ఉన్నందున ఏడాదికి రూ రూ 1.2 లక్షల కోట్ల నుంచి 1.25 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వాళ్ళు చెప్పిందే నిజమనుకున్నా అదనంగా మరో రూ 50 వేల కోట్లను ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. జగన్ పంచిన డబ్బును చూపించి గగ్గోలు పెట్టి ఏపీ శ్రీలంకగా మారుతుందని చెప్పిన నేపథ్యంలో రూ 1.20 కోట్లను చంద్రబాబు ఎక్కడ నుంచి తీసుకురావాలి?

చంద్రబాబు సంపద సృష్టిస్తారని ఆ పార్టీ వర్గాలు విస్తృతంగా ప్రచారం చేస్తుంటాయి. సంపద సృష్టి రాత్రికి రాత్రే సాధ్యం కాదు.. పథకాలు మాత్రం ఎప్పటికపుడు టైమ్ అంటే టైమ్ కు ప్రజలకు అందించాలి. సమయానికి పథకాలు అందించలేకపోయినా, వాయిదాలు వేసినా, ఆ పథకాల్లో భారీ కోతలు విధించినా ప్రజల నుంచి వ్యతిరేకత మొదలవుతుంది. చంద్రబాబు హామీలిస్తారు తప్ప అమలు చేయరని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని నిజం చేసేందుకు ఆయనిప్పుడు సిద్ధంగా లేరు. ఎలాగైనా పథకాలను అమలు చేయాలన్న సంకల్పంతోనే చంద్రబాబు ఉన్నారు.. ఒక వైపు అభివృద్ధినీ, మరో వైపు సంక్షేమాన్ని జోడు గుర్రాల స్వారీలా ముందుకు నడిపించే క్రమంలో చంద్రబాబు అనేక సవాళ్ళను ఎదుర్కోబోతున్నారని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

జూలై 1 న చంద్రబాబుకు తొలి సవాల్

రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబుకు రానున్న జులై ఒకటినే తొలి సవాల్ ఎదురు కానుంది. వృద్ధులు, వికలాంగులు తదితరులకు అందించే సామాజిక పెన్షన్లకు భారీగా నిధులను వెచ్చించాల్సి వస్తుంది.గత ప్రభుత్వం అందించిన రూ 3 వేల పెన్షన్ ను రూ 4 వేలకు పెంచుతామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు ఫైలుపై ఈనెల 13 గురువారం నాడు ఆయన సంతకం కూడా చేశారు. ఏప్రిల్ 1 నుంచి పెన్షన్ పెంపును హామీ ఇవ్వటం వల్ల జులై 1 అందించే 4 వేల పెన్షన్ కు మరో 3 వేలను కలిపి మొత్తం రూ 7 వేల పెన్షన్ ను అందించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో సుమారు 66 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు.. రూ 7 వేల చొప్పున పెన్షన్ల కోసం సుమారు రూ 4500 కోట్ల రూపాయలను కేటాయించాల్సి ఉంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రతి నెలా ఒకటోతేదీన ఉద్యోగులకు జీతాలిస్తారని చంద్రబాబుకు పేరుంది. జగన్ అలా ఇవ్వలేకపోయారు.

ఉద్యోగుల్లో జగన్ పై వ్యతిరేకత రావటానికి అది కూడా ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో పెన్షన్లు ఇచ్చినట్లే జూలై ఒకటో తేదీ నాడే ఉద్యోగుల జీతాల కోసం 6 వేల కోట్ల రూపాయలు రెడీ చేయాలి. మొత్తం 10,500 కోట్ల రూపాయలను జులై 1 నాటికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధం చేయాల్సి ఉంది. ఆ తరువాత కూడా అంటే ఆగస్టు 1 నుంచి పెన్షన్ల కోసం 2600 కోట్లను వెచ్చించాల్సి ఉంటుంది. ఈ మేరకు నిధుల సమీకరణపై ఉన్నతాధికారులతో చంద్రబాబు మాట్లాడుతున్నారు.

అమ్మకు వందనం.. భారీగా నిధుల అవసరం

అమ్మ ఒడి పేరుతో జగన్ ప్రభుత్వం బడికి వెళ్ళే పిల్లల తల్లుల ఖాతాలకు ఏడాదికి రూ 15 వేల జమ చేసింది. వారి ఆదాయ పరిమితుల ఆధారంగా అర్హతలు నిర్ణయించటమే కాకుండా ఎందరు పిల్లలున్నా వారిలో ఒకరికి మాత్రమే వర్తించేలా రూ 15 వేలు అందించింది. దీని కోసం జగన్ ప్రభుత్వం ఏడాదికి రూ. 6,500 కోట్లను వ్యయం చేసింది. ఇదే స్కీమును చంద్రబాబు మరింత సరళతరం చేస్తూ మ్యానిఫెస్టోలో ప్రకటించారు. సూపర్ సిక్స్ లో ఒకటైన ఈ పథకానికి అమ్మకు వందనంగా నామకరణం చేశారు. కుటుంబంలో ఎందరు పిల్లలున్నా వారికి తల్లి బ్యాంకు ఖాతాల్లో 15 వేలు జమ చేస్తామని ప్రకటించారు.

పాఠశాల విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఇపుడా హామీని నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. జులై చివరికల్లా, లేదంటే ఆగస్టులో అమ్మకు వందనం పథకం అమలు చేయాలి. ఈపథకం కోసం జగన్ ప్రభుత్వం 6500 కోట్ల రూపాయలను వ్యయం చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇపుడా వ్యయం 13 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. కొత్తగా లబ్దిదారులను పెంచకపోయినా ఇపుడున్న లబ్దిదారులకే పథకాన్ని వర్తింపచేసినా..కుటుంబానికి సగటున ఇద్దరు పిల్లలను లెక్కకడితే ఏడాదికి కనిష్టంగా రూ 13 వేల కోట్లు..ఆ పైన ఎంతైనా పెరగవచ్చని అంచనా. ఈ మేరకు నిధులు సమకూర్చాల్సి ఉంటే చంద్రబాబు భారీ కసరత్తు చేయకతప్పదు.

రైతులకు ఏడాదికి 20 వేలు... ఎలా?

వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో గతంలో జగన్ ప్రభుత్వం ఏడాదికి మూడు విడతలుగా 13 వేల 500 రూపాయలను ఇస్తే చంద్రబాబు మాత్రం ఎన్నికల్లో 20 వేలు హామీ ఇచ్చాడు. సూపర్ సిక్స్ మ్యానిఫెస్టోలో వెల్లడించిన అన్నదాత పథకం కింద ఏడాదికి అర్హతగలిగిన రైతులందరికీ 20 వేలు ఇవ్వాల్సి ఉంది.

పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 6 వేల రూపాయలకు అదనంగా మరో ఏడున్న వేల రూపాయలను కలిపి మొత్తం పదమూడున్నర వేల రూపాయలను జగన్ ప్రభుత్వం అందిస్తే చంద్రబాబు ప్రభుత్వం దానికి మరో ఆరున్నర వేలను కలిపి 20 వేలను ప్రకటించింది. కేం

ద్ర ప్రభుత్వం అందించే 6 వేలు పోను మరో 14 వేలను రాష్ట్ర ప్రభుత్వం జత చేయాల్సి ఉంటుంది.ఇంతటి ఆర్ధికభారాన్ని మోయాలంటే ఆదాయమార్గాలను భారీగా పెంచుకునేలా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటినుంచే ప్రారంభించాల్సి ఉంటుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రం.. అస్తవ్యస్తం

ఈ ఏడాది 2024-25 ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల అయిదు వేల మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయల (2,05,352) రెవెన్యూ అంచనాను ప్రకటించింది. రెండు లక్షలా ముప్పయి వేల నూట పది కోట్లను (2,30,110.41) వ్యయంగా చూపించింది. అంటే, రెవెన్యూ లోటు సుమారు 25 వేల కోట్లు.

2023-24 అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తలపై నాలుగు లక్షలా ఎనభై మూడు వేల కోట్ల రూపాయల అప్పులున్నాయి. అవి రాష్ట్ర స్థూల ఆదాయంలో 33.3 శాతం. అప్పుల కోసం ప్రభుత్వం లక్షా ముప్పయి తొమ్మిది కోట్ల రూపాయల ప్రభుత్వ గ్యారంటీలను సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై ఆరు కోట్ల అప్పు తీసుకుంది.

ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్న ప్రశ్న ఎదురవుతోంది? పాత అప్పుల భారాన్ని మోస్తూ కొత్త పథకాలకు నిధులు ఖర్చు చేయాలంటే రెవెన్యూ అంచనాలు బాగా పెంచాలి. ఈ అంచనాలు వాస్తవానికి దూరంగా ఉంటే పరిస్థితి మరింత క్లిష్టంగా తయారవుతుంది.

అందికే, వచ్చే బడ్జెట్ సెషన్లో రెవెన్యూ అంచనా, వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం లేకుండా చూపించడానికి ఈ ప్రభుత్వం భారీ కసరత్తు చేయాల్సి ఉంటుందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులుకు జీతాలు, పెన్షన్లు, తీసుకున్న అప్పులపై వాయిదాలు, వడ్డీల చెల్లింపుల కోసమే ఇపుడు ఏడాదికి లక్షా ముప్పయి ఒక్క వేల కోట్లు అవసరమవుతుంటే, చంద్రబాబు హామీలన్నిటినీ అమలు చేస్తే ఆ మొత్తం రెండు లక్షల కోట్లకు చేరుతుంది. చంద్రబాబు ఇంత సంపదను ఎలా సృష్టిస్తారు? ఆయన ఏ మ్యాజిక్ చేస్తారు?


Show Full Article
Print Article
Next Story
More Stories