పయ్యావుల ఇలాకాలో పంచాయతీ రగడ.. పయ్యావుల పొలిటికల్‌ ఫ్యూచర్‌‌‌కు దీనికి సంబంధమేంటి?

పయ్యావుల ఇలాకాలో పంచాయతీ రగడ.. పయ్యావుల పొలిటికల్‌ ఫ్యూచర్‌‌‌కు దీనికి సంబంధమేంటి?
x
Highlights

కౌకుంట్ల గ్రామం, సంగ్రామాన్ని తలపిస్తోంది. ఒకవైపు గ్రామస్థులు, మరోవైపు పోలీసులు, అధికారులు. పంచాయతీ విభజనపై రచ్చ. పయ్యావుల రాజకీయ భవిష్యత్తును...

కౌకుంట్ల గ్రామం, సంగ్రామాన్ని తలపిస్తోంది. ఒకవైపు గ్రామస్థులు, మరోవైపు పోలీసులు, అధికారులు. పంచాయతీ విభజనపై రచ్చ. పయ్యావుల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేందుకే, వైసీపీ నాటకమాడుతోందని టీడీపీ వర్గం ఆరోపిస్తోంది. ఇంతకీ పంచాయతీ విభజనకు, పయ్యావుల పొలిటికల్ ఫ్యూచర్‌కు సంబంధమేంటి? పంచాతీయ విభజన నిజంగా, పయ్యావుల వర్గంలో అలజడి రేపుతోందా?

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గలోని కౌకుంట్ల అనే గ్రామం, ఇప్పుడు సంగ్రామంగా మారింది. భారీ సంఖ్యలో జనాల ఆందోళన, అటు అధిక సంఖ్యలో పోలీసులు, అధికారుల మోహరింపు. దీంతో కౌకుంట్ల నిత్యం ఉద్రిక్తగా కనిపిస్తోంది. ఇంతకీ కౌకుంట్ల వివాదమేంటి?

ఉరవకొండ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే, ఆ పార్టీ అధికారంలోకి రాదు. దశాబ్దాలుగా ఇదే సెంటిమెంట్‌ రిపీటవుతోంది. 2014లో వైసీపీ నుంచి విశ్వేశ్వర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. అలాగే, 2019లో టీడీపీ నుంచి సీనియర్ నేత పయ్యావుల కేశవ్ గెలుపొందారు. కానీ స్టేట్‌‌ పీఠంపై వైసీపీ గెలిచింది. ఇలా, ఉరవకొండలో ప్రతీసారీ సెంటిమెంట్‌ నడుస్తోంది. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో గట్టెక్కుతారు. అధికార పార్టీకి ఎప్పుడూ అక్కడ ఓటర్లు పట్టం కట్టరు. ప్రతిపక్ష నేతను ఎన్నుకోవడం కొంత కాలంగా వస్తున్న ఆనవాయితీ. అయితే, రెండు పార్టీల మధ్య వైరం కూడా ఓ రేంజ్‌లో వుంది. అదే ఇప్పుడు కౌకుంట్లను యుద్ధక్షేత్రంగా మార్చింది.

ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రెండుపార్టీలకు పటిష్టమైన క్యాడర్ ఉంది. కొన్నేళ్లుగా రెండు పార్టీలకు కేశవ్, విశ్వేశ్వర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తూండటంతో ఇద్దరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఆధిపత్యపోరు అడుగడుగునా కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇద్దరి మధ్య విబేధాలు కొన్నిసందర్భాల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాగునీటి పథకాల ప్రారంభం ఇంటి పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలు, రాజకీయ పోరుతో జాప్యం జరిగాయి. ఇద్దరూ రాష్ట్రస్థాయి నేతలు కావడంతో నియోజకవర్గంలో అధికారులకు ఇబ్బందికరంగా మారింది. ఎవరికి వారు ఎత్తులు, పైఎత్తులతో రాజకీయంగా పైచేయి సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎత్తులుపైఎత్తుల పర్యావసానంగానే, కౌకుంట్ల ఇప్పుడు కురుక్షేత్రంగా మారింది.

పయ్యావుల కేశవ్ సొంత పంచాయతి కౌకుంట్ల. గత ఎన్నికల్లో కేశవ్‌కు తిరుగులేని మెజార్టీ తెచ్చిన పంచాయతీ ఇదే. దాదాపు 90 శాతం ఓట్లు టీడీపీకి పోలయ్యాయి. తమ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కౌకుంట్ల పంచాయతిలో వచ్చిన మెజార్టీ అని వైసీపీ రగిలిపోతోందని పయ్యావుల వర్గం అనుమానిస్తోంది. కౌకుంట్ల పంచాయతి పరిధిలో పెద్ద కౌకుంట్ల, చిన్న కౌకుంట్ల, వై.రాంపురం, మైలారంపల్లి, రాసిపల్లి గ్రామాలు ఉన్నాయి. మొత్తం 7,500 మంది జనాభ ఉన్న కౌకుంట్లలో ముందు నుంచి పయ్యావుల కేశవ్ కుటుంబానిదే ఆధిపత్యం. అందుకే కౌకుంట్లలో టీడీపీని దెబ్బ కొట్టాలంటే పంచాయతిని విడదీయాలని అధికారపార్టీ నేతలు నిర్ణయించారని, ఆరోపిస్తోంది పయ్యావుల వర్గం. ఆ ఆలోచనతోనే అనుకున్నదే తడువుగా పాలనా సౌలభ్యం కోసం పంచాయతి పరిధిలోని వైరాంపురంను వేరు పంచాయతి చేస్తున్నామని, గ్రామస్తులకు నోటీసు పంపారు. కౌకుంట్లను విడదీయడమే ఇప్పుడు రచ్చగా మారింది.

కౌకుంట్ల విభజనపై పంచాయతి కార్యాలయంలో గతంలో గ్రామ సభ నిర్వహించారు. ఎమ్మెల్యే కేశవ్ గ్రామ సభకు హాజరై ఈ కార్యక్రమంలో మెజార్టీ సభ్యులు విభజనకు వ్యతిరేకమని చెప్పారు. అప్పట్లో గ్రామ సభ తీర్మానాన్ని స్థానిక అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ విషయంపై కోర్టులో కేసు వేశారు. గ్రామసభలోనూ రెండుపార్టీలు ఎవరికి వారు విడిపోయి ఆధిపత్యం ప్రదర్శించారు. పంచాయతిలోని ఐదుగ్రామాలు ఉమ్మడిగా ఉండాలని ఎట్టి పరిస్థితిలో విడిపోకూడదని టీడీపీ నేతలు కార్యకర్తలు బలప్రదర్శన నిర్వహించారు. విభజనకు అనుకూలంగా వైసీపీ కార్యకర్తలు, నేతలుమద్దతు తెలిపారు.

మొత్తానికి గ్రామసభ నిర్వహణ అధికారులకు కత్తిమీద సాములా తయారైంది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో గ్రామంలో నలుగురు డీఎస్పీలు ప్రత్యేక బలగాలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కౌకుంట్ల పంచాయతీని విభజించడం వల్ల తమ నాయకుడి ఆధిపత్యానికి గండికొట్టాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, కేశవ్ వర్గం ఆరోపిస్తోంది. పంచాయతి ఉమ్మడిగా కొనసాగితే ఐదు గ్రామాల్లో ముందు నుంచి టీడీపీకి ఉన్న పట్టు సడలకుండా ఉంటుందన్నది ఎమ్మెల్యే కేశవ్ ఆలోచన. మొత్తానికి కౌకుంట్ల పంచాయతీ, రెండు పార్టీల ఆధిపత్య రాజకీయాలకు కేంద్రమైంది. చూడాలి, కౌకుంట్లలో ఏం జరగబోతోందో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories