వర్షాలు ఓ పక్క..ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఒక పక్క..ముంపులో ఊరు!

వర్షాలు ఓ పక్క..ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఒక పక్క..ముంపులో ఊరు!
x
Highlights

కడప జిల్లాలో ఓవైపు భారీ వర్షాలు మరోవైపు ముంచెత్తుతున్న గండికోట బ్యాక్‌వాటర్‌తో తాళ్లప్రొద్దుటూరు వాసులు నానా అవస్థలు పడుతున్నారు. గడచిన కొద్ది...

కడప జిల్లాలో ఓవైపు భారీ వర్షాలు మరోవైపు ముంచెత్తుతున్న గండికోట బ్యాక్‌వాటర్‌తో తాళ్లప్రొద్దుటూరు వాసులు నానా అవస్థలు పడుతున్నారు. గడచిన కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ఎస్సీ, బీసీ కాలనీల్లో పెద్ద ఎత్తున బ్యాక్‌ వాటర్‌ వచ్చి చేరడంతో ఇళ్లన్నీ నీట మునిగాయి. నీళ్లలో ఉండలేక నిర్వాసితులు మూటాముళ్లె సర్దుకుని ఊరు వదిలి వెళ్లిపోతున్నారు.

తాళ్ల ప్రొద్దుటూరు కడప జిల్లా కొండాపురం మండలంలోని ఓ గ్రామం. ప్రస్తుతం ఈ గ్రామాన్ని ముంపు సమస్య వెంటాడుతోంది. గండికోట జలాశయం నిండితే గ్రామం మునిగిపోతుందని, గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా అధికారులు రెండు వారాలుగా హెచ్చరిస్తున్నారు. గ్రామం ఖాళీ చేసేందుకు ఇష్టపడని ప్రజలు దీన్ని వ్యతిరేకించారు. దీంతో రెండు వారాలుగా తాళ్ల ప్రొద్దుటూరు గ్రామం నిర్వాసితులు, ప్రజాసంఘాల ఆందోళనతో అట్టుడుకుతోంది. తమకు తక్షణం పరిహారం ఇవ్వడంతో పాటు పునరావాస కాలనీలో మౌలిక వసతులు త్వరితగతిన కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే గ్రామాన్ని ఖాళీ చేసేందుకు కటాఫ్ తేదిని పొడగించాలని డిమాండ్ చేశారు.

గత కొద్ది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఓ వైపు గండికోటలోకి కృష్ణా జలాల రాక 10 వేల క్యూసెక్కులకు పైగానే ఉండగా, పరివాహాక ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల దాదాపు 16 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ఒక్కసారిగా ఉన్న ఫలంగా గండికోట జలాశయంలో 13.40 టిఎంసీలకు నీటి నిల్వ చేరింది. వరద నీరు పొటెత్తడంతో తాళ్లపొద్దుటూరు జలమయంగా మారింది. చాలా ఇళ్లలో వృద్దులు, మహిళలు, గర్బీణీలు, పిల్లపాపలతో భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. వృధ్దాప్యంలో ఉన్నవారు, అనారోగ్యంతో బాధపడే కుటుంబాల పరిస్ధితి మరీ దారుణంగా తయారైంది. ప్రసవం కోసం పుట్టింటికి వచ్చిన ఆడపడుచుల పరిస్ధితి వర్ణనాతీతంగా మారింది.

నిత్యం నీళ్లతో పాటు ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తుండటం, వాటిని చంపడం పరిపాటిగా మారింది. ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా తమకు అధికారులు కనీసం భోజనం ఏర్పాట్లు చేయలేదని బాధితులు కన్నీరు పెడుతున్నారు. మరో వైపు ముగజీవాలు సైతం నీళ్లలో నిలబడే రోజుల తరబడి ఉంటున్నాయి. నీళ్లలో పడుకోలేక పశుగ్రాసం అందక ఆకలితో అలమటిస్తున్నాయి. అధికారులు కావాలనే, తాము గ్రామాన్ని ఖాళీ చేసి పోవాలనే ఉద్దేశ్యంతో జలాశయంలోని నీటిని విడిచి పెట్టారని కాలనీవాసులు విమర్శిస్తున్నారు. పరిహారం ఇవ్వకుండా ఉన్న ఫలంగా గ్రామాలు ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్లాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తమకు ఇళ్లు ఖాళీ చేసేందుకు గడువిచ్చి తక్షణం పరిహారం ఇవ్వాలని గ్రామంలోకి చేరిన వరద నీటిని జలాశయంలో తగ్గించి తమకు ఉపశమనం కల్పించాలని వేడుకుంటున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories