Kuppam: సంక్షోభాలు ఎదురైనప్పుడు వాటిలోంచే అవకాశాలు సృష్టించడం తన తెలిసిన విద్య అంటారు.
Kuppam: సంక్షోభాలు ఎదురైనప్పుడు వాటిలోంచే అవకాశాలు సృష్టించడం తన తెలిసిన విద్య అంటారు. ఇవన్నీ తనకో లెక్క కాదంటారు. ఎంతో మంది నేతలను సృష్టించానంటూ ఎన్నో డైలాగులు పేల్చిన చంద్రబాబుకు రియల్ టైమ్‌లో మరి ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎక్కడ ఎలా ఉన్నా.. తనకు కంచుకోట అయిన కుప్పంలో కుదురుకోగలరా? అక్కడి సిచ్చివేషన్స్‌ను సరిదిద్దగలరా? ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో పాతికేళ్లు కూడా నిండని ఓ పసికూనతో జెండా పాతించిన వైసీపీ నేతలు కుప్పంలో బాబుకు ఇంకా స్కోప్ ఇచ్చారనే అనుకోవాలా? కొంప ముంచుతున్నారని భావించాలా? 2019 ఎన్నికల తరువాత చుట్టపు చూపుగా వస్తున్న బాబు తనకు మళ్లీ పట్టు చిక్కాలంటే అక్కడే తిష్ట వేయక తప్పని పరిస్థితులు వచ్చాయా? అసలు కుప్పంలో బాబు భవిష‌్యత్ ఏం చెబుతోంది?
ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంపై దృష్టి సారించక తప్పలా లేదు. అక్కడ వైసీపీ కాక పుట్టిస్తుంటే, పార్టీని ఏకం చేసి పునర్వైభవం తేవడానికి బాబు కేకేయాల్సిన రోజులు వచ్చేశాయంటున్నారు తమ్ముళ్లు.
తన కళ్ల ముందే తాను సృష్టించిన సామ్రాజ్యాన్ని హరిస్తున్న వేళ చేజారిపోతున్న పరిస్థితులను చక్కబెట్టడం కోసం చంద్రబాబుకు కుప్పానికి రాక తప్పదన్న విశ్లేషణలు సాగుతున్నాయి. వరస విజయాలతో క్యాడర్‌ను, లీడర్లను కన్ఫ్యూజన్‌లోకి నెట్టేస్తున్న వైసీపీ నుంచి దృష్టి మరల్చడానికి బాబు బాణాలు సిద్ధం చేసుకోవాలని పరిశీలకులు చెబుతున్నారు.
కుప్పం నియోజకవర్గంలో మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో తెలుగుదేశం హార్డ్‌కోర్ కార్యకర్తల్లో నిస్తేజం ఆవహించింది. అశనిపాతంగా మారాయి. ఈ పరిణామాలన్నీ కలిపి చంద్రబాబును ఇరకాటంలో పడేశాయి. సొంత పార్టీ నేతలను కూడా గట్టిగా దబాయించి పని చేయమనలేని స్థితిలోకి నెట్టేశాయి. ఎవరిని వేలెత్తి చూపాలన్నా తన వైపు మిగిలిన వేళ్లు చూపిస్తున్నాయన్న నిజాన్ని గమనించిన బాబు బయట బలంగా మాట్లాడటం లేదట.
గట్టిగా పోరాడుదాం అంటూ హితబోధకే పరిమితమవుతున్నారట. ఈ వరుస ఘటనలు చంద్రబాబును ఆలోచనలో పడేశాయంటున్నారు నేతలు. ఇక తమ ఫోకస్ అంతా కుప్పంపైనే అంటూ అక్కడి టీడీపీ క్యాడర్ కకావికలం అవడం ఖాయమంటూ చెబుతున్న వైసీపీ నేతలు కుప్పంలో బాబు పరిస్థితి దాదాపు బేజారే అంటూ పథకరచన చేస్తున్నారట.
అందుకే చినబాబు రాష్ట్రంపై దృష్టి పెడితే, పెదబాబు కుప్పంపై దృష్టిపెట్టారట. తనకు తెలిసిన మంత్రాంగాన్ని మొదలు పెట్టబోతున్నారట. టీడీపీకి అడ్డాగా ఉన్న కుప్పంలో 30 ఏళ్లుగా ఇతర పార్టీలకు చోటులేదు. తెలుగుదేశానికి ఎదురు లేదు. కానీ 2019 ఎన్నికల తరువాత పరిస్థితులు పూర్తిగా మారాయి. చంద్రబాబును ఫ్రీగా వదిలిపెడితే రాష్ట్రమంతా గెలుకుతాడని గుర్తించిన వైసీపీ హైకమాండ్ ఫోకస్ అంతా కుప్పంపైనే పెట్టిందట.
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పులివెందులను ప్రోగ్రెస్ రిపోర్టుతో కొట్టాలని చూస్తే ఇప్పుడు కుప్పం గూబ మీద కొట్టే ప్రయత్నం మొదలెట్టిందట వైసీపీ. కుప్పంలో తెలుగుదేశానికి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న సామాజిక వర్గాలను దాదాపు వశపరుచుకుంది. అధికారంతో కొడితే ఎవరైనా పడాల్సిందేననే ఆరోక్తిని నిజం చేసి చూపించింది. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు చాలామంది వైసీపీ కండువాలు కప్పుకోగా ఇంకొంత మంది సైలెంటైపోయారు. అతి కొద్దిమంది పార్టీ జెండా పట్టుకుని తిరుగుతున్నా వారిపై నిత్యం ఏదో ఒక రూపంలో బద్నాం కొనసాగుతోంది.
ఈ పరిస్థితులను ఏకరువుపెట్టిన క్యాడర్ తమరు దిగిరాకుంటే తప్పదని బాబుకు బలంగానే చెప్పారట. గతంలో బాబొస్తే జాబొస్తుందనే స్లోగన్‌లాగా మీరొస్తేనే మాకు ధైర్యమొస్తుందని నేతలు మొరపెట్టుకోవడంతో చంద్రబాబుకు రంగంలోకి దిగక తప్పడంలేదట. ఇక మీదట నెలకొసారో, రెండు మూడు నెలలకు ఒకసారో కుప్పంలో పర్యటించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని కూడా భావించినట్లుగా తెలుస్తోంది.
కుప్పంలోనే కాదు జిల్లావ్యాప్తంగా కూడా పార్టీ పరిస్థితి దారుణంగా తయారైన వేళ సీమలో వ్యూహాత్మకంగా ఫైట్ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై కసరత్తు చేస్తున్నారట. అంతోఇంతో అవకాశాలున్న చిత్తూరు జిల్లాలో పునరుత్తేజం జరగకపోతే రాబోయే ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు ఎదురు కాక తప్పదన్న నిజం చంద్రబాబులాంటి రాజకీయ దిగ్గజానికి తెలియంది కాదంటున్నారు తమ్ముళ్లు.
మరి ఇలాంటి పరిస్థితులను అధ్యయనం చేసిన చంద్రబాబు త్వరలోనే కుప్పంలో తిష్ట వేయబోతున్నారట. నియోజకవర్గంలోని లీడర్లందరితో సమాలోచన చేయబోతున్నారట. నేనేం చేయాలి.. మీరేం చేస్తారు అనే ఫార్ములాతో వస్తున్నారట. పోరాడితే పోయేదేమీలేదన్న నిజాన్ని నూరిపోయబోతున్నారట. ఇంత చేసినా ఒకప్పుడు కమ్యూనిస్టుల ఖిల్లాగా ఉన్న కుప్పంను టీడీపీ కార్ఖానాగా మార్చుకున్న చంద్రబాబు వ్యూహం ఇప్పుడు ఎలా పని చేస్తుందన్న అసలు ప్రశ్న.
మరి తన పర్యటనతో నాటి వైభవానికి బీజం వేస్తరా లేక బేజారుతో బజారున పడేస్తారా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఈ సంక్షోభం నుంచి కుప్పాన్ని ఎలా గట్టెక్కిస్తారో వేచి చూడాలి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire