పేదింట విరిసిన విద్యా కుసుమం.. పట్టుదలతో చదివి MBBS సీటు సాధించిన షమీనా

Shamina Studied Hard And Got MBBS Seat
x

పేదింట విరిసిన విద్యా కుసుమం.. పట్టుదలతో చదివి MBBS సీటు సాధించిన షమీనా 

Highlights

Adoni: పుట్టింది పేద కుటుంబం... ప్రతిభ చాటుకునే సమయంలో ఎన్నో అవాంతరాలు... చుట్టుముట్టూ ఎన్నో సమస్యలు ఎదురు అయినా ఆ చదువుల తల్లి డీలా పడలేదు...

Adoni: పుట్టింది పేద కుటుంబం... ప్రతిభ చాటుకునే సమయంలో ఎన్నో అవాంతరాలు... చుట్టుముట్టూ ఎన్నో సమస్యలు ఎదురు అయినా ఆ చదువుల తల్లి డీలా పడలేదు... అంది వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుని తన ప్రతిభ చాటింది.. డాక్టర్ కోర్స్ చదవాలి అంటే... లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకోవాలి... అయినా ఫలితం వస్తుందన్న నమ్మకం లేదు... ఇది వాస్తవ పరిస్థితి... కానీ ఓ నిరుపేద యువతి ఎలాంటి శిక్షణ లేకుండా MBBS సీట్ సాధించి ఔరా అనిపించింది.

ఈ విద్యా కుసుమం పేరు షమీనా. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని పట్టణం శంకర్‌నగర్లో ఉంటుంది. ఇప్పుడు అద్భుత ప్రతిభ కనబరిచి ఎందరో విద్యార్ధులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆదోనిలోని శంకర్‌నగర్‌ బీసీ కాలనీకి చెందిన హుసేన్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య హజరబీ కూలీ పనులకు వెళ్తోంది. వీరికి నలుగురు సంతానం కాగా..అందరినీ చదివిస్తున్నారు. అందులో పెద్ద కుమార్తె షమీనా. చిన్నప్పటి నుంచే చదువుల సరస్వతిగా రాణిస్తూ వచ్చింది. ఆమె ప్రతిభని గుర్తించిన హుసేన్.. కుమార్తెకు మంచి చదువు చెప్పించాలని అనుకున్నాడు. ఇక షమీనా ఆ అవకాశం అందిపుచ్చుకుంది... చదువుల్లో ప్రతిభ చూపించింది... పదవ తరగతి పరీక్షలలో తన సత్తా చాటాలని అనుకున్నా.. పరీక్షలు రాసే అవకాశం లేకుండా పోయింది. కరోనా వల్ల పదవ తరగతి పరీక్షలు జరుగలేదు. ఇక విజయవాడ జూనియర్ కాలేజీలో బైపీసీ గ్రూప్‌లో చేరింది.

తన లక్ష్యం సాధించే దిశగా ప్లాన్ చేసుకుని చదివిన షమీనా 2023లో జరిగిన ఇంటర్ పరీక్షలలో వేయికి 952 మార్కులు సాధించింది. ఎలాగైనా MBBS సీట్ సాధించాలని పట్టుదలతో అడుగులు వేసింది. ఎంసెట్‌లో 720 మార్కులకు గాను.... 543 మార్కులు సాధించిన షమీనా బిసి కేటగిరిలో 2వేల 699 రాష్ట్ర స్థాయి ర్యాంక్ తెచ్చుకుంది. దీంతో MBBS సీట్ దక్కింది. ఏ కోచింగ్ సెంటర్‌కు వెళ్లకుండా, ఏ ప్రత్యేక శిక్షణ లేకుండా షమీనా డాక్టర్ కోర్స్ సీట్ దక్కించుకోవటంతో హుసేన్ దంపతులు పట్టరాని ఆనందంలో వున్నారు. ప్రతిభకు తప్పకుండా ఫలితం దక్కుతుందని షమీనా నిరూపించి చూపిందని పేరెంట్స్ అంటున్నారు. అంతేకాకుండా తన విజయానికి కారణం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే అంటూ చెప్పు కొచ్చింది షమీనా. వారి ప్రోత్సహమే తనకు బలంగా మారిందని వివరించింది. పేదవారికి సేవచేయడమే తన లక్ష్యం అని చెప్పింది.

గడ్డిలో పడేసినా మల్లె సువాసన దాగదు... అలాగే ప్రతిభ కూడా...అందుకు నిలువెత్తు సాక్షి షమీనా.. పేదరికం చదువుకు అడ్డు కాదని, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చని నిరూపించిన ఈ విద్యా సుమం ఎందరికో స్ఫూర్తి ప్రదాత.

Show Full Article
Print Article
Next Story
More Stories