మీసాల గీత దారెటు?

మీసాల గీత దారెటు?
x
Highlights

ఆమె మొన్నటి వరకూ తెలుగుదేశంలో ఒక వెలుగు వెలిగారు. సెగ్మెంట్‌లో చక్రంతిప్పారు. కానీ రారాజుల పోరాటంలో, కనీసం టికెట్‌ను కాపపాడుకోలేకపోయారు. అయితే అంతటితో...

ఆమె మొన్నటి వరకూ తెలుగుదేశంలో ఒక వెలుగు వెలిగారు. సెగ్మెంట్‌లో చక్రంతిప్పారు. కానీ రారాజుల పోరాటంలో, కనీసం టికెట్‌ను కాపపాడుకోలేకపోయారు. అయితే అంతటితో పోరాటం ఆగదంటూ, మరో యుద్ధానికి సిద్దమంటున్నారు. అతి త్వరలో రణక్షేత్రాన్ని మార్చి, సరికొత్త రూపంలో సమరానికి సై అనేలా ఉన్నారు ఆ నాయకురాలు.

మీసాల గీత...విజయనగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. మొన్నటి వరకూ టీడీపీ ఎంఎల్ఎగా మంచి పేరు తెచ్చుకున్నారు. నేడు ఆమె అడుగులు ఎటువైపు పడుతున్నాయన్నది ఆసక్తిగా మారింది. మొన్న జరిగిన ఎలక్షన్లో గీతను కాదని రాజరికానికి టీడీపీ అధిస్టానం టిక్కెట్టు ఇచ్చింది. ఎమ్మెల్యేగా ఐదేళ్లుగ ప్రజల మధ్య ఉన్న తనకు టికెట్‌ ఇవ్వలేదని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు మీసాల గీత. దీంతో ఆమె ప్రస్తుతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. జరిగిన, జరుగుతున్న పరిణామాలు కూడా అందుకు బలాన్నిస్తున్నాయి.

తూర్పు గోదావరిలో జరిగిన కాపువర్గం సమావేశానికి మీసాల గీత హాజరవ్వడంతో ఆమె, పార్టీ మారుతున్నారన్న వార్తలకు మరింత స్కోపు వచ్చిందని, విజయనగరంలో చర్చ జరుగుతోంది. 2019 ఎలక్షన్ల్ తర్వాత, జిల్లాలో తాను నమ్ముకున్న నాయుకులు తనవైపు చూడకపోడం, దీనికి తోడు జిల్లా టీడీపీ కార్యకలాపాల్లో తనకు ప్రాధాన్యత తగ్గడం, అంతేకాక తనను నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్న గీత, ఇక టీడీపీలో ఉంటే తనకు భవిష్యత్ ఉండదన్న నిర్ణయానికి వచ్చేశారట. ఈ తరుణంలో పార్టీ వీడటమే మంచిదని అనుచరులు కూడా ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది.

మీసాల గీత 2014 ఎన్నికల టైంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. టికెట్‌తోనే పార్టీలోకి వచ్చారు. గెలిచారు. అంతేకాదు స్థానిక టీడీపీ నాయకులకు చుక్కలు చూపించారట. విజయనగరం ఎమ్మెల్యేగా మీసాల గీత ఎన్నికైన తొలినాళ్లలో, తెలుగుదేశం పార్టీలో పాత నాయకులతో కొంత ఇబ్బంది పడ్డా, తరువాత కాలంలో ఆమె సొంత వర్గాన్ని పెంచుకుంటూ, తన వర్గాన్ని బలపరచుకున్నారు. దీంతో క్రమంగా పార్టీలో పాత వారితో దూరం పెరిగి, తన సొంతం అనుకున్న వారికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. దీనికితోడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి అభిమాన శిష్యురాలిగా కూడా గీత మారిపోయారు. అన్ని విషయాలు ఆయనతోనే చెప్పుకునేవారట. ఇక గీతకు తిరుగులేదని అంతా భావిస్తున్న తరుణంలో, మొన్నటి ఎన్నికల్లో సీటు దక్కకపోవడంతో ఒక్కసారిగా ఆమె రాజకీయ జీవితం తలకిందులైనట్టయ్యింది.

దీనికితోడు గత ఎన్నికల్లో జిల్లాలో పార్టీ నామరూపం లేకుండా పోవడం, నమ్ముకున్న నాయుకులు ఆమెను గుర్తించకపోవడం, నిన్నటి వరకు తన వెంట ఉన్న క్యాడరుకు పార్టీలో అన్యాయం జరుగుతుండటం ఆమెను కలవరపెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో, మీసాల గీత భవిష్యత్ దృష్ట్యా పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నారని కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. తన గురువుగా భావిస్తున్న గంటా కూడా, దాదాపు 15 మంది ఎమ్మెల్యేలలతో బీజేపీలోకి మారడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. మీసాల గీత కూడా అదే బాటలో నడిచే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చూడాలి, గీత అడుగులు ఎటువైపు పడతాయో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories