గంటా ఎఫెక్ట్ : నేడు సీఎం జగన్ తో కేకే రాజు భేటీ..

గంటా ఎఫెక్ట్ : నేడు సీఎం జగన్ తో కేకే రాజు భేటీ..
x
Highlights

ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ కేకే రాజు ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు కేకే రాజు సీఎంను కలిసే అవకాశం..

విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ కేకే రాజు ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు కేకే రాజు సీఎంను కలిసే అవకాశం ఉంది. ఈ భేటీలో మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా పాల్గొంటారని సమాచారం. కాగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్న తరుణంలో కేకే రాజు భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. గంటా శ్రీనివాసరావు పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో కేకే రాజుకు కూడా తగిన న్యాయం చేస్తానని జగన్ ఇప్పటికే మాట ఇచ్చారని సమాచారం. కేకే రాజుకు విశాఖ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఎవరు పార్టీలోకి వచ్చినా తమకు ఇబ్బంది లేదని.. తమ గౌరవానికి ఇబ్బంది కలిగితే మాత్రం సహించేది లేదని కేకేరాజు వర్గం అంటోంది. స్వతహాగా కేకే రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారి. రియల్ వ్యాపారం నుంచి కేకేరాజు రాజకీయాల్లోకి వచ్చారు. జగన్ పాదయాత్ర విశాఖ జిల్లాకు ఎంటర్ అయన దగ్గర నుంచి ముగిసే వరకూ అన్ని తానై చూసుకున్నారు. దాంతో గత ఎన్నికల్లో విశాఖ ఉత్తరం టిక్కెట్ ఇచ్చారు జగన్.. అయితే గంటా చేతిలో కేవలం 700 ఓట్ల తేడాతోనే ఓటమిపాలయ్యారు.

ఇదిలావుంటే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రేపు సీఎం జగన్ ను కలవనున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించనున్నారు. ఆ తరువాత కుమారుడిని వైసీపీలో చేర్చనున్నారని తెలుస్తోంది. ఇక గంటా చేరికను వ్యతిరేకిస్తున్నఎంపీ విజయసాయిరెడ్డి , మంత్రి అవంతి శ్రీనివాసరావులు రేపు సీఎం వద్ద ఉంటారో లేదో ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories