ఆయన విమర్శలు వింటుంటే, ఆయన ఏ పార్టీలో వున్నారో, సొంత పార్టీ వారికే అర్థంకాదు. ఆయన కలుస్తున్న వ్యక్తులను చూస్తుంటే, ఆయన ఏ పక్షమో, విపక్షానీకీ బోధపడదు....
ఆయన విమర్శలు వింటుంటే, ఆయన ఏ పార్టీలో వున్నారో, సొంత పార్టీ వారికే అర్థంకాదు. ఆయన కలుస్తున్న వ్యక్తులను చూస్తుంటే, ఆయన ఏ పక్షమో, విపక్షానీకీ బోధపడదు. ఆయన విందు రాజకీయాల టేస్ట్ చేస్తుంటే, ఓన్ పార్టీ లీడర్లకు గొంతులో పచ్చి వెళక్కాయపడినట్టు వుంటుంది. నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా, సొంత పార్టీ విధానాలు, సొంత ప్రభుత్వ పాలసీలను ఎండగట్టేస్తారు. ఇంతకీ ఆయన ధైర్యమేంటి? ఆ తెగింపు వెనక బలమేంటి? ఈయన ఇన్ని చేస్తున్నా పార్టీ పల్లెత్తు మాటా ఎందుకు అనడం లేదు?
రఘురామ కృష్ణంరాజు. నరసాపురం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీ. స్టేట్‌లో ఏ పార్టీలో వున్నా సెంట్రల్‌లో పవర్ సెంటరే ఆయనపక్షమంటారు. సొంత పార్టీపై విమర్శలకు ఏమాత్రం వెనకాడరు. ఇసుక విధానంపై విమర్శలు చేసి వైసీపీలోనే దుమారం రేపారు. ఇంగ్లీష్ మీడియంపై అధికార పార్టీని ఇరుకునపెట్టారు. టీటీడీ ఆస్తుల అమ్మకం ఆలోచనను నిర్మోహమాటంగా విమర్శించారు. నిమ్మగడ్డ వ్యవహారంపై నిస్సంకోచంగా ఆరోపణాస్త్రాలు సంధించారు. జగన్ సర్కారుపై నిరంతర విమర్శలతో సొంత పార్టీలోనే తుపాను సృష్టించారు. రఘురామ కృష్ణంరాజులో ఈ తెగింపు వెనక ధైర్యమేంటి?
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ వైసీపీ ఎంపీ రఘరామకృష్ణంరాజు.. ఈయన పేరు వినగానే పందెం రాయుళ్లు చప్పట్లు కొడతారు. రాజకీయ పార్టీలు ఎదురుచూపులు చూస్తాయి ఎప్పుడు వస్తారా అని. భీమవరంలో ప్రతీ సంక్రాంతికి కోడికి కత్తి కట్టాలంటే భయపడే పందెం రాయుళ్లు రఘరామకృష్ణం రాజు కోడిని బరిలోకి వదిలిన తరువాత రెచ్చిపోతారు. ఎందుకంటే పందెం రాయుళ్లకు మద్దతుగా ఏళ్లతరబడి కోర్టు తలుపుతడుతున్న ఏకైక వ్యక్తి రఘరామకృష్ణంరాజు. సంప్రదాయాలపైనే కాదు, రాజకీయాలపై మక్కువ ఎక్కువ ఉన్న రఘురామకృష్ణం రాజు, 2014కు ముందు అంతగా ఎవరికీ పరిచయంలేని పెద్ద వ్యాపారవేత్త. ఎప్పుడైతే 2014లో రాజకీయల్లోకి ఎంట్రీ ఇచ్చారో, ఆ రోజు నుంచి ఆయన చుట్టూ రాజకీయాలు తిరగడం మొదలుపెట్టాయి. కాంగ్రెస్ సీనియర్ నేత కేవిపికి స్వయానా వియ్యంకుడైన రఘరామకృష్ణం రాజుకు, అటు బిజెపి, ఇటు కాంగ్రెస్, టిడిపి, వైసిపి పార్టీ ఏదైనా అన్ని పార్టీలతో నేటికీ సత్సంబంధాలు ఆయన స్పెషాల్టిటి.
2014లో మొదటిసారి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వైసీపీ ఎంపీ రఘరామకృష్ణం రాజు. అప్పట్లో నరసాపురం ఎంపీ సీటు ఆశించారు. కానీ అనుకోని పరిణామాల నేపథ్యంలో ఎంపీ సీటు దక్కలేదు. ఆ తరువాత పార్టీలో జగన్ వ్యవహార శైలి నచ్చలేదంటూ మీడియా సమావేశం పెట్టి మరీ బిజెపిలో చేరిపోయారు. 2014 నుంచి 2018 వరకూ బిజెపిలో కొనసాగుతూ వచ్చారు. 2018లో బిజెపి నుంచి టిడిపికి జంప్ కొట్టారు. తిరిగి 2019 ఎన్నికల ముందు అనూహ్యంగా వైసిపి తీర్ధం పుచ్చుకుని నరసాపురం వైసిపి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసి, జగన్ ఊపులో విజయం సాధించారు. భూమి గుండ్రంగా ఉంటుంది అన్నట్లుగా 2014లో వైసిపిలో మొదలైన ఈ ఎంపీగారి జర్నీ తిరిగి 2019నాటికి అదే గూటికే చేరింది.
రఘురామ ఏపార్టీ మారినా, కండువాలు మార్చినా ఆయన లక్ష్యం మాత్రం ఎంపీ పదవి. ఎంపీగా గెలవాలి, ప్రజాసేవ చేయాలని బాహటంగా చెప్పే రఘరామకృష్ణం రాజు...అనుకున్నట్లుగానే 2019లో వైసిపి ఎంపీగా నెగ్గారు. ఎంపీ పదవి దక్కినా ఆయన దూకుడు, ఇప్పడు అనుసరిస్తున్న వ్యూహాలు వైసిపి అభిమానులనే కాదు పార్టీ కేడర్‌ను అయోమయంలో పడేస్తున్నాయి. వైసిపి ఎంపీగా ఉండి.. వైసిపి ప్రభుత్వం చేపడుతున్న విధానాలను నచ్చకపోతే బహిరంగంగా విమర్మిస్తూ మరోసారి అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. ఒకటి కాదు, రెండు కాదు...ఏడాది కాలంగా ప్రభుత్వ విధానాలను, లోపాలను వేలెత్తిచూపడం ఈయనకు కొత్తేంకాదు. ఇసుక విధానంపై మీడియా సాక్షిగా బహిరంగంగానే వ్యతిరేకించారు. తాను ఎంపీగా ఉండి, తెలిసిన వ్యక్తికి ఒక్కలారి ఇసుక కూడా ఇప్పించలేకపోయానని ఆవేదన వక్తం చేశారు. ఇసుక విధానం లోపభూయిస్టంగా ఉందని సొంత ప్రభుత్వాన్నే బోనులో నిలబెట్టారు. టిటిడి ఆస్తుల అమ్మకంపైనా నిర్మోహమాటంగా ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ఇంగ్లీష్ మీడియం విషయంలోనూ వెనక్కు తగ్గలేదు. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు భాషను కాపాడుకోవాల్సిందేనంటూ గొంతెత్తారు. ఎన్నికల కమిషనర్ విషయంలోనూ హైకోర్టు తీర్పును ఏపి సవాలు చేయడం కూడా తనకు నచ్చలేదని తేల్చిచెప్పారు. తాజాగా పేదలకు ఇళ్ల స్దలాల విషయంలో సొంత పార్టీ స్థానిక నేతలే పేదల వద్ద డబ్బు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఒకటేమిటి వైసిపి నరసాపురం ఎంపీ రఘరామకృష్ణం రాజు తీరు సొంత పార్టీ నేతలకే మింగుడు పడటంలేదు.
తాను అధికార పార్టీ ఎంపీగా ఉండీ ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే బహిరంగంగా చురకలేస్తున్నారేంటి పార్టీ వేదికపై మాట్లాకుండా, నలుగురిలో గొంతెత్తడమేంటి ఈ ఎంపీ వ్యూహమేంటి ధైర్యమేంటి ఇదే సర్వత్రా ఆశక్తి రేపుతోంది.
అయితే రఘురామకృష్ణంరాజు 2014కు ముందు వరకూ రాజకీయంగా ఏమాత్రం అనుభం లేకున్నా, ఆ తరువాత కేవిపి అండదండలు పుష్కలంగానే ఉన్నాయనడంలో సందేహంలేదు. వియ్యంకుడైన కేవిపి, కేంద్రంలో రఘరామకృష్ణంరాజు బలపడటానికి వ్యూహకర్తగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వైసిపి, బిజెపి, టిడిపి...తిరిగి మళ్లీ వైసిపి ఎంపీ ఇలా ఎన్ని పార్టీలు మారినా బిజెపి అధిష్టానం దృష్టిలో రఘరామకృష్ణంరాజుకు మంచి మార్కులే ఉన్నాయి. మోడీ సైతం ఈయనను గుర్తుపెట్టుకుని మరీ పిలుస్తారట. ఈ సంత్సంబంధాల వల్లే సబార్డినేట్ కమిటీ చైర్మెన్‌గా రఘరామకృష్ణంరాజు నిమాయకం జరిగింది. సహజంగా సొంత పార్టీ వ్యక్తులకే ఇచ్చే ఈ పదవిని నిబందనలు ప్రక్కనపెట్టి మరీ వైసిపి ఎంపీగా ఉన్న రఘరామకృష్ణంరాజకు బీజేపీ కట్టబెట్టిందంటే కేంద్రంలో ఈయన మార్క్ ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవచ్చు. నిరంతరం ఢిల్లీలో విందులతో అధికార, విపక్ష పార్టీల కీలక నేతలను ఏక కాలంలో ఒకే వేదికపైకి తేవడంలో దిట్ట రఘురామ కృష్ణంరాజు. తమ ప్రమేయం లేకుండానే రఘరామకృష్ణం రాజుకు పదవి దక్కడంపై వైసిపి గుర్రుగానే ఉన్నా, ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం కాబట్టి, సైలెంట్‌గా వుండాల్సి వచ్చిందట వైసీపీకి.
ఇలా ప్రస్తుతం ఆయన వైసిపిలో కొనసాగుతున్నా.. ఎంపీగా ఉన్నా... బిజెపితో ఉన్న సత్సంబంధాలే రఘురామ ధైర్యంగా కొందరు చెబుతున్నారు. కేంద్రంలో వున్న పార్టీ అండదండలున్నందుకే, సొంత పార్టీపైనే విమర్శలు చేసే తెగింపు. రఘురామ నిరంతర వ్యాఖ్యానాలతో వైసీపీనే సైలెంట్ అయ్యింది. పార్టీ ఎంపీ అయినప్పటికీ, పార్టీ కార్యక్రమాలకు దాదాపు దూరం పెట్టిందన్న చర్చ జరుగుతోంది. నరసాపురంలో గోకరాజు గంగరాజును పార్టీలోకి చేర్చుకుని, రఘురామను ఝలక్ ఇద్దామనుకుంది. దీంతో సొంత పార్టీ ఎలాగూ పక్కన పెట్టాలనుకుంటోంది కాబట్టి, మరింత కొరకరాని కొయ్యగా ఉండటమే బెటర్ అనే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తున్నారు రఘురామ. వైసీపీ అధిష్టానం రివర్స్ గేర్ వేస్తే.. పాతపార్టీ బీజేపీకి కొత్త రూటు ఉండనే ఉందనేది రఘరామకృష్ణం రాజు ధైర్యమట. ఇలా కండువా ఏదైనా, తన దారి తనదే అన్నట్టుగా దూసుకుపోతానంటున్నారు వైసిపి ఎంపీ రఘరామకృష్ణం రాజు. చూడాలి, వైసీపీతో కోల్డ్‌వార్ సాగిస్తున్నట్టు కనపడ్తున్న రఘురామ కృష్ణం రాజు, తిరిగి పార్టీకి విధేయంగానే వుంటానంటారో, లేదంటే విధానాలపై నిరంతరం విమర్శనాస్త్రాలు సంధిస్తూనే వుంటారో చివరికి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire