Vizianagaram: అధిక సంఖ్యలో తరలి రానున్న భక్తజనం
Vizianagaram: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాద్య దైవం, పూసపాటి రాజుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు 254 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ప్రతీయేటా విజయదశమి వెళ్ళిన మంగళవారం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జరుగుతుంది. పైడితల్లి అమ్మవారి జాతరలో సిరిమానోత్సవానికి ప్రత్యేకత ఉంది. సిరిమాను అనేది భక్తి పూర్వకంగా జరుపుకునే ఒక ఉత్సవం. ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూర్చొని గుడికి ప్రదక్షిణ చేయడం ఈ ఉత్సవంలోని ప్రధాన భాగం. సిరిమానోత్సవం ఆద్యంతం కనుల విందుగా సాగుతుంది. ఈ సిరిమాను కోసం 33 మూరలు ఉండే వృక్షాన్ని కనిపెట్టడం సామాన్యులకు సాధ్యమయ్యే అంశం కాదు. ప్రతీ ఏటా సిరిమాను సంబరానికి సరిపడే వృక్షం లభించడం కూడా ఒక అద్భుత ఘట్టమే.
సిరిమాను రథం ఊరేగింపులో ఎనిమిది ప్రధానమైన అంశాలుంటాయి. అన్నింటిలో కీలకమైనది విశేషమైందీ సిరిమాను సంబరం, సిరిమాను ఉపరితలంపై బిగించే ఇరుసు, దానిపై ప్రధాన పూజారి ఆసనం, ఆయన చేతిలో విసనకర్ర ప్రత్యేక ఆకర్షణలు. సిరిమాను తిరుగుతున్నంత సేపూ భక్తులు అరటిపళ్లు విసరడం ఆనవాయితీగా వస్తోంది. చూడముచ్చటగా, అత్యంత శోభాయమానంగా సువర్ణ వర్ణంతో కళకళలాడే సిరిమాను ప్రధాన ఆకర్షణ. ఈ సిరిమాను ముందు సాగే బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం ఆకర్షణలుగా నిలుస్తాయి.
బెస్తవారి వల పైడితల్లి అమ్మ చరిత్రలో జాలర్లకు విశేషమైన స్థానం ఉంది. లోక పావని, కలియుగంలో ప్రత్యక్ష దైవంగా అలరారుతున్న పైడితల్లి దర్శన భాగ్యాన్ని మనకు కలిగించడంలో జాలర్లకు కీలక పాత్ర పోషించారు. రెండున్నర శతాబ్ధాలకు మునుపు అమ్మతల్లి పెద్ద చెరువు గర్భంలో నిక్షిప్తమై ఉన్నప్పడు ఆ తల్లి మూల విరాట్టును బయటకు తీయడంలో స్థానిక జాలర్ల కృషి అమోఘం. అమ్మను మొదటిసారి చూసే భాగ్యం బెస్తవారికే దక్కింది. అమ్మవారి సేవ పూర్వ జన్మ సుకృతంగా భావించిన జాలర్లు ప్రధాన పూజారి అప్పలనాయుడిని ఒక కోరిక అడిగారని చరిత్ర చెబుతోంది. ప్రతీ ఏటా జరిగే సిరిమాను సంబరంలో అమ్మవారి సిరిమాను ముందు తమకు చోటు కల్పించాలనే జాలర్ల కోరికను అప్పలనాయుడు మన్నించారు. ఈ కారణంగానే ఆనాటి నుంచి సిరిమాను సంబరంలో బెస్తవారి వలతో జాలర్లు ఉండటం ఆనవాయితీగా వస్తోంది.
పాలధార జాలరి వల వెనుక ఈటెలతో వచ్చే జనం సాధారణ జనం కాదు. వీరిని పూర్వీకులు మహాశక్తి స్వరూపులుగా పరిగణించారు. పాలధారంగా పిలిచే ఈ జనధార అమ్మవారి సైనిక శక్తికి ప్రతిరూపంగా చెబుతుంటారు. వీరి చరిత్ర కూడా ఘనమైనదే. పూర్వం కోట వెనుక అడవిలో నివసించే ఆటవికులు కోటరక్షణగా ఉండేవారని కథనం. వారికి గుర్తుగానే సిరిమాను ఉత్సవంలో ఈటెలు ధరించి డప్పులు వాయిస్తూ సిరిమాను ఊరేగింపులో పాల్గొంటారు. వీరిని అమ్మవారి శక్తికి ప్రతిరూపాలుగా భక్తులు విశ్వసిస్తారు.
సిరిమాను జాతరలో తెల్ల ఏనుగు మరో విశిష్టమైన ఆకర్షణ. గజపతులు వారి ప్రాభవాన్ని ప్రతిబింబించే విధంగా పట్టపుటేనుగును అమ్మవారి సిరిమాను సంబరంలో ఉంచేవారు. అయితే కాలక్రమేణా సంస్థానాలు, రాజ్యాలు పోవడంతో 1956 నుంచి పట్టపుటేనుగును ప్రతిబింబించే విధంగా ఏనుగు ఆకారంలో ఒక బండిని రూపొందించి సిరిమాను ముందు నడిపిస్తారు. ఈ బండి మీద ఏడుగురు స్త్రీ వేషధారులు, ఒక పురుషుడు ఉంటారు. ఈ ఏడుగురు స్త్రీలు పైడితల్లి అక్కాచెల్లెళ్లు కాగా పురుషుడు అమ్మవారి ఏకైక సోదరుడు పోతురాజుగా చెబుతుంటారు. అపురూప దేవతలందర్నీ ఒకే వేదికపై మనకు సాక్షాత్కారింప చేసే ఆ ఏనుగు నిజంగా ఐరావతమే.
సిరిమాను సంబరంలో చివరిదైన చిత్రమైన అంశం అంజలి రథం. అమ్మవారి వైభోగానికి ఈ అంజలి రథం ప్రత్యేక నిదర్శనం. ఏలికా, పరిచారికల మధ్య, అనుబంధానికి ఈ అంజలి రథం ప్రతీకగా నిలుస్తుంది. అంజలి రథంపై ఉండే ఐదుగురు స్త్రీలు అమ్మవారిని సేవించిన పరిచారికలు. నాడు తల్లిపై వాళ్లు చూపించిన భక్తి ప్రవక్తులను నేటికీ గుర్తుకు తెచ్చేలా అంజలి రథంపై స్త్రీ వేషదారులు సిరిమాను ముందు అంజలి ఘటించి కనిపిస్తారు. తరతరాల సేవా నిరతికి భక్తి విశ్వాసాలకు మారుపేరే అంజలి రథం.
సిరిమాను సంబరంలో లక్షలాది మంది భక్తులు అమ్మవారి వైభవాన్ని తనివి తీరా చూసి భక్తి భావంతో మమేకమవుతుంటారు. అమ్మవారు తన గుడి నుంచి బయటకు వచ్చి అలంకరించిన సిరిమానుపై పూజారి వేషంలో ఆశీనులై ఊరేగుతుందని.... దానికి ప్రతీకే సిరిమాను సంబరమని భక్తుల నమ్మకం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire