Andhra Pradesh: దేవుడి మాన్యాలపై సర్వే

Survey on Gods Grants
x

Drone Serveying

Highlights

Andhra Pradesh: దేవుడి మాన్యాలపై సర్వే..ఆక్రమణలను తొలగించేందుకు దేవాదాయ శాఖ అధికారుల ప్రయత్నం....

Andhra Pradesh | ఇంతవరకు దేవుడి భూములంటే అందరికీ చులకనే. ఒక్కసారి కౌలుకు తీసుకుంటే మరి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నామ మాత్రం కౌలు చెల్లించి, జీవితాంతం సాగు చేసుకుని హాయిగా జీవించొచ్చు. ఎందుకంటే ఈ వ్యవహరాన్ని అడిగేందుకు దేవాదాయ శాఖ అధికారులు ముందుకు రారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ భూములు సాగు చేసుకుంటున్న వారు ఏదో పార్టీకి చెందిన ప్రతినిధి అయి ఉండవచ్చు. దీంతో అధికారులు కిక్కురుమనరు. ఇక ఆక్రమణల విషయంలోనూ ఇదే తంతు. ఈ భూములను ఏం చేసినా అడిగే వారుండరు. ఏదో ఒక అధికారి ధైర్యం చేసి కోర్టులో కేసు వేస్తే అది తరాల తరబడి కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి తరుణంలో వేల ఎకరాల దేవుడి మాన్యం అక్రమణకు గురైనట్టు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం ఈ ఆక్రమణల చెర నుంచి విడిపించేందుకు ప్రయత్నం ప్రారంభించింది. ముందుగా డ్రోన్ల ద్వారా సర్వే చేసి, ఆక్రమణలు గుర్తించాక, తొలగింపుల కార్యక్రమం చేపడతారు.

రాష్ట్రంలో దేవుడి మాన్యాల ఆక్రమణలను గుర్తించేందుకు డ్రోన్ల ద్వారా ప్రత్యేక సర్వే నిర్వహించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. దేవదాయ శాఖ పరిధిలోని దాదాపు 22 వేల ఆలయాలు, సత్రాలు, మఠాల పేరిట 4,09,229.99 ఎకరాల భూమి ఉండగా 67,525.06 ఎకరాలు ఏళ్ల తరబడి ఆక్రమణదారుల చెరలోనే ఉన్నాయి. 3,613.62 ఎకరాలను లీజుకు తీసుకున్న కౌలుదారులు నిర్ణీత గడువు ముగిసినా ఖాళీ చేయడం లేదు.

► ఆక్రమణలకు గురైన భూముల్లో డ్రోన్లతో సర్వే నిర్వహించి ఆలయాలవారీగా రికార్డులను సిద్ధం చేసేందుకు దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం సన్నద్ధమైంది.

► రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న డ్రోన్‌ కార్పొరేషన్‌ – దేవదాయ శాఖ అధికారుల మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయి. డ్రోన్లతో చిత్రీకరించిన ఫోటోలు, వీడియోల ఆధారంగా తదుపరి దశలో చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్‌ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories