TTD chairman Vs Ramana Deekshitulu: వైవీ సుబ్బారెడ్డితో దీక్షితులు గొడవేంటి.. తెరవెనక అసలు కథేంటి?
TTD chairman Vs Ramana Deekshitulu: తిరుమల క్షేత్రంలో చీమ చిటుక్కుమన్నా అది సంచలనమే. స్వామివారికి మేల్కొలుపు లేటైనా, శ్రీవారికి నిత్యం జరిగే...
TTD chairman Vs Ramana Deekshitulu: తిరుమల క్షేత్రంలో చీమ చిటుక్కుమన్నా అది సంచలనమే. స్వామివారికి మేల్కొలుపు లేటైనా, శ్రీవారికి నిత్యం జరిగే సేవలలో ఏదైనా మిస్సైనా, పెద్ద దుమారమే. కఠినమైన, నిష్టాగరిష్ట నియమాలు, విధానాలతో నడిచే దేవాలయం తిరుమల. ఈ క్షేత్రంలో జరుగుతున్న అనేక విషయాలపై గౌరవ ప్రధాన అర్చకుడు, రమణదీక్షితులు సంధించిన, సంధిస్తున్న ప్రశ్నలు మరోసారి కొండపై కలకలం రేపుతున్నాయి. వీటికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన కౌంటర్‌తో మరింత రచ్చరచ్చ అవుతోంది. ఏకంగా సీఎంకే దీక్షితులు ఫిర్యాదుతో, రాజకీయ మంటలూ రేగుతున్నాయి. అయితే, దీక్షితులు ట్వీట్ల మంటల వెనక అసలైన ట్విస్టులు వేరే వున్నాయన్న మాటలు ధ్వనిస్తున్నాయి. ఏంటవి?
ప్రపంచ హిందువుల ఆరాధ్యదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధి, ఆలయ పాలనా వ్యవహారాలపై మరోసారి రగిలిపోయారు టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువును తాకే అదృష్టం కలిగి, ఆసాంతం ఆయన సేవలో తరించిన రమణ దీక్షితులు కామెంట్లు, ఇప్పుడు రచ్చరచ్చ అవుతున్నాయి. ట్విటర్ వేదికగా అధికారులపై విమర్శలు గుప్పించారు దీక్షితులు. టీటీడీలో కరోనా కేసులు పెరిగిపోతున్నా దర్శనాలు రద్దు చేయడం లేదని సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు. 'టీటీడీలోని 50మంది అర్చకుల్లో 15మందికి పాజిటివ్ వచ్చింది. మరో 25మంది ఫలితాలు రావాల్సి ఉంది. అయినా దర్శనాల నిలిపివేతపై ఈవో, అదనపు ఈవో నిర్ణయం తీసుకోలేదు. గతంలో చంద్రబాబు, టీడీపీ అనుసరించిన మిరాశీ అర్చక, బ్రాహ్మణ వ్యతిరేక విధానాలనే ఇప్పుడూ టీటీడీ అనుసరిస్తోంది. ఇలాగే కొనసాగిస్తే టీటీడీలో ఉపద్రవం వస్తుంది, దయచేసి చర్యలు తీసుకోండి' అంటూ, సీఎం జగన్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు దీక్షితులు.దీక్షితులు ట్వీట్‌పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కౌంటర్, మరింత అగ్గిరాజేసింది. అర్చకుల ఆరోగ్యం విషయానికి రాజకీయ రంగు పులమొద్దని, టీటీడీ అధికారులను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు సుబ్బారెడ్డి. ఏవైనా సలహాలుంటే బోర్డు దృష్టికి తీసుకురావాలే తప్ప మీడియా ద్వారా కామెంట్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రమణదీక్షితులు విమర్శలు, ఆరోపణలు, దానికి సుబ్బారెడ్డి కౌంటర్, ఆధ్యాత్మిక క్షేత్రంలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. గతంలోనూ దీక్షితులు ఇంతకంటే సంచలన వ్యాఖ్యలే చేసినా, ఇప్పుడు మాత్రం ఆయన వ్యాఖ్యల వెనక ఏదో మతలబు వుందనంటున్నారు టీటీడీ వర్గాలు. దాదాపు పదిరోజుల క్రితం కూడా, అందరూ స్టన్నయ్యేలా ఒక డిమాండ్ చేశారు. ఉత్తరాఖాండ్ తరహాలో తిరుమలను రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం నుంచి వేరు చెయ్యాలన్నదే ఆ డిమాండ్. ఇప్పుడు కరోనా వేళ, మరోసారి అసంతృప్తగళం విప్పారు. ఇంతకీ దీక్షితులు మాటల వెనక అర్థమేంటి? పరమార్థమేంటి? దీక్షితుల ఆవేదనపై కొండపై జరుగుతున్న చర్చేంటి?
గత ప్రభుత్వంపై, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై దీక్షితులు చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. బాబుకు భారీ దెబ్బనే కొట్టాయి. పింక్ డైమండ్ మిస్సైందని, దేశం దాటిపోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశంలోనే సంచలనం రాగా, తెలుగుదేశానికి బాగా ఇబ్బంది కలిగించింది. అప్పటి ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురై కుటుంబంతో రమణదీక్షితులు గర్భాలయం నుంచి బయటపడాల్సిన పరిస్థితి వచ్చింది. నాడు ప్రతిపక్ష నేతగా వున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి, దీక్షితుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి రాగానే సముచిత న్యాయం చేస్తానని హామి ఇచ్చారు. ఆ వాగ్దానం నెరవేర్చారు కానీ, పూర్తిస్థాయిలో కాదు. అదే దీక్షితుల ఆవేదనకు కారణమని, తాజా కామెంట్లను కూడా అదే నేపథ్యంలో చూడాల్సి వుంటుందంటున్నారు విశ్లేషకులు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే, దీక్షితులుకు ఇచ్చిన హామిని నెరవేర్చారు. టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడిగా ఆయనను చేశారు. కానీ దేవుడు వరమిచ్చినా, పూజారి కనికరించలేదన్నట్టుగా, సీఎం భరోసా ఇచ్చినా, అధికారుల ఆసరా దొరకలేదు. గౌరవ ప్రధాన అర్చకుడిగా నియమించినా, ఆయన విధులేంటో, పనేంటో మాత్రం నిర్ణయించలేదు. దీనికితోడు బాబు హయాంలో గర్భ గుడి నుంచి వెళ్లిపోయిన దీక్షితులు, మళ్లీ ఇప్పుడు వచ్చారంటూ స్వపక్షంలోని అర్చకుల అంతర్గత పోరు, రమణకు అడ్డంకిగా మారింది. అధికారులూ సైతం ఆయన్ను లైట్ తీసుకున్నారు. అదే దీక్షితుల్లో ఆరని హోమంలా మండించింది. మండిస్తూనే వుంది. ఇలా కటువైన మాటలను మాట్లాడిస్తూనే వుంది. దీనికంతటికి కారణం వైవీ సుబ్బారెడ్డే అన్నది దీక్షితుల ఆవేదన అట.
తనకు టీటీడీలో, స్వామివారి కైంకర్యాల విషయంలో ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడంలేదని రగిలిపోతున్న దీక్షితులు, ముఖ్యమంత్రిని కలుద్దామని ప్రయత్నించినా నెరవేరలేదట. టిటిడి వేగుల ద్వారా ఆ ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు గండి కొడుతూనే వస్తున్నారని ఆయన ఆగ్రహం. తాను పదవిలో ఉన్నానో లేదో చెప్పండి అంటూ ఈవోకు లేఖ రాసినా సమాధానం రాలేదట. దీంతో చిర్రెత్తుకొచ్చిన రమణ శివాలెత్తి ట్వీట్లు చేస్తున్నారు. అధికారుల తప్పులు లెక్కించే పనిలో ఉన్నారు.
ఎటు తిరిగి దీక్షితులు ట్వీట్లు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికే తగులుతున్నాయి. దీక్షితులు సుబ్బారెడ్డిని టార్గెట్ చేసుకుని, ఫిర్యాదులతో చెలరేగిపోతున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. దీంతో ప్రస్తుతం కొండపై సాగుతున్న సమరం, వైవీ సుబ్బారెడ్డి వర్సెస్ రమణదీక్షితులుగా ప్రొజెక్ట్ అవుతోంది.
మొత్తానికి ఉత్తరాఖండ్ తరహాలో టీటీడీని ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలంటూ మొన్నటి డిమాండ్, కొండపై కరోనా స్వైర విహారం చేస్తోందని, దర్శనాలు ఆపండి అంటూ తాజా ట్వీట్, రమణదీక్షితులు కావాలనే చేస్తున్నారని, గౌరవ ప్రధాన అర్చకుడిగా, వైవీ సుబ్బారెడ్డి తనకు ప్రాధాన్యత ఇవ్వడంలేదన్న ఆక్రోశమే, ఆయన మాటల వెనక వుందన్న మాటలు వినిపిస్తున్నాయి. చూడాలి, రమణదీక్షితుల ట్వీట్ల ఎఫెక్ట్ ఎలాంటి మలుపు తిరుగుతుందో ఇంకెన్ని రాజకీయ రగడలు రాజేస్తుందో.About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire