Kurupam : మామ-కోడలి మౌనానికి కారణం?

Kurupam : మామ-కోడలి మౌనానికి కారణం?
x
Highlights

కోడలిపై అదేపనిగా చెలరేగిపోయిన మామ, ఇప్పుడెందుకో సైలెంట్‌ మోడ్‌లోకి మారిపోయారు. మంత్రిగా కోడలు ఎంతో ఉన్నతస్థానంలో వున్నారని, ఏమాత్రం లెక్క చేయని మామ, ఓ...

కోడలిపై అదేపనిగా చెలరేగిపోయిన మామ, ఇప్పుడెందుకో సైలెంట్‌ మోడ్‌లోకి మారిపోయారు. మంత్రిగా కోడలు ఎంతో ఉన్నతస్థానంలో వున్నారని, ఏమాత్రం లెక్క చేయని మామ, ఓ రేంజ్‌లో విమర్శలు చేసి, ఇప్పుడెందుకో మౌనవ్రతంలోకి జారుకున్నారు. ఇంతకీ కోడలిపై యుద్ధం ప్రకటించిన మామ, ఇప్పుడెందుకు కామ్‌ అయ్యారు? మామను ఒక్క మాటా అనని కోడలు, చాకచక్యంగా మామ నోటికి తాళం వేశారా? మామ-కోడలి మధ్య సంధి కుదిరిందా? సమరానికి ఈ విరామం సన్నాహమా?

మంత్రి పుష్పశ్రీవాణిపై అంతగా మండిపడ్డ మామ మౌనానికి కారణమేంటి? కోడలు-మామ మధ్య సంధి కుదిరిందా? లేక కోడలతో పోరెందుకని మావయ్య సైలెంటయ్యారా? విమర్శలకు కౌంటర్ కూడా ఇవ్వని మంత్రి మామగారి నోటికి ఎలా తాళం వేశారు? మామ-కోడలు సమరం సుఖాంతమైందా? యుద్ధానికి మధ్య విరామమేనా?

విజయనగరం జిల్లాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్‌ అంతటా కొన్నిరోజుల క్రితం సంచలనం సృష్టించింది మామ కోడలు యుద్ధం. కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై, సొంత మామయ్య శత్రుచర్ల చంద్రశేఖరరాజు తీవ్రమైన ఆరోపణలు చేసి, కలకలానికి కారణమయ్యారు. స్వంత నియోజకవర్గంలో కనీసం అభివృద్దికి పుష్పశ్రీవాణి పాటుపడటం లేదని విమర్శించారు. ఎన్నో వాగ్దానాలు చేసి, అవన్నీ తుంగలో తొక్కారని మండిపడ్డారు.

అయితే స్వంత మామయ్యే అటువంటి విమర్శలు చెయ్యడంతో ఏం చెయ్యాలో అర్థంకాని స్థితిలో మౌనంగా ఉండిపోయారు డిప్యూటి సీఎం పుష్పశ్రీవాణి. మావయ్య మాటలకు కనీసం సమాధానంగా స్పందించనూ లేదు. దీంతో మామ కోడళ్ళ మధ్య పోరు మొదలైందని, అది చినికి చినికి గాలివానలా మారుతుందని ప్రతిపక్ష నాయుకులు భావించారు. డిప్యూటి సిఎంకు ఇంటిపోరు తప్పదని అంతా అనుకున్నారు. చంద్రశేఖర్‌ రాజు కొడుకు, పుష్పశ్రీవాణి భర్త ప్రెస్‌మీట్‌ పెట్టినా, మామ కోడళ్ల గొడవపై పెద్దగా రియాక్ట్‌ కాలేదు. పుష్పశ్రీవాణి నేరుగా మామకు బదులివ్వకపోయినా, తన చేతలతో ఆయన నోరు మూయించారన్న చర్చ జరుగుతోంది.

తన మావయ్య శత్రుచర్ల చంద్రశేఖరరాజు చేసిన విమర్శలకు స్పందించని పుష్పశ్రీవాణి, తనదైన శైలిలో ఆన్సరిచ్చారన్న డిస్కషన్ సాగుతోంది. మామ మాటలను సీరియస్ గా తీసుకున్న పుష్పశ్రీవాణి, కొన్ని రోజుల్లోనే, తన నియోజకవర్గంలోని ప్రధాన సమస్యగా ఉన్న నేరడివలస నుంచి టిక్కబాయి గ్రామాల మధ్య రోడ్డును ప్రారంభించి, అటు మావయ్య ఇటు ప్రతిపక్ష నాయకుల నోళ్లూ మూయించారన్న మాటలు వినపడ్తున్నాయి.

కురుపాం నియోజకవర్గంలో అభివృద్ది చెయ్యలేదని ఘటుగా విమర్శించిన, శత్రుచర్ల చంద్రశేఖరరాజు, ఆ తరువాత కాలంలో ఏనాడూ ప్రెస్ ముందుకు రాలేదు. దీంతో ఆయన మౌనానికి కారణమేంటన్న చర్చ జరిగింది. మామ కోడళ్ళు ఇద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతుండగా, తనకు గుర్తింపు లభించడంలేదని, అంతా తన కోడలి పేరే వినిపిస్తోందని రగిలిపోయారట మామ చంద్రశేఖర్. జిల్లాలోనూ, కురుపాం నియోజకవర్గంలోనూ ఎవ్వరూ తనను గుర్తించడం లేదని ఫీలవుతున్నారట. అందుకే కోడలు పుష్పశ్రీవాణిపై అక్కసు వెళ్లగక్కారని టాక్.

అయితే మామ కోడళ్ళ మధ్య నెలకొన్న వివాదం మరింత రాజుకోకముందే, జిల్లాకే చెందిన వైయస్సార్ పార్టీ ముఖ్య నాయుకుడు ఒకరు, రంగంలోకి దిగి చంద్రశేఖరరాజును బుజ్జగించారని తెలుస్తోంది. ఆ సమయంలో కూడా ఆ నేతతో చంద్రశేఖరరాజు తనకు నియోజకవర్గంలో గుర్తింపులేదని ఆవేదన వ్యక్తం చేశారట. అంతేకాక తన కుమార్తెకు సైతం పార్టీలో తగిన గౌరవం లభించడం లేదన్నారట. మధ్యవర్తిత్వం చేసిన నేత అందుకు తగిన హామీ ఇచ్చారని, అందుకే మామగారు మౌనవ్రతం చేస్తున్నారని తెలుస్తోంది.

శత్రుచర్ల చంద్రశేఖరరాజు, వైఎస్ రాజశేఖరరెడ్డి టైంలో కాంగ్రెస్ అభ్యర్థిగా నాగూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైస్‌ఆర్‌ హయాంలో జిల్లాలో కీలకంగా వ్యవహరించిన నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాలతో, కొన్నేళ్లు రాజకీయాలకు దూరంగా ఉండి, 2017 సంవత్సరంలో తెలుగుదేశంలో చేరి క్రియాశీలకంగా పనిచేసారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి తన కుమార్తెకు టిక్కెట్టు ఆశించారు. కానీ నిరాశ తప్పలేదు. దీంతో 2019 ఎన్నికల ముందు వైసిపి తీర్దం పుచ్చుకుని కోడలు పుష్పశ్రీవాణి గెలుపుకు సహకరించారు. అయితే కోడలి పాలన ఏడాది దాటినా నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం చెందారంటూ విమర్శించి, కుటుంబంలోనే కాదు, పార్టీలోనూ రగడ రాజేశారు. మామ కోడళ్ల వార్‌ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిందని అధిష్టాన నేతలు సైతం రగిలిపోయారు. ఈ నేపథ్యంలో పుష్పశ్రీవాణి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మామ విమర్శలపై వివరణో, కౌంటరో ఇస్తారని, అంతా అనుకున్నారు. కానీ మీడియా మీట్‌లో ఆమె భర్త పరిక్షిత్ రాజు ప్రత్యక్షమై, నాన్న మాటలను పట్టించుకోనవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్‌ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న పుష్పశ్రీవాణిని, స్వయంగా మామ చంద్రశేఖర్‌ రాజు చేసిన విమర్శలపై అందరూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. తెలుగుదేశానికి దగ్గరయ్యేందుకే చంద్రశేఖర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? కూతురికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామివచ్చిందా? కోడలు వున్న పార్టీలోనే వుంటే కూతురికి రాజకీయ భవిష్యత్ వుండదని భావిస్తున్నారా? ఇవన్నీ కాక, కుటుంబ గొడవలే మామతో ఇలాంటి వ్యాఖ్యలు చేయించాయా అన్న కారణాలపై ఎవరికి తోచినవిధంగా వాళ్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడు కూడా తనను శాంతింపజేయడానికి వచ్చిన వైసీపీ కీలక నాయకులతో, ఇవే చర్చించారట. తనకు, తన కూతురికి పార్టీలో తగిన గుర్తింపు కావాలని డిమాండ్ చేశారట. అందుకు పార్టీ పెద్దలు హామి ఇవ్వడంతో కూలయ్యారట చంద్రశేఖర్‌ రాజు. ఇదీ మామ కోడలి మధ్య ముగిసినట్టు కనిపిస్తున్న యుద్ధం. అయితే, ఈ మౌనం ఎంతవరకు, తనకు లభించిన హామీ నెరవేరకపోతే, మామగారు మళ్లీ ఫైర్‌ అవుతారా అన్న అనుమానాలు కూడా పుష్పశ్రీవాణి అనుచరుల్లో కలుగుతున్నాయట. చూడాలి, రానున్న కాలంలో ఏమవుతుందో.



Show Full Article
Print Article
Next Story
More Stories