Vizag gas leak latest updates: ఎల్జీ పాలిమర్స్ ఘటన వ్యవహారంలో యాజమాన్యం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించి ఉంటే భారీ ప్రమాదం తప్పేదని హైపర్ కమిటీ తేల్చింది.
Vizag gas leak latest updates: ఎల్జీ పాలిమర్స్ ఘటన వ్యవహారంలో యాజమాన్యం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించి ఉంటే భారీ ప్రమాదం తప్పేదని హైపర్ కమిటీ తేల్చింది. అదేవిధంగా భవిషత్తులో జనావాసాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలు అనుసరించాల్సిన విధానాలను పొందుపర్చింది.
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదం వెనుక యాజమాన్యం నిర్లక్ష్యమే ఎక్కువగా ఉందని హైపవర్ కమిటీ నిగ్గు తేల్చింది. భద్రతా నియమాలను సక్రమంగా పాటించకపోవడం, ప్రమాద సంకేతాలను హెచ్చరికలుగా పరిగణించకపోవడం వల్లే ఈ అనర్థం సంభవించిందని స్పష్టం చేసింది. అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి నివేదిక సమర్పించింది.
కమిటీ సభ్యులైన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి వివేక్ యాదవ్‌తో కలసి నాలుగు వేల పేజీల నివేదికను నీరబ్ కుమార్ ముఖ్యమంత్రికి అందజేశారు. ఇందులో నివేదిక 350 పేజీలు కాగా అనుబంధాలతో కలిపి మొత్తం 4,000 పేజీలు ఉన్నట్లు నీరబ్ కుమార్ మీడియాకు తెలిపారు.
వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన సీఎం...
నివేదిక అందిన అనంతరం కమిటీ సభ్యులుగా ఉన్న విశాఖ కలెక్టర్ వినయ్‌చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్‌కే మీనా, కేంద్ర ప్రభుత్వం నియమించిన సభ్యులు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం డైరెక్టర్ డాక్టర్ అంజన్‌రాయ్, చెన్నైకి చెందిన సీపెట్ డైరెక్టర్ ఎస్‌కే నాయక్, కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ డైరెక్టర్ భరత్ కుమార్ శర్మలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
కమిటీ నివేదికలో ముఖ్యాంశాలు
► ఎల్‌జీ పాలిమర్స్‌లో ఉష్ణోగ్రతను మెయింటైన్ చేయడంలో తప్పు జరిగింది. ఎల్‌జీ పాలిమర్స్‌లో 2019 డిసెంబర్‌లో రిఫ్రిజిరేటర్ పైపులు మార్చారు. దీనివల్ల కూలింగ్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతింది. అప్పట్లో ఫ్యాక్టరీలో ఉష్టోగ్రతను కొలిచే పరికరాన్ని ట్యాంకు కింది భాగంలో అమర్చారు. దీనివల్ల ట్యాంకు మధ్యభాగం, పైభాగంలో ఎంత టెంపరేచర్ ఉందో తెలుసుకోలేకపోయారు. ఈ తరహా గ్యాస్ లీకేజీ ఘటన దేశంలోనే మొదటిది.
► స్టైరీన్ పాలిమరైజేషన్ అవుతోందని డిసెంబర్‌లోనే రికార్డు అయినా యాజమాన్యం దీన్ని హెచ్చరికగా భావించలేదు.
► ఒకవైపు ట్యాంకుల్లో ఉష్ణోగ్రత భారీగా పెరగడం, స్టైరీన్ బాష్పీభవనం చెందడం (బాయిలింగ్ పాయింట్), ఆవిరి రూపంలో బయటకు వెళ్లడంతో ప్రమాదం జరిగింది.
► స్టైరీన్ ఆవిరి రూపంలో బయటకు వెళ్లడానికి కారణాలను బొమ్మల రూపంలో కమిటీ నివేదికలో వివరించింది.
పలు రకాలుగా సమాచార సేకరణ...
► ఎల్‌జీ పాలిమర్స్‌లో గత మే 7వ తేదీన తెల్లవారుజామున 3.30 గంటలకు ప్రమాదం జరగ్గా మే 10న కమిటీ ప్రమాద స్థలాన్ని సందర్శించింది. సాంకేతిక నిపుణులతో కలిసి పరిశ్రమలో ప్రమాదానికి కారణమైన ట్యాంక్, కంట్రోల్ రూంతో, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించింది. యాజమాన్యాన్ని ప్రశ్నించి సమాధానాలు రాబట్టింది.
► సాంకేతిక నిపుణులైన ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కేవీ రావు, ఐఐపీఈ ప్రొఫెసర్ వీఎస్‌ఆర్‌కే ప్రసాద్, ఏయూ సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఎస్.బాలప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించి కమిటీ సమాచారాన్ని సేకరించింది.
► బాధితులతో పాటు ప్రత్యక్ష సాక్షులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణవేత్తలు, పరిశ్రమల అభిప్రాయాలను తీసుకుంది. సీబీఆర్‌ఎన్, ఎన్‌డీఆర్‌ఎఫ్, సీఎస్‌ఐఆర్, ఎన్‌ఈఈఆర్‌ఐ, ఏపీపీసీబీ నుంచి కూడా పూర్తి వివరాలను సేకరించింది.
► విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ , వీఎంఆర్‌డీఏ, ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్, సీఈఎస్‌ఓ, బాయిలర్స్ డిపార్ట్‌మెంట్, ఏపీపీసీబీ, పరిశ్రమల శాఖ, కార్మికశాఖ, అగ్ని మాపక శాఖల నివేదికలను పరిశీలించింది.
► జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నుంచి నియమితులైన కమిటీ సభ్యులు ప్రొఫెసర్ సీహెచ్‌వీ రామచంద్రమూర్తి, ప్రొఫెసర్ పి.జగన్నాధరావును కలిసి సమాచారం సేకరించింది.
► 250 ఈ మెయిల్స్, 180 ఫోన్‌కాల్స్‌తో పాటు 1,250 ప్రశ్నలతో వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం తీసుకుంది. మీడియా, వివిధ రాజకీయ పక్షాల నుంచి కూడా సమాచారం సేకరించింది.
► కమిటీలో ఐదుగురు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, నలుగురు కేంద్ర ప్రభుత్వ సంస్థల నిపుణులున్నారు. 11 వాల్యూమ్‌లతో 4 వేల పేజీల నివేదికను కమిటీ రూపొందించింది. కమిటీలోని 9 మంది సభ్యులూ నివేదికను ఆమోదించారు. అయితే మీడియాలో వచ్చినట్లుగా ఇది గ్యాస్ లీక్ కాదని, 'అన్ కంట్రోల్డ్ స్టైరీన్ వేపర్ రిలీజ్' అని కమిటీ పేర్కొంది.
నివేదికే ఆధారం
► ఎల్జీ పాలిమర్స్‌లో చోటు చేసుకున్న ప్రమాదంపై హైపవర్ కమిటీ అందచేసిన నివేదిక భవిష్యత్తులో పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకంగా ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. పరిశ్రమల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఈ నివేదిక ఒక ఆరంభం కావాలన్నారు. అవసరమైతే ప్రస్తుత చట్టాల్లో మార్పులు, సవరణలు చేస్తామన్నారు.
► ప్రమాదం జరిగినప్పుడు హెచ్చరించే అలారం పరిశ్రమలో 36 చోట్ల ఉన్నప్పటికీ అవి సక్రమంగా పని చేయలేదని హైపవర్ కమిటీ నివేదికలో పొందుపర్చిందని సీఎం చెప్పారు. అలారం మోగకపోవడం లాంటి లోపాల వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం చోటు చేసుకుంటోందన్నారు.
► ఘటనపై హైపవర్ కమిటీ నివేదిక మేరకు నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను దూరంగా తరలించడం లేదా గ్రీన్, వైట్ కేటగిరీ పరిశ్రమలుగా మార్పులు చేసుకోవాలని నిర్దేశిస్తామని సీఎం జగన్ చెప్పారు.
► పరిశ్రమలకు సంబంధించి అన్ని శాఖలు మరింత పటిష్టంగా కార్యాచరణ ప్రణాళికతో పాటు ప్రొటోకాల్ సిద్ధం చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రజల రక్షణ, పరిశ్రమల్లో భద్రత పట్ల ప్రభుత్వం ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుందో అందరికీ తెలిసేలా హైపవర్ కమిటీ నివేదికను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆదేశించారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire