తెలుగు రాష్ట్రాల్లో ఆముగ్గురు! పొరుగు పార్టీ ఇంపు..సొంత పార్టీల్లో లేపుతున్నారు కంపు!

తెలుగు రాష్ట్రాల్లో ఆముగ్గురు! పొరుగు పార్టీ ఇంపు..సొంత పార్టీల్లో లేపుతున్నారు కంపు!
x
Highlights

వారికి సొంత ఇంట్లో వంటకం అసలు నచ్చదు. పొరుగింటి పుల్లకూరే సూపర్ టేస్టు. ఇంట్లో బిర్యానీ వండినా పది రకాల పేర్లు పెడతారు. కానీ పక్కింట్లో పచ్చడి మెతుకులను తెగ పొగిడేస్తారు.

వారికి సొంత ఇంట్లో వంటకం అసలు నచ్చదు. పొరుగింటి పుల్లకూరే సూపర్ టేస్టు. ఇంట్లో బిర్యానీ వండినా పది రకాల పేర్లు పెడతారు. కానీ పక్కింట్లో పచ్చడి మెతుకులను తెగ పొగిడేస్తారు. రకరకాల కూరలు వండినా, బయటి జనం ఆహా ఏమి రుచి అంటూ ఆరగిస్తున్నా, వారికి మాత్రం పగోడి ఇంట్లో పకోడీలు అంటేనే యమ ఇష్టం. ఇంతకీ సొంతింట్లోని వంటింట్లో ప్రాబ్లముందా లేదంటే ప్రత్యర్థి ఇంట్లోని విందుపైనే వారికి మనసు లాగుతోందా? ఇది ముగ్గురు నాయకుల కథ. అరవీర యోధుల్లాంటి రాజకీయ నాయకుల కథ. వారి జిహ్వ చాపల్యం వెనక అసలు కథేంటో వారిక్కావాల్సిన వంటకం ఏంటో, ఒకసారి లుక్కేయండి.

ఔను. ఆ ముగ్గురు. ముగ్గురంటే ముగ్గురు. ముగ్గురికీ, ఒకరికి ఒకరు అసలు సంబంధమే లేదు.

రఘురామ కృష్ణంరాజేమో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు. డి.శ్రీనివాసేమో టీఆర్ఎస్‌ నుంచి రాజ్యసభ సభ్యుడు. ఇక రాపాక వరప్రసాదేమో, జనసేన నుంచి ఏకైక ఎమ్మెల్యే. ముగ్గురూ వేరువేరు. కానీ ముగ్గుర్నీ ఒక కామన్‌ పాయింట్ మాత్రం కలుపుతోంది. అదే సొంత పార్టీపై కోపం, ప్రత్యర్థి పార్టీపై ప్రేమ.

మొదట పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కథ చూద్దాం. 2019లో తొలిసారి ఎంపీగా గెలిచారు. కొన్ని రోజులు సొంత పార్టీ వైసీపీతో బాగానే వున్నారు. కానీ రానురాను రాజుగారు భలే మొండిగా తయారయ్యారు. ఢిల్లీ గాలి ప్రభావమో, ఫ్యాన్‌ కింద ఉక్కపోత ఎక్కువైందో కానీ, సొంత పార్టీపైనే కారాలు మిరియాలు నూరడం మొదలుపెట్టారు. గోదావరి ఎటకారానికి, కారాలు, మిరియాలు జత చేసి, అధినేత మొదలు, పార్టీ విధానాలు, నిర్ణయాలు, పథకాలపై ఓ రేంజ్‌లో విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు.

వైసీపీని విమర్శిస్తూ, బీజేపీని వెనకేసుకొస్తూ, వ్యాఖ్యానాలు చేయడం, కొన్ని రోజుల నుంచి మీడియాలో హెడ్‌లైన్స్‌గా మారింది.

తాజాగా, పార్క్‌ హయత్‌ హోటల్‌లో బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌, ఏపీ ఎన్నికల మాజీ ప్రధానాధారికారి నిమ్మగడ్డ రమేష్‌ సమావేశంపైనా, తనదైన స్టైల్లో కామెంట్లు చేసి, సొంత పార్టీని మళ్లీ ఇరుకునపెట్టారు. రహస్యంగా సమావేశమయ్యారు, ఇదిగో చంద్రబాబు లింకు అంటూ వైసీపీ ఓ రేంజ్‌లో చెలరేగిపోతుంటే, రఘురామ రాజు మాత్రం, పార్టీ లైన్‌కు విరుద్దంగా మాట్లాడారు. కలిస్తే తప్పేంటన్న అర్థంలో మాట్లాడారు. మొన్నటి వరకు ఓపికపట్టినట్టు వున్న వైసీపీ అధిష్టానం, బహుశా ఈ పరిణామంతో మరింత ఆగ్రహమైనట్టుంది. కారణం ఇదే చూపకపోయినా, షోకాజ్ నోటీసు మాత్రం రాజుకు ఇచ్చింది. పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీస్ జారీ చేసింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో తెలిపింది. ఇక తదుపరి మరిన్ని చర్యలు తప్పవన్న సంకేతాలూ అందుతున్నాయి.

వైసీపీతో ఇష్టంలేని కాపురం చేస్తున్నట్టు కనపడ్తున్న రఘురామాకు త్వరలో విడాకులు మంజురయ్యేట్టున్నాయి. కమలంతో కల్యాణానికి లైన్‌ క్లియర్‌ అయ్యేలా వుంది. బహుశా ఆయనకు కావాల్సింది కూడా అదేనేమో.

ఇక డి. శ్రీనివాస్ కథ. ఇప్పుడు డీఎస్‌ ఏ పార్టీలో వున్నారో టక్కున చెప్పమంటే, రాజకీయ విశ్లేషకులు సైతం బుర్ర బద్దలుకొట్టుకోవాల్సిందే. ఆయన టీఆర్ఎస్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, మరి ఆయన టీఆర్ఎస్‌ కథా అంటే, మరెందుకు పార్టీ కార్యక్రమాల్లో కనిపించరు అన్న ప్రశ్న వస్తుంది. బీజేపీ నేతలను ఎందుకు కలుస్తున్నారంటూ మరో ప్రశ్న కూడా దూసుకొస్తుంది. అలాగని డీఎస్‌ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చెయ్యలేదు. పార్టీ సైతం సస్పెండ్ చెయ్యలేదు. టెక్నికల్‌గా ఆయన టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు. కానీ ఆయన మనసు మాత్రం కొడుకు ప్రాతినిధ్య వహిస్తున్న కాషాయం వైపు లాగుతోందన్న చర్చ మాత్రం బాగా జరుగుతోంది.

టీఆర్ఎస్‌ నేతలే ఈమధ్య ఆయనపై నేరుగా ఘాటైన కామెంట్ల్ చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత సీనియర్ నేతగానే కాకుండా పీసీసీ ఛీఫ్, మంత్రిగా కీలక పదవులు చేపట్టారు డి.శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన సీనియారిటిని గుర్తిస్తూ, గులాబీ బాస్ రాజ్యసభ సభ్వత్వం కూడా ఇచ్చారు. అయితే నిజామాబాద్ రాజకీయాల్లో ఏం జరిగిందో కాని, ఒక్కసారిగా అక్కడి నేతలంతా కవిత నేతృత్వంలో నాటి మంత్రి, నేటి స్పీకర్ పోచారంతో పాటు అంతా డీఎస్‌కు వ్యతిరేకంగా గళం వినిపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని డీఎస్‌పై, కేసీఆర్‌కు లేఖ రూపంలో ఫిర్యాదు చేశారు. దీంతో టీఆర్ఎస్‌లో డీఎస్‌ను దూరం పెట్టారు. నిజామాబాద్‌లో కవిత ఓడిపోవడం, డీఎస్ తనయుడు అర్వింద్‌ గెలుపొందడంతో, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు డీఎస్‌ పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానించిన నేతలు, మరింతగా స్వరం పెంచారు.

డీఎస్‌ కూడా పార్టీలో విభేదాల కారణంగా కొంతకాలంగా టీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. ఒకానొక దశలో ఆయన పార్టీని వీడుతారన్న ప్రచారం కూడా జరిగింది. తనపై వచ్చిన లేఖలోని ఆరోపణలను రుజువు చేయాలంటూ, పార్టీ అధినేతకు డీఎస్ లేఖ రాయడంతో అప్పట్లో టీఆర్ఎస్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో డీఎస్‌పై చర్యలు తీసుకుంటారని భావించినప్పటికీ కేసీఆర్ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అయితే, అతి త్వరలో డీఎస్‌పై ఏదో ఒక యాక్షన్‌ తప్పదన్న చర్చ మాత్రం జరుగుతోంది. డీఎస్‌ కూడా కొడుకు బాటలోనే కాషాయ గూటికి చేరుతారన్న ప్రచారమూ సాగుతోంది.

ఇక రాపాక వరప్రసాద్‌ తీరు కూడా అంతే. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా మోస్ట్‌ పాపులర్‌ అయ్యారు. కానీ వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒకవిధంగా స్పందిస్తుంటే, రాపాక మాత్రం డిఫరెంట్‌గా రియాక్ట్‌ అవుతున్నారు.

జగన్‌ సర్కారును పవన్‌ విమర్శలతో దెప్పిపొడుస్తుంటే, రాపాక మాత్రం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కానీ రాపాకపై మాత్రం, ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు జనసేన.

ఇదీ ముగ్గురు నేతల కథ. గెలిచింది ఒక పార్టీలో, మనసు మాత్రం మరొక పార్టీపై. అటు పార్టీ నేతలు మాత్రం వీరిని విమర్శిస్తుంటారు. కానీ అధిష్టానాలు మాత్రం వీరిని ఏమీ అనవు. సస్పెన్షన్ వేటు వేస్తే, మరింత రెచ్చిపోవడానికి లైసెన్స్‌ దొరికినట్టు అవుతుంది. సదరు ముగ్గురు నేతలకు కావాల్సింది కూడా అదే. ఎందుకంటే, సస్పెన్షన్ వేటు వేస్తే, వారు స్వతంత్ర సభ్యులవుతారు. ఆ రకంగా చట్టసభల్లో, సదరు పార్టీలకు బలం తగ్గిపోయినట్టవుతుంది. అందుకే సస్పెన్షన్ వెయ్యకుండా హైకమాండ్‌లు ఓపికపడుతున్నాయి. ఆ సహనానికే పరీక్ష పెట్టి, సస్పెన్సన్‌ ముద్ర వేయించుకోవాలన్నది నేతల వ్యూహంగా కనిపిస్తోంది. అదీ ముగ్గురు నేతల కథ.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories