Gautam Adani: అదానీపై అమెరికా చేసిన ఆరోపణలేంటి? వాటితో ఏపీకి లింకేంటి?

Gautam Adani: అదానీపై అమెరికా చేసిన ఆరోపణలేంటి? వాటితో ఏపీకి లింకేంటి?
x
Highlights

Why and how Andhra Pradesh is linked to US Allegations on Gautam Adani case: అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది.

Why and how Andhra Pradesh is linked to US Allegations on Gautam Adani case: అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. వ్యాపార ప్రయోజనాల కోసం లంచాలు ఇచ్చినట్లు తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన కూడా ప్రముఖంగా కనిపిస్తోంది. అదానీ మీదున్న ఆరోపణలకు, ఏపీలో అప్పటి జగన్ ప్రభుత్వానికి ఉన్న సంబంధమేంటి? ఈ ఆరోపణలు రుజువైతే అదానీకి పడే శిక్ష ఏంటి? ఇది చివరకు జగన్‌ను కూడా చుట్టుకుంటుందా? ఈ వివరాలు తెలియాలంటే ఈ డీటెయిల్డ్ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

గౌతం అదానీ... ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్న ఇండియన్ బిజినెస్‌మ్యాన్. ఇప్పుడు అమెరికా దృష్టిలో నిందితుడు. అయన భారత్‌లో కొందరు అధికారులకు దాదాపు 265 మిలియన్ డాలర్లు లంచంగా ఇచ్చారన్నది అమెరికా న్యాయ శాఖ, సెక్యురిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ చేస్తోన్న ఆరోపణ. అంతేకాదు, అబద్దపు హామీలతో అదానీ బ్యాంకులు, ఇన్వెస్టర్లను మోసం చేశారని కూడా అమెరికా ఆరోపించింది.

అసలు అమెరికా ఆరోపణల్లో ఏముంది

20 ఏళ్ల పాటు రాబడినిచ్చే 2 వేల మిలియన్ డాలర్ల సోలార్ ప్రాజెక్టు డీల్స్‌ను ఓకే చేసుకునేందుకు అదానీ అక్రమ పద్ధతిని ఎంచుకున్నట్లు అమెరికా ఆరోపించింది. అందుకే గౌతం అదానీ ఇండియాలో అధికారులకు 265 మిలియన్ డాలర్లు లంచం ఇచ్చినట్లు స్పష్టంచేసింది. భారతీయ కరెన్సీలో ఇది 2,029 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని విద్యుత్ డిస్కంలతో ఒప్పందాల కోసం ఈ లంచం ఇచ్చారన్నది ఆరోపణ. అమెరికా డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ లీసా మిల్లర్ దీనిని ఒక ఆర్థిక నేరంగా చూపించారు. అదాని గ్రూప్ సీనియర్ ఎగ్జిక్యూటీవ్స్, డైరెక్టర్స్ పేర్లను నిందితుల జాబితాలో పేర్కొంది.

అమెరికా ఆరోపణల్లో ఏపీ ప్రస్తావన ఎందుకొచ్చింది?

అధికారులకు ఇచ్చిన 2029 వేల కోట్లు రూపాయల లంచంలో కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని అధికారికే 1750 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా ఉంది. 2020-2024 మధ్య కాలంలో ఈ లంచం ఇచ్చినట్లుగా స్పష్టంచేశారు. అయితే, ఆ ఆంధ్రప్రదేశ్ అధికారి ఎవరన్నది ఇందులో చెప్పలేదు. 2019-24 మధ్య కాలంలో ఆ అధికారి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో కొనసాగారని ఉంది. ఆ అధికారి పేరును ఫారిన్ అఫిషీయల్ 1 అని మాత్రమే అందులో కేసులో మెన్షన్ చేశారు.

ఈ వివాదంలో జగన్ పేరు ఎందుకు వినబడుతోంది?

గౌతం అదానీ ఏపీలో ఒక ఉన్నతస్థాయి హోదాలో కొనసాగిన వ్యక్తికి రూ. 1750 కోట్ల లంచం ఇచ్చారనేది అమెరికా కోర్టు అభియోగం. కానీ ఆ వ్యక్తి ఎవరు అనేది మాత్రం అమెరికా కోర్టు స్పష్టత ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు ఈ వివాదంలో జగన్ పేరు ఎందుకు వినబడుతోందనే సందేహం వస్తోంది. అయితే, అందుకు ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చెబుతోందంటే.. అమెరికా కోర్టు చెప్పిన 2019-2024 మధ్య కాలంలో ఏపీలో అధికారంలో ఉన్నదే జగన్ కాక ఇంకెవ్వరు అని టీడీపీ ప్రశ్నిస్తోంది.

అంతేకాకుండా ఏపీకి చెందిన ఆ వ్యక్తిని గౌతం అదాని 2021 లో ఆగస్టు 7న, సెప్టెంబర్ 12న, నవంబర్ 20న కలిసి భేటీ అయినట్లుగానూ అమెరికా స్పష్టంచేసింది. విద్యుత్ డిస్కంలతో ఒప్పందాల కోసమే ఆ భేటీ జరిగినట్లు వెల్లడించింది. సరిగ్గా ఇదే పాయింట్ ను అధికార పక్షమైన టీడీపీ హైలైట్ చేస్తోంది. ఆయా తేదీలలో గౌతం అదానీ ఏపీకి వచ్చి భేటీ అయింది జగన్ తోనేనని టీడీపీ నాయుకులు అంటున్నారు.

జగనన్నపై చెల్లి షర్మిల కూడా

ఇదే విషయమై వైఎస్ జగన్‌పై ఆయన చెల్లి వైఎస్ షర్మిల కూడా కామెంట్స్ చేశారు. అదానీ దేశం పరువు తీస్తే.. జగన్ రాష్ట్రం పరువు తీశారని షర్మిల అన్నారు. అమెరికా చెప్పే వరకు ఈ అవినీతి గురించి మన దేశంలో ఎవ్వరూ తెలుసుకోలేకపోవడం ఎంత అవమానకరం అని షర్మిల వ్యాఖ్యానించారు.

హిడెన్‌బర్గ్ రిపోర్ట్‌తో మొదలైన అదానీ కహానీ

గత ఏడాది జనవరిలో అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ రిసెర్చ్ ఫర్మ్ హిడెన్‌బర్గ్ గౌతం అదానీ వ్యాపారంపై పెద్ద బాంబు పేల్చింది. ఇండియాలో, అమెరికాలో గౌతం అదానీ స్టాక్ మార్కెట్లలో భారీ ఎత్తున మోసాలకు పాల్పడ్డారని, తప్పుడు పద్ధతుల్లో అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నారని ఆరోపించింది. ఇంకా ఆయన స్టాక్ మార్కెట్‌ను తప్పుదోవ పట్టించారని కూడా ఆ సంస్థ తన నివేదికలో లెక్కలతో సహా నిరూపించే ప్రయత్నం చేసింది. మరింత తీవ్రమైన విషయం ఏంటంటే, అదానీ మోసాలలో సెబీ చీఫ్ మాధవి పురి, ఆమె భర్త ధావల్ బుచ్‌లకు భాగస్వామ్యం ఉందని కూడా ఆ నివేదికలో ఆరోపణలున్నాయి. ఇది భారత్‌లో రాజకీయంగా పెనుదుమారం రేపింది.

జేపీసీకి పట్టుబట్టిన రాహుల్ గాంధీ

హిడెన్‌బర్గ్ విడుదల చేసిన ఆ నివేదిక అప్పట్లో గౌతం అదానీ కంపెనీపై అనేక ఆరోపణలకు, విమర్శలకు దారితీసింది. అదానీని అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలన్నారు రాహుల్ గాంధీ. హిడెన్ బర్గ్ దెబ్బకు అప్పట్లో అదానీ గ్రూప్ షేర్లు దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే, ఆ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. హిడెన్‌బర్గ్ ఒక ప్రైవేటు పరిశోధన సంస్థ కావడంతో అదానీ సంస్థ ఆ చిక్కుల నుంచి తొందరగానే బయటపడింది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. అమెరికా ప్రభుత్వమే ఆరోపణలు చేసింది. కేసు బుక్ చేసింది.

స్పందించిన అదానీ గ్రూప్

అమెరికా న్యాయ శాఖ, సెక్యురిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ కమిషన్ ఆరోపణలను అదానీ గ్రూప్ ఖండించింది. అవన్నీ నిరాధారమైన ఆరోపణలని కొట్టిపారేసింది. వ్యాపార నియమాలు, నిబంధలను తమ సంస్థ తూచా తప్పకుండా పాటిస్తుందోని ఆ కంపెనీ చెప్పుకొచ్చింది. షేర్ హోల్డర్స్, ఉద్యోగులు, ఇతర భాగస్వాములు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది.

జగన్ వర్గాలు ఏమంటున్నాయి?

అదానీ గ్రూప్ తో ఆనాటి జగన్ ప్రభుత్వంతో ఎలాంటి ఎలాంటి ఒప్పందాలు జరగలేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. తమ అధినేత జగన్ పై వస్తోన్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని వారంటున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో మాత్రమే ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని ఆ పార్టీ వివరణ ఇచ్చింది.

అమెరికా కేసుతో అదానీ కంపెనీల షేర్లు భారీగా పడిపోతున్నాయి. ఆ వార్త బయటకు రాగానే నవంబర్ 21న అదానీ గ్రూపునకు చెందిన కంపెనీల షేర్లు రూ. 2.2 లక్షల కోట్లు నష్టపోయాయి. హిడెన్ బర్గ్ రిపోర్ట్ వెలుగు చూసిన 2023 జనవరి నుంచి చూస్తే ఇప్పటివరకు అదానీ కంపెనీల షేర్ల విలువ దాదాపు 7 లక్షల కోట్లు తగ్గింది.

ఇదిలా ఉంటే, అమెరికా దెబ్బకు దేశవిదేశాల్లో అదానీ గ్రూప్ చేసుకున్న వ్యాపార ఒప్పందాలు తలకిందులవుతున్నాయి. కెన్యా ప్రభుత్వం అదానీకి అప్పజెప్పిన విమానాశ్రయం విస్తరణ ప్రాజెక్టును రద్దు చేసింది.

అమెరికా కేసులో దోషిగా తేలితే ఏ శిక్ష పడుతుంది?

ఈ కేసులో అదానీ లంచాలు ఇచ్చినట్లుగా రుజువైతే ఐదేళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. కుట్రపూరిత చర్యలు, ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణల్లో కూడా ఆయన దోషిగా తేలితే భారీ జరిమానాతో పాటు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories