విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న హైడ్రామా.. కాలినడకన కొండ ఎక్కి దిగిన బొత్స, వెల్లంపల్లి

విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న హైడ్రామా.. కాలినడకన కొండ ఎక్కి దిగిన బొత్స, వెల్లంపల్లి
x
Highlights

అంతర్వేదితో మొదలైంది. రామతీర్థం వరకు రాజుకుంది. ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులు ఏపీలో రణరంగాన్ని సృష్టిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షపార్టీల నాయకుల...

అంతర్వేదితో మొదలైంది. రామతీర్థం వరకు రాజుకుంది. ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులు ఏపీలో రణరంగాన్ని సృష్టిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షపార్టీల నాయకుల రాకతో రామతీర్థం రాజకీయ రణ క్షేత్రంగా మారింది. రామనామస్మరణ వినిపించాల్సిన చోట విమర్శలు, ప్రతివిమర్శలతో అట్టుడికింది.

రామనామ స్మరణతో మార్మోగే రామతీర్థంలో రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. భక్తులతో కళకళలాడే రామతీర్థం.. పార్టీల కార్యకర్తల ఆందోళనలతో భగ్గుమంది. కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటన రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. అధికార పార్టీ హస్తం ఉందంటూ ప్రతిపక్షాలు. టీడీపీనే చేయిస్తుందని వైసీపీ, మరోవైపు హింధూ ధార్మిక సంఘాల ఆందోళనలు. వీరిని కంట్రోల్‌ చేసేందుకు మోహరించిన పోలీసులు.. మొత్తానికి రామతీర్థంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

విజయనగరం జిల్లా రామతీర్థంలో హై టెన్షన్‌ కొనసాగుతూనే ఉంది. బీజేపీ కార్యకర్తలు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారు జామున నాలుగున్నరకు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు.. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

ఏపీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ రామతీర్థం చేరుకుని, కోదండ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. విగ్రహ ధ్వంసం ఘటన గురించి అధికారులు, అర్చకుల దగ్గర వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామతీర్థం ఘటన బాధాకరమని, దీన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు.

రామతీర్ధం ఘటనపై మంత్రి బొత్స సత్యనారాయణ విచారణ వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయిన చంద్రబాబు నాయుడు తన ఉనికిని కాపాడుకోవడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని బొత్స ఆరోపించారు. ముఖ్యమంత్రి ఏదైనా మంచి కార్యక్రమం తలపెట్టినపుడు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని బొత్స మండిపడ్డారు.

మరోవైపు చలో రామతీర్థంకు హైందవ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హైందవ సంఘాల ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. అలాగే రామ, హనుమాన్‌ భక్తులు కూడా భారీగా రామతీర్థం చేరుకున్నారు. ఓ పక్క రాజకీయనేతలు.. మరో పక్క హైందవ సంఘాల నేతల పర్యటనలతో రామతీర్థం మరోసారి ఉద్రిక్తంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories