ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కడ చూసినా యూత్ మంత్రమే వినిపిస్తోంది. స్థానిక క్యాడర్ అంతా యువనాయత్వానికే జై కొడుతున్న పరిస్థితే కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కాకలు తీరిన తండ్రుల రాజకీయ వారసత్వాన్ని అందుకోవటానికి, వారి కొడుకులు తెగ కష్టపడుతున్నారు
ప్రస్తుత రాజకీయాల్లో ఎక్కడ చూసినా యూత్ మంత్రమే వినిపిస్తోంది. స్థానిక క్యాడర్ అంతా యువనాయత్వానికే జై కొడుతున్న పరిస్థితే కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కాకలు తీరిన తండ్రుల రాజకీయ వారసత్వాన్ని అందుకోవటానికి, వారి కొడుకులు తెగ కష్టపడుతున్నారు. కానీ ఏపీలో ఒక యువనేత కష్టానికి కాలం అస్సలు కలసి రావటం లేదట, ఎంత శ్రమించినా ఆయనపై విమర్శలు మాత్రం విశ్రమించటం లేదట...ఏమా కథ..? ఎవరా నేత అంటారా...?
40 ఇయర్స్ ఇండస్ట్రీగా ఏపీ పాలిటిక్స్ లో సిన్సియర్ గా పిలుచుకునే నాయకుడు టిడిపి అధినేత చంద్రబాబు. ఒకప్పుడు జాతీయస్థాయిలోనూ ,ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆపై విభజన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ లోనూ చక్రం తిప్పిన లీడర్. ఇందులో డౌటనుమానం అస్సలవసరం లేదు. అయితే ఇంతటి గొప్ప లీడరైన చంద్రబాబు స్ట్రాటజీ ఈమధ్య ఎందుకో పెద్దగా వర్కవుట్ అవుతున్న దాఖలాలు కనిపించటం లేదు. ముఖ్యంగా 2014లో నవ్యాంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టిన తొలిముఖ్యమంత్రిగా, రికార్డు క్రియేట్ చేసిన చంద్రబాబు, తన పాత రికార్డును కాపాడుకోవటంలో విఫలమయ్యారన్న విమర్శల్ని మాత్రం మూటకట్టుకున్నారు. పార్టీ జెండా పట్టుకున్న వారిని పట్టించుకోకుండా, పక్కపార్టీల నుంచి వచ్చిన వారికే ప్రయారిటీ ఇచ్చి, ప్రజల్లో పార్టీకి ఆదరణ తగ్గేలా పనిచేశారన్న అపవాదును సైతం బాబు ఎదుర్కోవాల్సి వచ్చింది. చుట్టూ ఓ కోటరీని నమ్ముకుని వాస్తవ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకోకపోవటం వల్ల, చివరకు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందన్నది పార్టీ సీనియర్ల మాట.
దీంతో 2019 ఎన్నికల తర్వాత పార్టీలో యువనాయకత్వాన్ని పటిష్టం చెయ్యాలన్న చర్చ వినిపించింది. సీనియర్లంతా పార్టీ వల్ల లబ్ధి పొంది, పరాజయం పాలైన తర్వాత కొంతమంది అధికార పార్టీలోకి జంప్ చేయగా మరికొంతమంది సైలెంటయ్యి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. మరోవైపు అధికారపార్టీపై కోర్టుల్లో పోరాటం ఓవైపు జరుగుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన విధంగా అధికారపార్టీని ఇబ్బందిపెట్టలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌పై పార్టీలో ఓ వర్గం ఆశగా ఎదురుచూసింది. ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్ నాయకత్వం పార్టీకి అవసరమని ఆవర్గం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా చంద్రబాబు లాక్ డౌన్ సమయంలో జూమ్ మీటింగులకే పరిమితం కాగా, లోకేష్ మాత్రం క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈలోగా వచ్చిన భారీ వర్షాలు, వరదలు లోకేష్ నాయకత్వానికి ఒక అవకాశం కల్పించినట్లయింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల్ని పలకరిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్.
అయితే తాజాగా భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీళ్లలో దిగుతూ, బాధితుల భుజాలపై చేతులు వేస్తూ బురదనూ, వరదనూ లెక్కచేయక జిల్లాల్లో చేస్తోన్న పర్యటనలను చూసి బాబు ఏమో కానీ, పార్టీలో ఓవర్గం మాత్రం తెగ ఖుషీ అయ్యింది. ఇంకేం పార్టీకి మంచిరోజులొచ్చాయని ముందస్తు సంబరాలు సైతం తెగ చేసుకుంటోంది. కోవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతోన్న తరుణంలో, తమ నాయకుడు జనంలో చొరవగా తిరుగుతున్నారని సదరు బ్యాచ్ పండగ చేసుకుంటోంది.
అయితే తానొకటి తలిస్తే విధి మరోలా విచిత్రాలు చేస్తున్నట్లు పాపం లోకేష్‌కు కాలం ఇంకా కలిసిరానట్లుగానే కనిపిస్తోంది. పార్టీ భవిష్యత్ సారథి తానేననీ, తనలో ఆ సామర్థ్యం పుష్కలంగా ఉందని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకోవాలని భావించినప్పటికీ, టైమ్ మాత్రం అనుకూలించటం లేదని పార్టీలో మరోవర్గం భావిస్తోందట. ఇప్పటికే సోషల్ మీడియాలో లోకేష్ నాయకత్వంపై జరుగుతున్న చర్చ, వస్తోన్న ప్రతికూల కామెంట్లు ఇతరత్రా ట్రోలింగ్ పైన కూడా, ఈ వర్గం దిగాలుపడుతోందట. ఇక పశ్చిమగోదావరి జిల్లా సిద్దవరంలో తను నడుపుతోన్న ట్రాక్టర్ అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకుపోవటంతో ప్రమాదం బారి నుంచి తృటిలో తప్పించుకున్నారు. అయితే సోషల్ మీడియాలో అధికార వైసీపీ కార్యకర్తల ట్రోలింగ్స్ నుంచి, ఆ పార్టీ నేతల విమర్శల నుంచీ మాత్రం తప్పించుకోలేక పోయారు లోకేష్.
మొత్తంగా ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా ఏంటి..? అన్న లోకేష్ మామ బాలయ్యబాబు సినిమా డైలాగ్ లాగానే ఉందట ప్రస్తుత టిడిపి నేతల పరిస్థితి. తమ అంచనాలకు తగ్గట్టుగా లోకేష్ వీలైనంత త్వరగా, పార్టీ పగ్గాలు చేపట్టాలని వారు భావిస్తున్నారు. లోకేష్ కూడా అందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ చివరకు ట్రాక్టర్ నడపలేనివ్యక్తి, సైకిల్ నడపగలడా అన్న విమర్శల్నీ చవిచూస్తున్నారు. అయితే గతంలో కంటే చాలావరకూ మెరుగ్గా కనిపిస్తోన్న లోకేష్, తాజా విమర్శలకు సైతం జవాబిచ్చి ధీటుగా నిలబడగలరా...? ఎంతో బలంగా కనిపిస్తున్న వైసీపీతో తలబడగలరా...? చూద్దాం ఏం జరుగుతుందో...అప్పటి వరకూ లోకేష్ మాత్రం ఆవిధంగా ముందుకుపోవాల్సిందేనంటున్నారు తమ్ముళ్లు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire