Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఇవాళ గరుడసేవ

Today is Garuda Seva in Tirumala Brahmotsavam
x

Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఇవాళ గరుడసేవ

Highlights

Tirumala: వాహనాలుగా మారి స్వామివారి సేవలో తరిస్తున్న పశుపక్ష్యాదులు

Tirumala: తిరుమలేశుని బ్రహ్మోత్సవాల్లో ఇవాళ గరుడసేవ జరుగనుంది. బ్రహ్మోత్సవాల్లో పశుపక్ష్యాదులు వాహనాలుగా మారి సేవలు అందిస్తున్నాయి. మహావిష్ణువు అత్యంత ప్రీతి పాత్రమైన గరుత్మండు స్వామివారిసేవలో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. బ్రహ్మోత్సవాల్లో గరుత్మంతునిపై విహరించే స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాష్ట్రనలుమూలలనుంచేగాకుండా... పొరుగు ప్రాంతాలనుంచి భారీగా తరలి రానున్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ఉద్యాన, అటవీశాఖల సంయుక్తాధ్వర్యంలో ఆలయాన్ని సుగంధ పరిమళ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. నారాయణగిరి ఉద్యానవనంలోనూ తిరుమలేశుని వైభవానికి ప్రతీకగా తీర్చిదిద్దారు.

శ్రీవారి గరుడసేవలో పాల్గొనే భక్తులకు అన్నప్రసాదాన్ని నిరంతరం పంపిణీ చేయాలని దేవస్థాన అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకుని తిరువీధుల్లో వాహనసేవ సాగుతున్న సమయంలో తొక్కిసలాట లేకుండా ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటుచేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ నాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి గొడుగులను ప్రత్యేకంగా తిరుమలకు తీసుకొచ్చారు. స్వామివారి గరుడసేవలో వినియోగించే గొడుగులను ప్రత్యేకంగా రూపొందించి తెప్పించారు. చెన్నైనుంచి పాదయాత్రగా తిరుమల చేరుకున్నహిందూ ధర్మార్థ సమితి ప్రతినిధులు గొడుగులను టీడీడీ ఈవో ధర్మారెడ్డికి అందించారు.

తిరుమల గరుడ సేవలో శ్రీవారికి తమిళనాడు శ్రీవెల్లి పుత్తూరునుంచి గోదాదేవి పంపిన పూలమాలలు, రామచిలుక కానుకగా అందించారు. ప్రతియేటా స్వామివారికి గోదాదేవి సుగంధపరిమళ పూలమాలలు, రామచిలుకను కానుకగా అందివ్వడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న పెద్దజీయర్ మఠంలో గోదాదేవి పంపిన గజమాల, సుగంధ పరిమళ హారానికి, రామచిలుకలకు పూజలు నిర్వహించారు. తిరుమల పెద్ద, చిన్న జీయంగార్లు, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి , ఆలయాధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గరుడోత్సవం రోజున గోదాదేవి పంపిన పూలమాలను మూలవిరాట్టుకు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

భారీగా తరలివచ్చే భక్తులకు ఈరోజు ఉదయంనుంచే ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నారు. శ్రీవారి గరుడసేవకోసం వచ్చే భక్తుల వాహనాలకు పార్కింగ్ పాసుల్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఆలయాధికారులు తెలిపారు. పాసులున్న వాహనాలనుమాత్రమే అలిపిరి గేట్‌నుంచి ఘాట్‌ రోడ్డులోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. 3 లక్షల మంది గరుడవాహనసేవలో పాల్గొంటారని అధికారులు అంచనా వేసి ఏర్పాట్లు చేపట్టారు. వివిధ ప్రాంతాలనుంచి తిరుపతికి వచ్చే వాళ్లకు మార్గమధ్యలోనే పాసులను జారీ చేస్తున్నారు. కడపజిల్లానుంచి వచ్చేవారి కరకంబాడి వద్ద పాసులు జారీచేస్తున్నారు. నెల్లూరునుంచి వచ్చే వాహనాలు ఏర్పేడు శ్రీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద పాసులు పంపిణీచేస్తున్నారు. చెన్నైనుంచి వచ్చే వాహనాలకు వడమాలపేట టోల్ ప్లాజా అగస్త్య ఎన్‌‌క్లేవ్‌ వద్ద పాసులిస్తున్నారు. చిత్తూరునుంచి వచ్చే వాహనాలకు ఐతేపల్లి అగ్రికల్చర్ ల్యాండ్స్ వద్ద పాస్‌లిస్తున్నారు. మదనపల్లి నుంచి వచ్చే వాహనాలకు రంగంపేట శ్రీ విద్యానికేతన్ వద్ద పాసులు పంపిణీచేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories