అమరావతి మాస్టర్ ప్లాన్‌ ఇదే... దీనికి చట్టబద్ధత సాధ్యమేనా?

This is the Amaravati Master Plan Can it be legalized?
x

అమరావతి మాస్టర్ ప్లాన్‌ ఇదే... దీనికి చట్టబద్ధత సాధ్యమేనా?

Highlights

చంద్రబాబు 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతిని ప్రపంచంలోని అగ్రశ్రేణి రాజధానిగా తీర్చిదిద్దాలని సంకల్పించారు.

చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతిలో మళ్లీ కదలిక వచ్చింది. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారంగానే రాజధాని నిర్మాణ పనులు చేపట్టనున్నట్టుగా మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ ప్రకటించారు. మూడు దశల్లో ఈ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. తొలి దశలో రాజధాని నిర్మాణ పనులకు 48 వేల కోట్లను ఖర్చు అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.


చంద్రబాబు అమరావతి మాస్టర్ ప్లాన్ ఏం చెబుతుంది?

చంద్రబాబు 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతిని ప్రపంచంలోని అగ్రశ్రేణి రాజధానిగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని మాస్టర్ ప్లాన్ ను తయారు చేయించారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుండి 33 వేలకు పైగా ఎకరాల భూమిని సేకరించారు. రాజధాని నిర్మాణం కోసం సీఆర్డీఏను కూడ ఏర్పాటు చేశారు. 900 ఎకరాల్లో అమరావతి నగరాన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు.

సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు సహా అన్ని ప్రభుత్వ శాఖల భవనాలు ఇక్కడే ఉంటాయి. ఇప్పటికే కొన్ని భవనాల నిర్మాణం జరిగింది. మరికొన్ని భవనాల నిర్మాణం అసంపూర్తిగా ఉంది. నిర్మాణం పూర్తికాని భవనాల పనులను వెంటనే చేపట్టనున్నారు.

మాస్టర్ ప్లాన్ మేరకు అమరావతిలో 1. గవర్నమెంట్ సిటీ, 2. జస్టిస్ సిటీ, 3.ఫైనాన్స్ సిటీ, 4. నాలెడ్జ్ సిటీ, 5.టూరిజం సిటీ, 6.ఎలక్ట్రానిక్స్ సిటీ, 7.హెల్త్ సిటీ, 8.స్పోర్ట్స్ సిటీ, 9. మీడియా సిటీ ని నిర్మించాలని ప్లాన్ చేశారు. 2050 నాటికి అమరావతిలో 30 లక్షల జనాభా నివసిస్తారని ప్రభుత్వం అంచనా వేసింది.

పాత మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగానే అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు అభిప్రాయపడ్డారు. జగన్ ప్రభుత్వం సీఆర్ డీఏ చట్టాన్ని రద్దు చేసింది. కానీ, ఆ తర్వాత ఈ చట్టాన్ని వెనుకకు తీసుకొంది. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా ప్రభుత్వం తెలిపింది. చంద్రబాబు సర్కార్ తయారు చేయించిన మాస్టర్ ప్లాన్ కు అన్ని రకాల అనుమతులున్నాయి. అందుకే ఇదే మాస్టర్ ప్లాన్ ను చంద్రబాబు సర్కార్ పరిగణనలోకి తీసుకుంటుంది.


అమరావతికి నిధులు ఎలా?

అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం అవసరమైన నిధులు ప్రభుత్వానికి ఎక్కడి నుండి వస్తాయనే అంశం అందరిలో ఉదయిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం రాజధాని నిర్మాణం కోసం అవసరమైన నిధుల కోసం కేంద్రం నిధులను సమకూర్చాలి. ఈ మేరకు చట్టంలో స్పష్టంగా చెప్పారు. 2014-2019 వరకు ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు అమరావతిలో భవనాల నిర్మాణాన్ని చేపట్టారు.

తొలివిడతలో నిర్మాణాలకు 48 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అయితే అప్పటి అంచనాలు ఇప్పటికి కచ్చితంగా పెరుగుతాయి. ఇప్పటికే 9 వేల 800 కోట్ల విలువైన భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుండి 1500 కోట్లు మాత్రమే రాష్ట్రానికి అందాయి.

అమరావతిలో రాజధాని నిర్మాణాల కోసం చంద్రబాబు సర్కార్ 38 వేల కోట్లను ఖర్చు చేసింది. నాబార్డు, ప్రపంచబ్యాంకుల నుండి తెచ్చిన అప్పులతో ఈ నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటివరకు చేపట్టిన నిర్మాణాలను మినహయిస్తే ఇంకా ఎన్ని నిర్మాణాలు చేపట్టాలి.... వాటి కోసం ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందనే విషయాలపై అధికారులు అంచనాలు సిద్దం చేస్తున్నారు. గతంలోని అంచనాలకు ఇప్పటికి అంచనాలు ఎంత మేరకు పెరిగాయనే విషయాలపై అధికారులు నివేదికలు తయారు చేస్తున్నారు.

ఎన్ డీ ఏ లో చంద్రబాబు కీలక భాగస్వామి. ఈ పరిణామం అమరావతికి కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు అభిప్రాయపడ్డారు. అమరావతికి అవసరమైన నిధులను కేంద్రం నుండి రాబట్టుకోవడంలో చంద్రబాబు సర్కార్ చొరవ చూపాలని ఆయన కోరారు. 2014లో చంద్రబాబు ఎన్ డీ ఏ భాగస్వామిగా ఉన్నా అప్పట్లో బీజేపీకి స్వంతంగా మెజారిటీ ఉంది. కానీ, ప్రస్తుతం టీడీపీ ఎంపీల బలం బీజేపీ అవసరం ఉంది. ఇది అమరావతికి నిధులను తెచ్చి పెట్టేందుకు చంద్రబాబుకు కలిసివస్తుందని ఆయన చెప్పారు.


మూడు దశల్లో అమరావతికి లక్ష కోట్లు ఎలా తెస్తారు?

అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారంగా మూడు విడతల్లో రాజధానిలో నిర్మాణ పనులకు లక్ష కోట్లు అవసరమౌతాయని అధికారులు అప్పట్లో అంచనా వేశారు. అయితే అప్పటితో పోలిస్తే ఈ అంచనాలు పెరుగుతాయి. అమరావతిలో నిర్మాణాలు పూర్తై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభిస్తే ఈ ప్రాంతంలో భూముల ధరలు మరింతగా పెరుగుతాయి. అప్పటి అంచనాల మేరకు ఎకరం రూ.4 కోట్లు ధర పలికే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ భూ విక్రయం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చే వెసులుబాటు ఉంది. రాజధాని నిర్మాణానికి నిధులకు ఇబ్బందులుండవని కృష్ణాంజనేయులు చెప్పారు.


అమరావతికి భూములిచ్చిన రైతులకు కౌలు గడువును పొడిగించాలి

అమరావతిలో రాజధాని కోసం 34వేల 348 మంది ఎకరాల భూములను 28 వేలకు పైగా రైతుల నుండి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించింది. భూములిచ్చిన రైతులకు పదేళ్లపాటు ఆయా భూముల్లో పండే పంటల ఆధారంగా ఏడాదికి 25 నుండి 35 వేల రూపాయాలను చెల్లించేవారు. రాజధానిలో భూములిచ్చిన రైతులకు ప్లాట్లను కేటాయించారు. ఈ ప్లాట్లను ప్రభుత్వం డెవలప్ చేసి ఇవ్వాలనేది అగ్రిమెంట్. పదేళ్ల సమయం పూర్తయినందున రైతులకు కౌలును పొడిగించాలని అమరావతి జేఏసీ నాయకుడు బాలకోటయ్య ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాజధానిలో రైతుల ప్లాట్లను డెవలప్ చేసే వరకు ఈ కౌలును పెంచాలని కోరుతున్నారు. అయితే పెరిగిన ధరల మేరకు కౌలును కూడ పెంచే విషయాన్ని పరిశీలించాలనే డిమాండ్ ను ఆయన ప్రభుత్వం ముందుంచారు.


అమరావతికి చట్టబద్దత కల్పించాలి

అమరావతిలో పనులు రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రణాళికను మంత్రి నారాయణ ప్రకటించే అవకాశం ఉంది. భవిష్యత్తులో వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అమరావతికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టబద్దత కల్పించాలనే డిమాండ్ కూడా రైతుల నుండి వినిపిస్తుంది. 2019లో వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో అమరావతికి చట్టబద్దత కల్పించాలని అమరావతి ఉద్యమనాయకుడు బాలకోటయ్య కోరుతున్నారు. అమరావతి ఒకే సామాజిక వర్గానికి చెందిందని జగన్ సర్కార్ చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టేలా నిర్మాణం సాగాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి అందరిది అనే భావన కల్పించేలా ప్రభుత్వం నుండి చర్యలు ఉండాలని ఆయన కోరారు.



Also Read: అమరావతిలో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగితే హైద‌రాబాద్‌లో తగ్గుతాయా?


Also Read: చంద్రబాబు రాకతో అమరావతిలో రియల్ ఎస్టేట్ బూమ్.. పెరుగుతున్న రిజిస్ట్రేషన్లు

Show Full Article
Print Article
Next Story
More Stories