మాజీ మంత్రి, గల్లా అరుణ కుమారి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేయడం పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. వయసు మీద పడుతున్న నేపథ్యంలో,...
మాజీ మంత్రి, గల్లా అరుణ కుమారి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేయడం పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. వయసు మీద పడుతున్న నేపథ్యంలో, పదవికి న్యాయం చేయలేనని చెప్పి రాజీనామా చేశారు అరుణ. కొత్తవారికి అవకాశాలు రావాలి కదా అంటూ శెలవిచ్చారు. మరి నిజంగానే వయో భారమనా? లేదంటే టీడీపీలో వుండటమే భారమా? గల్లా రాజీనామా అసలు స్టోరీ వేరే వుందా? ఆమె మనసు వైసీపీ వైపు లాగుతోందా? లేదంటే బీజేపీ రారమ్మంటోందా?
గల్లా అరుణ కుమారిది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఆమె తండ్రి పాటూరి రాజగోపాల్ నాయుడు ఎన్జీ రంగా సహచరుడు. పార్లమెంటు సభ్యుడుగా సేవలందించారు. తండ్రికి తగ్గ తనయురాలుగా రాజకీయాల్లో రాణించారు అరుణ. గ్రూపులు, వర్గాలతో ఉండే కాంగ్రెస్ లో తనదైన శైలిలో దూసుకెళ్లారు. చాలా కాలంపాటు ఆమె ఇతర గ్రూపుల్లో ఉన్నా, వైయస్ పాదయాత్ర నుంచి ఆయనకు ఆప్తమిత్రురాలిగా మారిపోయారు. చిత్తూరు జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డి, గల్లా అరుణకుమారి వైయస్ వర్గీయులుగా రాణించారు. వైయస్ కూడా వారికి అదేవిధంగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఆయన క్యాబినెట్‌లో మంత్రిగా మొదలైన ప్రస్థానం, ఆయన మరణం తరువాత కూడా రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గంలో కొనసాగారు అరుణ. ఏపీ విభజన తరువాత కాంగ్రెస్ కోలుకోలేని స్థితికి చేరింది. ఆమె కూడా టిడిపిలో చేరారు.
కొడుకు రాజకీయ భవిష్యత్తు కాంక్షించిన ఆమె, కొడుకులోనే తన రాజకీయాలు చూసుకోవాలనుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు అందరూ ఆమె వైసిపిలో చేరుతారని బాగానే ప్రచారం చేశారు. అయితే అలా జరగలేదు. ఆమె టిడిపి వీడలేదు. గల్లా కుటుంబం టిడిపిలో చేరడం వల్ల గల్లా అరుణకు పెద్దగా కలిసి రాకపోయినా, ఆమె కొడుక్కి, బాగా కలిసొచ్చింది. కొడుకు గల్లా జయదేవ్ గుంటూరు నుంచి రెండుసార్లు ఎంపీ అయ్యారు. గుంటూరులోనే ఉంటూ అక్కడే ఆయన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. దీంతో చిత్తూరు జిల్లాలో ఆమె పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అదే సమయంలో కొద్ది నెలల క్రితమే ఏపీ ప్రభుత్వం గల్లా కుటుంబానికి షాక్ ఇచ్చింది. గతంలో గల్లా కుటుంబానికి చెందిన కంపెనీకి కేటాయించిన 253 ఎకరాల భూమిని, పదేళ్ళ తరువాత తిరిగి స్వాధీనం చేసుకోవడం, గల్లా కుటుంబానికి ఒక రకంగా పరాభవమే. పారిశ్రామికంగా,రాజకీయంగా జిల్లాలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన గల్లాకు, ఇది ఊహించని షాకే.
తెలుగుదేశం అధికారం కోల్పోయాక ఏదో ఒకటి జరుగుతుందని ఊహించినా ఈస్థాయిలో షాక్ తగులుతుందని మాత్రం అనుకోలేదు. పార్లమెంటులో మిస్టర్ ప్రైమినిష్టర్ అంటూ దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఈ పరిణామాన్ని పసిగట్టలేదు. గతంలో చంద్రబాబు గుడ్ లుక్స్ లో పడటం కోసం బిజెపి పట్ల దూకుడుగా వ్యవహరించి, కేంద్రానికి దూరమయ్యారు. రాష్ర్టంలో అధికారంలో ఉన్న వైసిపికి చేరువ కాలేకపోయారు. దరిమిలా కొన్ని పర్యావసానాలు ఆమెను కృంగదీశాయి. అదే సమయంలో ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాల్లో తన ఒరవడిని కొనసాగిస్తూ వచ్చిన ఆమెకు, ఎప్పుడూ ఈ తరహా ఎదురుదెబ్బ తగల్లేదు. తనదైన శైలిలో రాజకీయాలు నెరపిన గల్లా కుటుంబానికి, ఇప్పుడు ఎదురుగాలి మొదలైంది. రాజశేఖర్ రెడ్డి కోటరీగా ముద్రపడిన అరుణకుమారికి, ఇప్పుడు ఆయన కుమారుడి దగ్గర పప్పులుడకడం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గల్లా కుటుంబానికి ఇంత పెద్ద కుదుపు ఎప్పుడూ రాలేదు. గల్లా అరుణకుమారి కూడా రానిచ్చేదాకా పోనిచ్చుకునేవారు కాదు.
కొడుకు ఎంపీగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నారు. తలొగ్గి రాజకీయాలు చేసే పరిస్థితిలో ఆ యువ ఎంపీ ఉన్నట్టు లేరు. ఇవన్నీ ఇప్పుడు కర్ణుడి శాపాల్లా మారాయి. వైఎస్ జగన్ షాక్ తరువాత అంతర్మధనం మొదలైంది అరుణలో. అదే సమయంలో టిడిపి పుంజుకునే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడం లేదు. వెరసి టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా. మరో ప్రస్థానానికి ఈ లేఖాస్ర్తం తొలి ప్రస్థానంగా భావిస్తున్నారు విశ్లేషకులు.
వైసిపిలో చేరాలంటే తల్లీ కొడుకులకు అవకాశం తక్కువ. తనకు లేకున్నా కొడుకు భవిష్యత్తుపై ఫుల్ గ్యారంటీ దొరకలేదు. అదే సమయంలో కూతురు రమాదేవి సొంత జిల్లాలో తన వారసత్వాన్ని కొనసాగించడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. అన్నా చెల్లెలికి గానీ, అమ్మా కొడుక్కుగానీ చిత్తూరు, గుంటూరు జిల్లాలలో సీట్లివ్వగలిగిన పార్టీ తెలుగుదేశం మాత్రమే. ఆ పార్టీ నుంచి సీట్లిచ్చినా ఓట్లొచ్చే పరిస్థతి కానరావడం లేదు. గతంలో జాతీయ పార్టీలో ఉన్న ఆమెకు, గెలుపోటముల ప్రభావం, జాతీయస్థాయి పార్టీలో ఉంటే ఎలా ఉంటాయి, ప్రాంతీయ పార్టీల్లో ఉంటే ఎలా ఉంటాయో తెలిసొచ్చింది. ఈ పరిస్థితుల్లో కలిసొచ్చే కాలం కోసం నడిసొచ్చే పార్టీగా బిజెపి కనిపిస్తోంది.
గెలిచినా ఓడినా జాతీయ పార్టీ కాబట్టి, కొంత భరోసా ఉంటుంది. పైపెచ్చు ఆమెకు కావలసిన సీట్లకు కూడా ఢోకా ఉండదు. వైసిపిలో బెర్త్ లేదు. చంద్రగిరిలో చెవిరెడ్డిని కాదనలేరు. గుంటూరులో జయదేవ్ కు ఇవ్వలేరు. ఈ పరిస్థితుల్లో టిడిపిలోనే ఉండటం కన్నా, బిజెపిలో చేరితే రాష్ర్టంలో ఓటమి పాలైనా, జాతీయ స్థాయిలో చక్రం తిప్పొచ్చని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఆలోచనని, నిర్ణయాన్ని కొడుకు ఇప్పటికీ పూర్తిగా అంగీకరించినట్లు లేదు. అందుకే ఆమె కూడా తన స్టెప్ వేస్తున్నానని చెప్పడానికి సంకేతం ఇచ్చినట్లు తెలుస్తోంది. బిజెపి నేతలు కూడా అంగబలం, అర్థ బలం ఉన్న నేతల వేటలో ఉన్నారు. అదే క్రమంలో గల్లాకు బిజెపి ఎంత అవసరమో, బిజెపి రాష్ట్ర పార్టీకి గల్లా కూడా అంతే అవసరం. రానున్న రోజుల్లో గల్లా కుటుంబ రాజకీయం, ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire