పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు ఏంటి... ఆ నేరానికి శిక్ష ఏంటి?

What is the Case Against Pinnelli Ramakrishna Reddy What Punishment for That Crime
x

పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు ఏంటి... ఆ నేరానికి శిక్ష ఏంటి?

Highlights

Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిలీఫ్ లభించింది.

Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిలీఫ్ లభించింది. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ ఏడాది జూన్ 6 వరకు అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశించింది.

మే 13న పోలింగ్ సందర్భంగా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఈ విషయమై మే 20న రెంటచింతల పోలీస్ స్టేషన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ, పీడీపీపీ, ఆర్పీ చట్టాల్లోని 10 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మే 13న పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్ల ధ్వంసం జరిగితే మే 15న వీఆర్ఓ జానయ్య గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు, వీవీప్యాట్లు ధ్వంసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం,వీవీప్యాట్లను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. అప్పుడు ఈసీ రంగంలోకి దిగింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో ఏ1గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దరిమిలా ప్రత్యేక పోలీస్ బృందాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గన్ మెన్లు, కారు ను పోలీసులు సీజ్ చేశారు. కానీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం పోలీసులకు చిక్కలేదు.

పిన్నెల్లి రాజకీయ చరిత్ర

మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని గత 20 ఏళ్లుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శాసిస్తున్నారు.2009, 2012, 2014, 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి ఆయన విజయం సాధించారు. ఐదోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి కారణంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు.ఆ తర్వాత 2012లో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. అప్పటి నుండి ఆ పార్టీలోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అత్యంత సన్నిహితుడనే పేరుంది. సామాజిక సమీకరణాలతో పిన్నెల్లికి జగన్ కేబినెట్ లో బెర్త్ దక్కలేదు. కానీ, ఆయనకు ప్రభుత్వ విప్ పదవి లభించింది. 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఈ నియోజకవర్గంలో విపక్ష పార్టీలు ప్రధానంగా టీడీపీకి చెందిన శ్రేణులు గ్రామాలు వదిలి వెళ్లాయి. ఇందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డే కారణమని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది.మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్ధులే ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల బెదిరింపులతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులు నామినేషన్లు కూడా దాఖలు చేయలేదని అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఎలాంటి శిక్షలు?

మే 13న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయి.ఇందులో ఏడు పోలింగ్ కేంద్రాలు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోనివే.మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్లను ధ్వంసం చేసినట్టుగా వీడియోలు తొలుత సోషల్ మీడియాలో వెలుగు చూసిన తర్వాతే పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఐపీసీ, పీడీపీపీ, ఆర్పీ చట్టాల్లోని 10 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

సెక్షన్ 143: చట్ట విరుద్దంగా గుమికూడడం .. ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా.. లేదా జైలు, జరిమానా

సెక్షన్ 147: అల్లర్లకు పాల్పడితే రెండేళ్ల వరకు జైలు శిక్ష.. లేదా జరిమానా.. జైలు, జరిమానా

సెక్షన్ 448: ఇల్లు, కార్యాలయంలోకి అక్రమ చొరబాటు.. ఏడాది వరకు జైలు శిక్ష లేదా జరిమానా..

సెక్షన్ 427: విలువైన వస్తువును ధ్వంసం చేయడం.. రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా,

సెక్షన్ 353: ప్రభుత్వ ఉద్యోగి విధులను అడ్డుకోవడం... భయపెట్టడం.. దాడి, దౌర్జన్యానికి పాల్పడడం.. రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా..

సెక్షన్ 452: విధులకు అవరోధం కలిగించారని... గాయపర్చాలనే ఉద్దేశ్యంతో దౌర్జన్యంగా ఇల్లు... కార్యాలయంలో అక్రమ చొరబాటు,.. ఏడేళ్ల వరక జైలు శిక్ష, జరిమానా

సెక్షన్ 120 బి: నేరపూర్వక కుట్రకు పాల్పడడం... ప్రధాన నిందితుడికి పడిన శిక్షతో సమానంగా నేర ఘటనలో వారికి అదే శిక్ష పడుతుంది.

పిన్నెల్లి వీడియో బయటకు ఎలా వచ్చింది?

ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. మాచర్ల లాంటి సమస్యాత్మక నియోజకవర్గాల్లో వెబ్ క్యాస్టింగ్ పై అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్టుగా పోలింగ్ కు ముందే ప్రకటించారు. పోలింగ్ రోజున ఈవీఎం, వీవీప్యాట్లను ఎమ్మెల్యే ధ్వంసం చేసిన విషయమై రెండు రోజుల వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజల తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు, వీవీప్యాట్లను ధ్వంసం చేసినట్టుగా వీఆర్ఓ జానయ్య ఫిర్యాదు చేశారు. కానీ, పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో వీడియో బయటకు రావడంతో ఈసీ రంగంలోకి దిగింది.అప్పుడు ఈసీ ఆదేశాల మేరకు రెంటచింతల పోలీస్ స్టేషన్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఏ1 గా కేసు నమోదైంది.అంతా బాగానే ఉంది...కానీ, ఈ వీడియో బయటకు ఎలా వచ్చిందనే విషయమై ప్రస్తుతం అంతుబట్టడం లేదు. ఈ వీడియోను తాము విడుదల చేయలేదని ఆంధ‌్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. కానీ ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందనేది ప్రస్తుతం చర్చ సాగుతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు.ఈ వీడియో బయటకు ఎలా వచ్చిందో విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ కోరుతుంది.

మిగిలిన వీడియోలు కూడా విడుదల చేయాలి: వైఎస్ఆర్సీపీ

మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్లను ధ్వంసం చేసిన వీడియోపై విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని వైఎస్ఆర్సీపీ మండిపడుతుంది.అంతకుముందు ఆ గ్రామంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. మిగిలిన 9 వీడియోలను కూడా విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ నేత నర్సరావుపేట ఎంపీ అభ్యర్ధి అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ నియోజకవర్గంలో తమ పార్టీ శ్రేణులపై టీడీపీ దాడులకు దిగిందని ఆరోపించారు. పోలింగ్ కు ముందు తమకు అనుకూలంగా ఉండే అధికారులను ఈ నియోజకవర్గానికి బదిలీ చేయించారని టీడీపీపై వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేసింది.

పిన్నెల్లి సోదరుల కోసం కొనసాగుతున్న గాలింపు

పాల్వాయిగేట్ ఘటనపై పోలీస్ కేసు నమోదైన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రాంరెడ్డిలు పారిపోయారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణలో ప్రవేశించారని పోలీసులు అనుమానించారు. తెలంగాణ పోలీసుల సహయంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులను పట్టుకొనేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు సహా ఎనిమిది పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలోని ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్లలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల కోసం పోలీసులు గాలించారు.సంగారెడ్డి జిల్లాలోని కంది సమీపంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉపయోగించిన కారు, సెల్ ఫోన్ సీజ్ చేశారు. కానీ, పిన్నెల్లి సోదరులు మాత్రం పోలీసులకు చిక్కలేదు.

జూన్ 6వరకు అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది.జూన్ 6న ఏపీ హైకోర్టులో ఈ విషయమై విచారణ జరగనుంది.ఆ రోజున ఉన్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలపై ఏపీ రాజకీయవర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories