సిక్కోలు రాజకీయాన్ని వణికిస్తున్నదేంటి?

సిక్కోలు రాజకీయాన్ని వణికిస్తున్నదేంటి?
x
Highlights

ఉద్యమాల ఖిల్లాగా పేరొందిన శ్రీకాకుళం జిల్లా మరో ఉద్యమానికి వేదిక కానుందా ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ చెప్పిన మాటపై, ఆ జిల్లా వాసులు ఎందుకు గుర్రుగా...

ఉద్యమాల ఖిల్లాగా పేరొందిన శ్రీకాకుళం జిల్లా మరో ఉద్యమానికి వేదిక కానుందా ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ చెప్పిన మాటపై, ఆ జిల్లా వాసులు ఎందుకు గుర్రుగా ఉన్నారు పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లా చేస్తే సిక్కోలుకు పొంచి ఉన్న ముప్పేంటి? కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో శ్రీకాకుళం జిల్లా స్వరూపం ఎలా ఉండబోతోంది..? రాజకీయ ప్రకంపనలేంటి?

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన డిమాండ్ చాలా కాలంగా ఉంది. టీడీపీ హయాంలో మూడుసార్లు ప్రతిపాదనల వరకూ వచ్చిన ఈ ప్రక్రియ, నిలిచిపోయింది. కాగా వైసీపీ అధినేత జగన్ సైతం అధికారంలోకి వస్తే ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తానని అనేకమార్లు ప్రకటనలు చేశారు. మెజార్టీ స్థానాలు సాధించి వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ దీనిపై కదలిక వచ్చింది. అయితే ఇప్పుడు ఇదే అంశం శ్రీకాకుళం జిల్లాలో అగ్గిరాజేస్తోంది.

ఇదిలా ఉంటే పాలనాపరమైన సౌలభ్యం కోసం నూతన జిల్లాలు ఏర్పాటు చేయాలని కొత్త ప్రభుత్వం కసరత్తు మొదలెట్టినట్టు సమాచారం. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా తీర్చిదిద్దుతామని వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా స్పష్టం చేసిన నేపథ్యంలో, ఇప్పుడు ఆ అంశంపై ఫోకస్ పెట్టారట. అయితే దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే నివేదిక రూపకల్పన చేసి అమరావతికి పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రతీ పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లా చేస్తే శ్రీకాకుళం జిల్లా మూడుగా విడిపోనుంది. జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానం ఉండగా, ఇప్పటికే పాలకొండలోని ఏజెన్సీ ప్రాంతమైన సీతంపేట, అరకు పార్లమెంట్ సెగ్మెంట్ క్రిందకి అలాగే ఎచ్చెర్ల, రాజాం నియోజకవర్గాలు విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ క్రింద ఉన్నాయి. అంటే ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడితే జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం, అరకు జిల్లాకి వెళ్ళిపోగా, రాజాం, ఎచ్చెర్ల నియోజకవర్గాలు విజయనగరం జిల్లాకు తరలిపోతాయి. ఇక ఈ తరుణంలో శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, టెక్కలి, పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలతో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తారు.

ఇదే జరిగితే జిల్లాకు చెందిన ఆదాయాన్ని అందించే అనేక వనరులు తరలిపోయినట్టేనని, అధికారులు, స్థానిక రాజకీయ నేతలు అంటున్నారు. ముఖ్యంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న అంబేద్కర్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థ , జిల్లాలో అనేక మందికి ఉపాధిని కల్పిస్తున్న పైడిభీమవరంలో ఉన్న ఇండస్ట్రియల్ కంపెనీలు, కొవ్వాడ అనువిధ్యుట్ ప్లాంట్, జిల్లాలో మొట్టమొదటి ఇండస్ట్రియల్ కారిడార్‌గా ఉన్న రాజాం నియోజకవర్గంలోని ఇండస్ట్రీలు, GMR విద్యాసంస్థలు, పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేట నుంచి వచ్చే ఆదాయ వనరులకు గండి పడినట్టే. దీంతో ఇపటికే వెనుకబడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళం మరింత వెనుకబాటుతనానికి గురికానుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే మరో ఉద్యమం తప్పదన్న సంకేతాలు అందుతున్నాయి. కొందరు స్థానిక రాజకీయ నాయకులు దీనికి ఉద్యమరూపాన్నిచ్చి, జనంలోకి వెళ్లాలని వ్యూహాలు రచిస్తున్నారట. చూడాలి చివరికి ఏమవుతుందో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories