Bhogi Celebrations: తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సందడి.. భోగి మంటలతో పండగకు ఆహ్వానం

Sankranti Celebrations Begin in Telugu States with Bhogi
x

Bhogi Celebrations: తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సందడి.. భోగి మంటలతో పండగకు ఆహ్వానం

Highlights

Bhogi Festival 2025: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ నెలకొంది.

Bhogi Festival 2025: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ నెలకొంది. మూడురోజుల పాటు అంగరంగ వైభవంగా సాగనున్న సంక్రాంతి తెలుగు వారికి అతిపెద్ద పండగ. అందులో భాగంగా తొలిరోజు భోగి మంటలు వేసి ఆనందంగా పండగకు ఆహ్వానం పలుకుతున్నారు. ఊరూ వాడా భోగి మంటలు వేసి సందడి చేస్తుండటంతో.. తెలుగు లోగిళ్లు వెలుగులీనుతున్నాయి. ఏడాది అంతా తాము పడిన కష్టాలను భోగి మంటలతో అగ్నికి ఆహుతి చేస్తూ.. ఉత్తరాయణంలో తమకు సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాల్లో భాగంగా తెలుగు లోగిళ్లు కొత్త కళ సంతరించుకున్నాయి. చిన్నా పెద్దా.. పల్లె పట్నం తేడా లేకుండా భోగిమంటలు మండుతున్నాయి. మంటల చుట్టూ ఆడిపాడుతూ చిన్నా పెద్దా సందడి చేశారు. యువత నృత్యాలతో హోరెత్తిస్తున్నారు.

తిరుపతి ఎంబీయూలో భోగి సంబరాలు జరుగుతున్నాయి. మంచు మోహన్ బాబు, విష్ణు.. పండగ సందర్భంగా భోగి మంటలు వేశారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు.. కంప్యూటర్ యుగంలో సంప్రదాయాలు మరచిపోతున్నారని.. ఆచారాలు కొనసాగించాలని కోరారు. రైతులకు అధిక దిగుబడులు వస్తేనే నిజమైన సంక్రాంతి అన్న మోహన్ బాబు.. ఈ ఏడాది రైతుల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. తొలిరోజు భోగి సందర్భంగా తెల్లవారుజామునే ప్రజలు భోగి మంటలను వెలిగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద పండుగ కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నూతన ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకుంటున్నారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.

భోగభాగ్యాలను ఇచ్చే భోగి పండుగను, పల్లె పట్నం అనే తేడా లేకుండా ఆనందంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునుంచే భోగి మంటలు వేసి నృత్యాలు చేస్తున్నారు. రాజమండ్రి దేవిచౌక్ సెంటర్‌లో కుటుంబసమేతంగా కాలనీల్లో ఏర్పాటు చేసిన భోగి మంటల దగ్గర సందడి చేశారు ప్రజలు.

భోగి అంటే సుఖం, ఆనందం. సంక్రాంతి ప్రారంభంగా జరుపుకునే ఈ పండుగ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. దక్షిణాయాణంలో పడిన కష్టాలు, సమస్యలన్నీ భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి... రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి అంటూ పండితులు చెబుతారు. అందుకే ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేస్తూ సందడి చేస్తున్నారు శ్రీకాకుళం జల్లా వాసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories