Andhra Pradesh Elections 2024: వైఎస్ జగన్ ఓటమికి 5 కారణలు ఇవే...
వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయానికి పార్టీ అధినేత వైఎస్ జగన్ వైఖరే కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. కేవలం 10 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ 151 సీట్లు గెలిచింది. ఈసారి టీడీపీ కూటమి 164 స్థానాల్లో విజయం సాధించింది. వైనాట్ 175 అనే నినాదంతో బరిలోకి దిగిన వైఎస్ఆర్సీపీకి ఇది ఊహించని ఎదురు దెబ్బ. జగన్ పరాజయానికి 5 కారణాలివే...
1. జగన్ స్వయంకృతం
వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయానికి పార్టీ అధినేత వైఎస్ జగన్ వైఖరే కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలోనైనా, పార్టీలోనైనా తాను అనుకున్నదే జగన్ చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో కలిపి 81 మంది అభ్యర్ధులను మార్చారు.
తనకు అత్యంత సన్నిహితులుగా పేరున్న కాపు రామచంద్రారెడ్డిలాంటి వాళ్లను కూడా జగన్ పక్కనపెట్టారు. జగన్ తీరుతో అసంతృప్తికి గురైన కొందరు నాయకులు పార్టీని వీడారు. ఈ పరిణామాలు వైసీపీకి ప్రతికూలంగా పని చేశాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైసీపీలో టికెట్ రాని కొలుసు పార్థసారథి – నూజివీడు, బాలశౌరి, మచిలీ పట్నం వంటి వారు తెలుగుదేశం, జనసేన పార్టీలలో చేరి గెలిచారు. “ఏకపక్ష నిర్ణయాలు, నెగెటివ్ పాలిటిక్స్ చేయడం ఆయన ఓటమికి ప్రధాన కారణాలు” అని విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు.
2. ఫలితాలు ఇవ్వని సంక్షేమ పథకాలు
నవరత్నాల పేరుతో అమలు చేసిన సంక్షేమ పథకాల మీద పెట్టుకున్న ఆశలేవీ వైసీపీ విజయానికి దోహదపడలేదు. పలు పథకాల కింద లబ్దిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా నగదు చెల్లించారు. 29 రకాలైన పలు పథకాల ద్వారా 2019 జూన్ నుండి 2024 జనవరి వరకు రూ.2,54,894 కోట్లను ఖర్చు చేశారు.
ఇవి కాకుండా స్కాలర్ షిప్ లు, ఇళ‌్ల నిర్మాణం, విద్యుత్ సబ్సిడీ వంటి నాన్ డిబిటి పథకాలకు రూ. 1,70,873 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వం నుండి లబ్దిపొందిన వారంతా తమ పార్టీకి ఓటు చేస్తారని ఆ పార్టీ భావించింది. కానీ, ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. “సంక్షేమ పథకాల పేరుతో పేదలకు ఉచితాలు ఇచ్చి, దానికి ప్రతిఫలంగా తమకు ఓటు వేయాలని ఇప్పటి నాయకులు అడుగుతున్నారు. అది అధికారంలో ఉన్న నాయకులు తమ జేబులోంచి ఇస్తున్న డబ్బు కాదనే అవగాహన ఇప్పుడు ప్రజలకు బాగా వచ్చింది” అని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు.
3. రాజధాని గందరగోళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 2014లో అమరావతిలో రాజధానికి చంద్రబాబు సర్కార్ శంకుస్థాపన చేసింది. ఇక్కడ భవనాల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూల్ ను న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని ప్రకటించారు.
మూడు రాజధానులను ఏపీలోని అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రైతులు ఆందోళనలు చేశారు. కోర్టును ఆశ్రయించారు. 2024 ఎన్నికలకు ముందే విశాఖ నుండి పాలనను సాగిస్తానని జగన్ ప్రకటించారు.
విశాఖలో పాలనను ప్రారంభించేందుకు అవసరమైన భవనాల నిర్మాణాన్ని ప్రారంభించారు. కోర్టు కేసుల కారణంగా విశాఖలో పాలనను ప్రారంభించలేదు. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతా, విశాఖపట్టణమా అనే విషయమై చర్చ సాగింది. రాజధాని లేదు, అభివృద్ది లేదనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది.. జగన్ నెగిటివ్ రాజకీయాలు నడిపారని సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ అభిప్రాయపడ్డారు.
4. విద్వేష రాజకీయాలు
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్వేష రాజకీయాలు ప్రారంభమయ్యాయనే అభిప్రాయాలు లేకపోలేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజావేదికను జగన్ కూల్చివేశారు. చంద్రబాబుతో పాటు ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు. ప్రతిపక్షంలో బలంగా ఉన్న నాయకులపై అక్రమంగా కేసులు బనాయించారనే కూడ తెలుగు తమ్ముళ్లు విమర్శలు చేశారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, పవన్ కళ్యాణ్ సహా విపక్ష పార్టీలకు చెందిన కీలక నాయకులపై కేసులు పెట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలను టీడీపీ కూటమి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. “ఇలాంటి నెగెటివ్ పాలిటిక్స్‌ను ప్రజలు సమర్థించలేదు. చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా ఆ పార్టీకి ప్రజల్లో సానుభూతికి కారణమైంది” అని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.
5. దూరమైన దళితులు, క్రైస్తవులు, బీసీలు
వైఎస్ఆర్ సీపీ 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి దళితులు, క్రిస్టియన్లు, రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీలు కూడా కారణమనే విశ్లేషణలున్నాయి. ఈసారి ఈ వర్గాలు జగన్ కు దూరమయ్యారని ఓటింగ్ సరళిని బట్టి చూస్తే అర్ధమౌతుంది. బ్రదర్ అనిల్ కుమార్ క్రిస్టియన్లతో సమావేశాలు నిర్వహించి 2019 ఎన్నికల్లో జగన్ గెలుపునకు తనవంతు కృషి చేశారు. ఈసారి షర్మిల కోసం బ్రదర్ అనిల్ కుమార్ పనిచేశారు. రెడ్డి సామాజికవర్గం కూడా జగన్ కు పూర్తిగా మద్దతుగా నిలవలేదు. గత ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు టీడీపీ వైపు నుండి జగన్ వైపు మళ్లింది. అయితే ఈ సారి బీసీలు జగన్ వైపు నుండి తిరిగి టీడీపీ వైపు మళ్ళినట్లుగా భావించాల్సి వస్తోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire