What is the problem in Anantapuram TDP : అనంత టీడీపీలో భగ్గుమన్న గొడవేంటి?
సీమలో తొడకొడితే బాలయ్యే కొట్టాలి మరొకరు కొడితే, ఆయనకు ఎక్కడో కాలుద్ది. బాలయ్య అంటే భయంలేదో, అసలు లెక్కేలేదో కానీ, ఇద్దరు నాయకులు సినిమా రేంజ్‌లో...
సీమలో తొడకొడితే బాలయ్యే కొట్టాలి మరొకరు కొడితే, ఆయనకు ఎక్కడో కాలుద్ది. బాలయ్య అంటే భయంలేదో, అసలు లెక్కేలేదో కానీ, ఇద్దరు నాయకులు సినిమా రేంజ్‌లో కొట్టుకుంటున్నారు. అది కూడా క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే తెలుగుదేశంలో. నీ పెటాపమో, నా పెటాపమో తేల్చుకుందాం రా అంటూ, సీమ సందుల్లో సీమ టపాకాయ్‌లా మాటల బాంబులు విసురుకుంటున్నారు ఇద్దరు నాయకులు. టీడీపీలో చంద్రబాబు కంటే తానే సీనియర్‌నని చెప్పుకునే ఒక లీడర్ సమరసింహారెడ్డిలా కత్తులు దూస్తుంటే, లేటుగా వచ్చినా, లేటెస్టుగా వచ్చానంటూ యంగ్ టైగర్‌లా మీసం తిప్పేస్తున్నారు మరో లీడర్. ఇంతకీ ఇద్దరి గొడవేంటి? కల్యాణదుర్గం టీడీపీలో ఈ కత్తుల రత్తయ్యల కథేంటి?
తెలుగుదేశం ఇప్పుడు అష్టకష్టాల్లో వుంది. అయినా మొక్కవోని ధైర్యంతో నేతలు, కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉద్యమించాలని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిస్తున్నా, కొందరు నేతలు కోల్డ్‌వార్‌నే కౌగిలించుకుంటున్నారు. వియ్యంతో ముందుకు సాగాలని అధ్యక్షుడు చెబుతుంటే, కయ్యమనేనంటూ, సొంత పార్టీ నేతలపై కత్తులు దూస్తున్నారు. అందుకు అనంతపురం జిల్లా టీడీపీలో సీనియర్ నాయకుల ప్రచ్చన్నయుద్ధమే నిదర్శనం.
హనుమంతరాయ చౌదరి...మాజీ ఎమ్మెల్యే కల్యాణదుర్గం. మాదినేని ఉమామహేశ్వర నాయుడు. 2019లో హనుమంతరాయను కాదని, చంద్రబాబు ఈయనకు టిక్కెటిచ్చారు. ఓడిపోయారు. కానీ ఇద్దరి మధ్య నాటి నుంచి నరసింహనాయుడు సినిమా లెవల్‌లో, పగలు సెగల రాజకీయాలు భగ్గుమంటూనే వున్నాయి. ఇప్పుడు మరోసారి ఇద్దరి నడుమ నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయి. ఇద్దరి మధ్య రగడ సమరసింహారెడ్డి సినిమాకు ఏమాత్రం తీసిపోదు. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్ సీన్ల నుంచి లేటెస్ట్ సన్నివేశాల వరకు కథను తిరిగేద్దాం.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. ముందు నుంచి టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతున్న కార్యకర్తలూ ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఉన్నం హనుమంతరాయ చౌదరి, సుదీర్ఘకాలం కళ్యాణదుర్గం కేంద్రంగా రాజకీయం నెరిపారు. 2000 సంవత్సరం నుంచి తొమ్మిదేళ్లపాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా కొనసాగారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, ఆయన కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువ కావడం, నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత మూటగట్టుకున్నారని, చంద్రబాబుకు రిపోర్ట్‌లు అందాయట. ఈ నేపథ్యంలోనే 2019 లో ఆపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా హనుమంతరాయ చౌదరిని కాదని, మాదినేని ఉమామహేశ్వర నాయుడుకి పార్టీ టికెట్టు ఇచ్చింది. అక్కడే ఇరువరి నడుమ ఫ్యాక్షన్ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ కొట్టింది.
అప్పటి వరకూ పార్టీకి నియోజకవర్గంలో అన్నీ తానై వ్యవహరించిన ఉన్నం, అధిష్టానంతో విబేధించారు. ఆ సమయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా ఆయనతో మాట్లాడారు. ఎన్నికల అనంతరం జిల్లా అధ్యక్ష పదవితో పాటు కీలకమైన పదవి కట్టబెడతామని హామీ ఇచ్చారు. అయినా శాంతించని హనుమంతరాయ, ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా పని చేయలేదన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నిలబడిన ఉమ ఓడిపోవడం, ఇందుకు బలాన్నిచ్చింది. అలా ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ కల్యాణదుర్గంలో టీడీపీ కొంపముంచిందన్న ప్రచారం సాగింది.
ఎన్నికలు అయిపోయినా, దారుణంగా ఓడిపోయినా, ప్రస్తుతం పార్టీ క్లిష్టపరిస్థితుల్లో వున్నా, వీరిద్దరి మధ్య ప్రచ్చన్నయుద్ధానికి మాత్రం శుభంకార్డు పడలేదు. మరిన్ని కొత్త రూపాల్లో తగువులుపడ్డం మొదలుపెట్టారట. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఉమామహేశ్వర నాయుడు నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. పార్టీ ఏ పిలుపు ఇచ్చినా నియోజకవర్గంలో దూకుడుగా నిరసనలు చేస్తున్నారు. అయితే, ఆందోళనల పోటీల్లోనూ హనుమంతరాయచౌదరి ఎంట్రీ ఇచ్చారు. కొద్దిరోజులుగా ఉమా ఏ కార్యక్రమం తలపెట్టినా అందుకు పోటీగా చౌదరి వర్గం అదే కార్యక్రమం నిర్వహిస్తోంది. మీరేకాదు, తామూ టీడీపీలో వున్నామంటూ, నిరసనలకు దిగుతున్నారు. ఇద్దరు నేతల పోటాపోటీతో కార్యకర్తలు తలపట్టుకుంటున్నారు. ఎవరి ఆందోళనల్లో పాల్గొనాలో అర్థంకాక కన్‌ఫ్యూజ్ అవుతున్నారు.
ఎన్నికల్లో కావాలనే ఓడించారని అప్పట్లో వైఎస్‌ఆర్ సీపీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపిస్తూ ఉమామహేశ్వరనాయుడు వర్గం చౌదరివర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. స్థానిక ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ తో కలిసి ఇప్పటికీ పలు కాంట్రాక్టు పనులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి గురించి అధిష్టానం చూసుకుంటుందని.. నియోజకవర్గంలో తన పనితాను చేసుకుపోతాని చెబుతున్న ఉమా, తన సొంత క్యా,డర్ ను అభివృద్ధి చేసుకునే పనిలో పడ్డారట. అటు ఎలాగైనా నియోజకవర్గంలో ఉమాకు చెక్ పెట్టాలని పోయిన పట్టు నిలుపుకోవాలని హనుమంతరాయ చౌదరి సైతం పావులు కదపడం మొదలెట్టారట. జిల్లా నేతలు కాల్వ శ్రీనివాసులు, పార్థసారథి వంటి నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నాని ప్రచారం నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సహా ఇతరనేతలను కలిసి, తన పరిస్థితిని వివరించిన చౌదరి, పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించాలని, అందుకు జిల్లా నేతలు మద్దతు పలకాలని కోరుతున్నట్లు సమాచారం. గతంలో అధిష్టానం చెప్పిన విధంగా పార్టీఅధ్యక్ష పదవి కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
పార్టీలో తాను చంద్రబాబు కన్నా సీనియర్ అని చెప్పుకుంటున్న హనుమంతరాయచౌదరికి, పార్టీ ఎలాంటి పదవి ఇవ్వకపోవడంపై ఆయన వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. హనుమంతరాయ చౌదరి తనయుడు మారుతి చౌదరి, తనవర్గానికి మద్దతుగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారట. మరి హనుమంతరాయ తన ఉనికి కోసం ఆరాటపడుతున్నారా లేదంటే, కొడుకు మారుతికోసం బాట సిద్దం చేస్తున్నారా అని, తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారట.
హనుమంతరాయ చౌదరి, ఉమా గొడవల నేపథ్యంలో, మరోసారి అనంతపురం టీడీపీలో వర్గాల గొడవ రచ్చకెక్కింది. హనుమంతకు కాల్వ శ్రీనివాసులు, పార్థసారథి, ప్రభాకర్ చౌదరి వంటి నేతలు మద్దతు పలుకుతుంటే, అటు జేసీ కుటుంబంతో పాటు సీనియర్ నేత పయ్యావుల కేశవ్ వంటి నాయకులు, ఉమా మహేశ్వర నాయుడికి సపోర్ట్ చేస్తున్నారట. ముందు నుంచి పయ్యావుల కేశవ్ వర్గంగా ముద్రపడిన ఉమామహేశ్వరనాయుడికి, గత ఎన్నికల్లో పట్టుపట్టి జేసీ దివాకర్ రెడ్డి టికెట్టు ఇప్పించారు. తనకు టికెట్ రాకుండా అడ్డుపడింది పయ్యావుల కేశవ్, జేసీనేనని రగిలిపోతున్నారు హనుమంతరాయ చౌదరి. అందుకే ఉమాతో సై అంటే సై అంటున్నారు కల్యాణదుర్గంలో.
కొంత కాలంగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న అధిష్టానం, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గంలో ఇద్దరు నేతలు ఎవరికి వారు పోటాపోటీ నిరసనలు చేస్తుండటం, భవిష్యత్తులో పార్టీకి మంచిది కాదని, ముఖ్యంగా నియోజకవర్గంలో క్యాడర్‌కు ఇబ్బందిగా మారిందని స్థానికులు చెబుతున్నారు. రెండు కత్తులు ఒకే ఓరలో ఇమడవన్న సామెతలాగా, రానురాను ఇద్దరు నేతల దారి ఏంటన్నది ఎవ్వరికీ బోధపడ్డం లేదు. ఉమా మహేశ్వర నాయుడు తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి, మరో పార్టీలోకి వెళతారని, హనుమంతరాయ చౌదరి వర్గం ప్రచారం చేస్తుంటే, హనుమంతనే సైకిల్ దిగుతారని ఉమా బ్యాచ్ అంటోంది. ఎవరు పార్టీ మారుతారో, ఎవరు అలాగే వుంటారో తెలీదు గానీ, ఉన్న పార్టీని మాత్రం నానా రకాలుగా రావణకాష్టం చేస్తున్నారని, కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఇద్దరూ కాకుండా మరో నాయకుడికి కల్యాణదుర్గం బాధ్యతలు అప్పగిస్తేనే, పార్టీ నిలబడుతుందని సీనియర్ నాయకులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారట. మొత్తానికి పసుపుదండుకు కంచుకోటగా భావించే కల్యాణదుర్గాన్ని చంద్రబాబు రిపేర్ చేస్తారో, ఇలాగే వదిలేస్తారోనని, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire