సామాజిక వర్గమే ఆ సీనియర్ నేతకు చేటు చేసిందా మంత్రి పదవి ఆ నేతకు కలగానే మిగిలిపోవడానికి హైకమాండ్ అపనమ్మకమే కారణమా పార్టీని నమ్ముకుని వున్నా...
సామాజిక వర్గమే ఆ సీనియర్ నేతకు చేటు చేసిందా మంత్రి పదవి ఆ నేతకు కలగానే మిగిలిపోవడానికి హైకమాండ్ అపనమ్మకమే కారణమా పార్టీని నమ్ముకుని వున్నా ఉత్తరాంధ్రాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పినా, అదృష్టం అందుకే కలిసిరాలేదా? మొన్నటి వరకూ బీజేపీకి ఫేస్‌గా మారిన ఆ నాయకుడు, ఇప్పుడెందుకు ఫేస్ దాచుకుంటున్నారు ఆ లీడర్ మౌనానికి కారణమేంటి?
కంభంపాటి హరిబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బిజేపికి బ్రాండ్ అంబాసిడర్ పరిచయం అక్కరలేని పేరు. బీజేపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన హరిబాబు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోనికి తీసుకువెళ్లేందుకు, బీజేపి ప్రతిష్టను పెంచేందుకు చాలా కృషి చేశారు. కానీ ఆంధ‌్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను బీజేపీలో తుంగలో తొక్కడంతో, ప్రజల దృష్టిలో విలన్‌గా మారారు హరిబాబు.
2014 నుంచి ఐదేళ్ల పాటు ఏపీలో బీజేపీకి ఫేస్‌గా చక్రంతిప్పిన హరిబాబు, ఇప్పడు కాగడా పెట్టి వెతికినా కనపడ్డంలేదు. రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినా, హరిబాబు ఉలుకూపలుకూ లేదు. బీజేపీ అధిష్టానం ఈయనను దూరం పెట్టిందా ఈయనే దూరం జరిగాడా అన్నది ఆయన అభిమానులెవరికీ బోధపడ్డంలేదట.
అయితే బీజేపీ హైకమాండే హరిబాబును దూరం పెట్టిందన్న యాంగిల్‌లో, కొన్ని విషయాలు ఔననే సమాధానమిస్తున్నాయి. హరిబాబు మీద అపనమ్మకమే అందుకు కారణమన్నది ఒక వాదన. ఎందుకంటే, హరిబాబు కమ్మ సామాజిక వర్గం. గత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే వర్గం. దీంతో ఇద్దరి మధ్య రహస్య స్నేహముందని బీజేపీలో చర్చ.
దీనికి తగ్గట్టుగానే హరిబాబు కూడా చంద్రబాబును పల్లెత్తు మాటా అనేవారుకాదు. విభజన హామీలను బీజేపీ ప్రభుత్వం పక్కనపెట్టిందని, టీడీపీ అరిచి గీపెట్టినా, ఉద్యమస్థాయిలో ఆందోళన చేస్తున్నా, రాష్ట్రంలో కీలక నేతగా, బీజేపీ ఎంపీగా వాటిని తిప్పికొట్టడంలో హరిబాబు వెనకబడ్డారని మోడీ, అమిత్ షాలు రగిలిపోయారట. దీనికి తోడు చంద్రబాబు, జగన్‌లతో పోటీగా హరిబాబు మాస్ లీడర్ కాకపోవడం కూడా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి కారణమని, అదే పార్టీలో నేతలు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబుతో రహస్య స్నేహం ఆరోపణలు, టీడీపీ విమర్శలను సమర్థంగా తిప్పికొట్టకపోవడం, పార్టీ బలోపేతానికి బీజేపీ తరహాలో దూకుడుగా వ్యవహరించకపోవంతో, చివరికి హరిబాబు మంత్రి పదవి ఆశను కూడా బీజేపీ అధిష్టానం నెరవేర్చలేకపోయిందని మాట్లాడుకుంటున్నారు కాషాయ నేతలు.
బీజేపీ మొదటి విడతలోనే హరిబాబుకు దాదాపు ఖరారు అయిందనుకున్న మంత్రి పదవి చేజారడం, రాష్ట్ర అధ్యక్షుని పదవి నుంచి హారిబాబును తప్పించి కన్నా లక్ష్మీనారాయణకు పగ్గాలు అప్పగించడంతో హారిబాబు మనస్థాపం చెందారన్నది రాజకీయవర్గాల్లో మరో వాదన.
అందుకే 2019 ఎన్నికలో ప్రత్యక్ష పోటీకి హరిబాబు దిగలేదని, పార్టీకి విధేయుడుగా వున్నా ఫలితం దక్కలేదన్న ఆవేదన ఆయనలో వుందన్నది పబ్లిక్ టాక్. అయితే పార్టీ కార్యక్రమాలకు అడపాదడపా హాజరు అవుతున్నా, పూర్తిస్థాయిలో హారిబాబు ఫోకస్ చేయకపోవడం, పైగా మౌనం మాత్రమే సమాధానం అన్న వ్యవహారా శైలిని ప్రదర్శించడం, పార్టీలో హాట్ టాపికయ్యింది. ఆయన మౌనానికి కారణాలు ఇవేనా, లేదంటే అంతకుమించి ఉన్నాయా అన్నది ఎవరికీ అర్థంకావడం లేదు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire