Spiritual Tourism in Kurnool: కరోనా కాటుతో కర్నూలు జిల్లా పుణ్యక్షేత్రాలు విల..విల!
Spiritual Tourism in Kurnool: కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక వనంగా వర్ధిల్లుంతోంది. పండుగలు వచ్చినా.. సెలవులు దొరికినా.. తెలుగు రాష్ట్రాల ప్రజలు కర్నూలు బాట పట్టాల్సిందే..
Spiritual Tourism in Kurnool: కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక వనంగా వర్ధిల్లుంతోంది. పండుగలు వచ్చినా.. సెలవులు దొరికినా.. తెలుగు రాష్ట్రాల ప్రజలు కర్నూలు బాట పట్టాల్సిందే.. ఓ వైపు ప్రకృతి రమణీయత, మరోవైపు ఆధ్యాత్మికత వెరసి పర్యాటకులు, భక్తులను ఆకర్షిస్తోంది కర్నూలు జిల్లా. నిత్యం సందడితో కనిపించే జిల్లాను ఇప్పుడు కరోనా కాటేసంది. భక్తులు లేక కోవెలలు వెలవెలబోతున్నాయి. యాత్రికులు లేక పర్యాటకకేంద్రాలు కళతప్పి కనిపిస్తున్నాయి. చివరకు ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుతున్న జిల్లా ఆలయాలు.
స్వయంభూగా వెలసిన దేవదేవుడు, సహజసిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలు.. రాయలసీమ ముఖద్వారంలోనే దర్శనమిస్తుంటాయి. వీటిని వీక్షించేందుకు, దర్శించేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా కర్నూలు జిల్లాకు తరలివస్తుంటారు. యాత్రికులు, భక్తుల రద్దీ పెరిగేకొద్దీ జిల్లాలో కొలువైన ఆలయాలన్నీ దినదినాభివృద్ధి చెందాయి. నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఆలయాలు కళకళాడుతుండేవి. ఇక పండుగ వేళ, పర్వదినాల్లో భక్తుల సంఖ్య లక్షలకు చేరుకుంటుంది. వారు సమర్పించే ముడుపులు, కానుకలు ఆలయాలకు ఆదాయ వనరులుగా మారాయి.
నిత్యం యాత్రికులు, భక్తులతో కళకళాడిన కర్నూలు జిల్లా ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. పుణ్యక్షేత్రాలకు పుట్టినిళ్లైన కర్నూలు జిల్లా ఇప్పుడు నిర్మానుష‌్యంగా దర్శనమిస్తోంది. దీంతో ఆలయాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. చివరకు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరుకున్నాయి. ఇదంతా కరోనా రక్కసి సృష్టించిన భయానక పరిస్థితులే.
ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కొలువైన మహిమాన్విత పుణ్యక్షేత్రం.. శ్రీశైలం. ఆదిదేవుడు స్వయంభూగా వెలిశాడు. భ్రమరాంబికాదేవి శక్తిపీఠమై భక్తులకు దర్శనమిస్తోంది. దీంతో ఈ క్షేత్రానికి దేశ విదేశాల నుంచి సైతం భక్తులు తరలివస్తారు. మొక్కులు చెల్లించి మోక్షం పొందుతారు. కానీ ఇప్పుడు శ్రీశైల పుణ‌్యక్షేత్రానికి కరోనా సెగ తగిలింది. కరోనా విజృంభిస్తున్నందున భక్తులు శ్రీశైల యాత్రను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో శ్రీశైలంలో భక్తుల సందడి కనిపించడం లేదు. వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.
శ్రీశైల మల్లన్న దర్శనభాగ్యాన్ని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. శ్రీశైల యాత్రను ప్రతి యాత్రికులు ఇష్టపడతారు. కార్తీకమాసం వచ్చినా.. శివరాత్రి వచ్చినా భక్తులు లక్షలాదిగా శ్రీశైలంలో వాలిపోతారు. ఈ ఆలయ వార్షిక ఆదాయమే 250 కోట్లు. ఈ ఆలయంలో 295 మంది శాశ్వత ఉద్యోగులు, 215 మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు వెయ్యి మంది పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బంది పనిచేస్తున్నారు.
నిత్యం భక్తులతో సందడిగా కనిపించే శ్రీశైలం దేవస్థానంపై కరోనా ప్రభావం పడింది. కరోనా కేసులు పెరుగుతున్న కొద్దీ శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఆలయ పరిసరాలన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో భక్తులను ఎవరిని అనుమతించలేదు. కేవలం అర్చకులు స్వామివారికి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. దీంతో శ్రీశైల ఆదాయం గణనీయంగా పడిపోయింది. పని చేసే సిబ్బందికి, ఇతర ఖర్చులకు దేవస్థానం నెలకు 3కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తోంది. సరైన ఆదాయం లేక సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేకపోతోంది దేవస్థానం.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు సవరించిన తర్వాత శ్రీశైల ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఆలయ ప్రవేశానికి భక్తులను అనుమతించారు. పది సంవత్సరాలలోపు పిల్లలకు 60 ఏళ్లు దాటిన వృద్ధులకు అవకాశం కల్పించలేదు. మరోవైపు ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న వారికి మాత్రం స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. ఇలా నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో భక్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
శ్రీశైల దేవస్థానానికి తలనీలాలు, కొబ్బరిచిప్పలు, ఆర్జిత సేవా టికెట్లు, అతిశీఘ్ర దర్శన టికెట్లు, విరాళాలు, లడ్డు విక్రయ కేంద్రాలు, clock రూమ్, దేవస్థానం దుకాణాల అద్దెలు, విభూది విక్రయ కేంద్రాలు, సామూహిక అభిషేకాలు, టోల్ గేట్లు వంటివి ఆదాయ మార్గాలుగా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో వీటి ఆదాయాలన్నీ ఆగిపోయాయి. బ్యాంకులో డిపాజిట్ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు, బంగారం, భక్తుల నుంచి ఆన్ లైన్ సేవల ద్వారా వచ్చే ఆదాయంతో శాశ్వత ఉద్యోగులకు 60శాతం జీతాలు చెల్లిస్తోంది దేవస్థానం.
ఒక్కో శ్రీశైల దేవస్థానంలోనే కాదు కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల పరిస్థితి ఇలానే కొనసాగుతోంది. మహానంది, అహోబిలం, బ్రహ్మాంగారి మఠం, మంత్రాలయం భక్తులు లేక కళతప్పి కనిపిస్తున్నాయి. ఆలయాల్లో నిత్య కైంకార్యాలు తప్పా.. దర్శనాలు లేవు. పుణ్యస్నానాలు ఉండవు. మొక్కుల సమర్పణకు అవకాశమే లేదు. అన్ని ఆలయాలు ఆదాయం లేక అయోమయంలో పడ్డాయి.
మహానందికి వచ్చిన భక్తులను అక్కడ ఉన్న కోనేరు ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. ఆ జలధారలో పుణ్యస్నానాలు చేసి భక్తులు పులకించిపోతారు. ప్రకృతి అందాల వీక్షణం, దేవదేవుడి దర్శనం కోసం మహానందికిగా భారీగా భక్తులు, యాత్రికులు తరలివస్తారు. కానీ ఇప్పుడు కరోనా యాత్రికలను కట్టడి చేసింది. బస్సు సర్వీస్ లను కూడా నిలిపివేశారు. దీంతో మహానందిలో అడుగు పెట్టేవాళ్లే కరువయ్యారు. భక్తుల రాకపోకలు లేకపోవడంతో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు, షాపు యజమానులు సైతం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కర్నూలు జిల్లాలో మరో పుణ్యక్షేత్రం యాగంటి. ప్రకృతి రమణీయతకు, ఆధాత్మికతకు చక్కని చిరునామా. కాకి సంచరించని క్షేత్రంగా వర్ధిల్లుంతోది. ఆలయ సమీపంలో ఉన్న కోనేరులు, రాతి కొండల అందాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అందుకే ఈ ఆలయానికి ప్రతి నెల లక్షల్లో భక్తులు వస్తుంటారు. కానుకలు, ముడుపుల రూపంలో పది లక్షల రూపాయాల వరకు ఆదాయం వస్తోంది. ఇక శ్రావణమాసం వస్తే ఆ ఆదాయం రెట్టింపవుతుంది. కానీ కరోనా మహమ్మారి భక్తుల రాకను నిలువరించింది.
నల్లమల అడవుల్లో ఆధ్యాత్మికత పరిమళాలను వెదజల్లుతున్న క్షేత్రం అహోబిలం. హిరణ్యకశిపుని సంపాదన కోసం నరసింహస్వామి స్వయంగా వెలసిన ఈ ప్రాంతం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయ దర్శనం భక్తులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది. కొండల నుంచి సహజ సిద్ధంగా జాలువారే భవనాశి నది యాత్రికులకు కనువిందు చేస్తోంది. అందుకే ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు పదే పదే వస్తుంటారు. అయితే ఈ ఆలయంలో పని చేసే అర్చకులకు కరోనా సోకడంతో ఆలయాన్ని పూర్తిగా మూసివేశారు. కేవలం స్వామివారి కైంకర్యాలను మాత్రమే నిర్వహిస్తున్నారు. చాలా మంది భక్తులు ఈ సమాచారం లేక నిరుత్సాహంగా వెనుతిరుగుతున్నారు.
జిల్లాలో మరో మహిమాన్విత క్షేత్రం మంత్రాలయం. ఇక్కడ కొలువైన రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు ఎక్కువగా తరలివస్తుంటారు. కానీ కరోనా రక్కసి ఈ ఆలయ ఆదాయాన్ని కూడా అడ్డుకుంది. ఆలయ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ధైర్యం చెప్పినా కొత్త తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది భక్తులు ఆలయాల సందర్శన చేయటం లేదు... మరోవైపు దేవుడి ఆ భక్తుల్లో భయాన్ని పుట్టించింది. దీంతో ఈ ఆలయ ఆదాయం పూర్తిగా ఆగిపోయింది.
అయితే ఇదే పరిస్థితి మరో ఆరు నెలల పాటు కొనసాగితే. ఆలయాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక వేళ అదే జరిగితే.. అర్చకులు, ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఎదురవుతాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire