తిరుపతి లడ్డూ తయారీకి గ్రీన్ ఎనర్జీ.. సోలార్ ఆవిరితో.. కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్

TTD Decided to Make Tirumala Tirupati Laddu with Green Energy | Live News Today
x

తిరుపతి లడ్డూ తయారీకి గ్రీన్ ఎనర్జీ.. సోలార్ ఆవిరితో.. కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్

Highlights

Tirupati Laddu: గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్...

Tirupati Laddu: దేశ వ్యాప్తంగా బొగ్గు, విద్యుత్‌ కొరత ఏర్పడుతున్న కారణంగా శ్రీవారి భక్తలకు ఇబ్బందులు లేకుండా టీటీడీ అప్రమత్తమైంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో క్లీన్ కుకింగ్ ద్వారా ఇంధనం ఆదా అయ్యేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో తిరుమలలో‌ గ్రీన్ ఎనర్జీని ఉపయోగించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్‌గా తిరుమలను ఎంచుకుంది.

తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత అంతే స్థాయిలో లడ్డూ ప్రసాదానికి ప్రాధాన్యత ఇస్తారు భక్తులు. పర్యావరణ పరిరక్షణ లో భాగంగా తిరుమలలో టీటీడీ చేపట్టిన గ్రీన్ పవర్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడానికి ముందుకు వచ్చింది. దీనికి సంబంధించి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ అధికారులు టిటిడి అధికారులతో చర్చలు జరిపారు.తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న గ్యాస్ ఆధారిత ఆవిరికి బదులుగా సోలార్ ఆధారిత ఆవిరిని ఉపయోగించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ అధికారులు వివరించారు.

అలాగే కాకుల కొండ వద్ద పవన విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన విషయాలు తెలియజేశారు. తిరుమల లడ్డూ తయారీలోనూ క్లీన్ కుకింగ్ ఇంధన ఆదా చేసేలా టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ APSECM బీఈఈ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ బాక్రే ఓ లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా బొగ్గు, విద్యుత్‌ కొరత నేపథ్యంలో భవిష్యత్‌ ఇంధన అవసరాల కోసం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైన లడ్డూ మహా ప్రసాదం తయారు చేయటానికి క్లీన్‌ కుకింగ్‌ విధానం ఉపయోగించడం ద్వారా కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించవచ్చు. విద్యుత్‌ బిల్లుల కోసం టీటీడీ ఏటా రూ.40 కోట్లు వెచ్చిస్తోంది. ఇంధన సామర్థ్య చర్యల ద్వారా ఇందులో రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు వ్యయాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. టీటీడీలో ఇది వరకు రోజుకు 34 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తుండగా, ఇప్పుడు అది 44 లక్షల గ్యాలన్లకు చేరింది. టిటిడి చేస్తున్న ప్రయత్నాలు ఫలించి కొత్త పద్దతుల్లో లడ్డూ తయారు చేస్తే భారీగా ఇంధన పొదుపు కావడమే కాక పర్యావరణానికి మేలు జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories