Top-6 News of the Day: మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్దం వెనుక కుట్ర': మరో 5 ముఖ్యాంశాలు

Top-6 News of the Day: మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్దం వెనుక కుట్ర: మరో 5 ముఖ్యాంశాలు
x

Top-6 News of the Day: మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్దం వెనుక కుట్ర': మరో 5 ముఖ్యాంశాలు

Highlights

1. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్దం కేసులో కుట్రకోణం: మంత్రి సత్యప్రసాద్మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దగ్దం కేసులో కుట్రకోణం ఉందని ఏపీ రెవిన్యూ...

1. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్దం కేసులో కుట్రకోణం: మంత్రి సత్యప్రసాద్

మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దగ్దం కేసులో కుట్రకోణం ఉందని ఏపీ రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ఈ కుట్ర వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు రెవిన్యూ శాఖ కార్యదర్శి ఆర్ పీ సిసోడియా మదనపల్లెలో ఉన్నారని.. పరిస్థితులను అధ్యయనం చేసి సీఎంకు నివేదిక ఇచ్చారని మంత్రి తెలిపారు. మదనపల్లెలో అక్రమాలకు సంబంధించి ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా చెప్పారు.


2. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు సివిల్స్ కు ప్రిపేరౌతున్న విద్యార్ధి లేఖ

సివిల్స్ ప్రిపేరౌతున్న విద్యార్థి అవినాశ్ దూబే ఓల్డ్ రాజేంద్రనగర్ లోని ఐఏఎస్ స్టడీ సెంటర్ లో ఉన్న లోపాలను లేఖలో వివరించారు. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నవారంతా ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి బేస్ మెంట్ ను లైబ్రరీలుగా మార్చారని ఆ లేఖలో చెప్పారు. ఈ నిర్లక్ష్యం వల్లే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఆయన విమర్శించారు. ఓ కోచింగ్ సెంటర్ లో వరద నీటిలో మునిగి ముగ్గురు విద్యార్ధుల మృతికి కార్పొరేషన్ అధికారులు, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.


3. జీఎస్టీ కుంభకోణంపై తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పై కేసు

సోమేష్ కుమార్ పై హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీఎస్టీ కుంభకోణంలో ఆయనను ఐదో నిందితుడిగా చేర్చారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, వాణిజ్య పన్నుల శాఖ అనదపు కమిషనర్ ఎస్. వి. కాశీవిశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్, ఐఐటీ హైద్రాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు తదితరులను నిందితులుగాచేర్చారు. సోమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత వీఆర్ఎస్ తీసుకుని బీఆర్ఎస్ లో చేరారు.


4. అసెంబ్లీకి రానప్పుడు కేసీఆర్ కు విపక్ష హోదా ఎందుకు?: కోమటిరెడ్డి

అసెంబ్లీకే రానప్పుడు కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్ రంగంపై అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఈ చర్చలో కాంగ్రెస్ తరపున ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ సర్కార్ విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. ఇదే అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. అప్పులు చేయకుండా అభివృద్ది ఎలా చేయాలని ఆయన ప్రశ్నించారు. అప్పులు తేకుండా నోట్లు ముద్రించాలా అని ఆయన అడిగారు.


5. వెనెజువెలా అధ్యక్షుడిగా నికోలస్ మడురో ఎన్నిక

వెనెజువెలా అధ్యక్షుడిగా నికోలస్ మడురో ఎన్నికయ్యారు. ఆయనకు 51.20 శాతం ఓట్లు పోలైనట్లు తేలింది. ఆయన ప్రత్యర్ధికి 44.02 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఎన్నికల కౌంటింగ్ లో భారీగా అవినీతి జరిగిందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ రిజల్ట్స్ ను న్యాయస్థానంలో సవాల్ చేస్తామని ప్రకటించాయి. ఎన్నికల్లో ఎనిమిది మంది పోటీ పడ్డారు. అయితే మడురో, గొంజాలెజ్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది.


6. శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత

కృష్ణానదికి వరద పోటెత్తింది. ఆలమట్టి, నారాయణఫూర్, జూరాల ప్రాజెక్టులతో పాటు తుంగభద్ర జలాశయం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 6 లక్షల 67 వేల 210 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో సోమవారం మధ్యాహ్నం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి సుమారు 82 వేల 738 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 878.90 అడుగులు. ఈ ప్రాజెక్టులో నీటినిల్వ సామర్ధ్యం 215.81 టీఎంసీలు. ప్రస్తుతం 182.61 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories